ఇన్‌స్టా రీల్ చేస్తూ జలపాతంలో పడి చనిపోయిన సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్
Social Media Influencer : ఇన్‌స్టా రీల్ చేస్తూ ఓ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ మృతి చెందింది. ఆమె స్నేహితులు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
ఫొటోలు, వీడియోల కోసం చాలా మంది ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ప్రమాదకర ప్రదేశాల్లోకి వెళ్లి వీడియోలు తీస్తూ ప్రాణాలు పొగొట్టుకుంటున్నారు. ఇప్పటికే ఇలాంటి ఘటనలు చాలా జరిగాయి. తాజాగా ఓ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ కూడా జలపాతం దగ్గర రీల్ చేస్తూ కింద పడిపోయింది. దీంతో ఆమె మృతి చెందింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం..
ఆన్వీ కామ్‌దర్ అనే సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ తన స్నేహితులతో కలిసి ముంబయి దగ్గరలోని ఓ జలపాతం దగ్గరకు వెళ్లింది. జలపాతం దగ్గర తన మొబైల్ కెమెరాతో రీల్‌ను రికార్డ్ చేస్తున్నప్పుడు, ఆన్వీ కాలు జారి నేరుగా లోతైన లోయలో పడిపోయింది. ఆమె స్నేహితులు వెంటనే పోలీసులకు సమాచారం అందించగా, వారు స్థానిక వ్యక్తులతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే భారీ వర్షం వల్ల వారు అందులోకి దిగలేదు.
24 గంటల తర్వాత జూలై 17న వర్షం తగ్గుముఖం పట్టడంతో, రెస్క్యూ టీమ్ లోయలోకి దిగగలిగింది. గంటల కొద్దీ వెతకగా ఆన్వీ మృతదేహాన్ని కనుగొన్నారు. రాళ్లు పడిపోవడంతో ఆమెకు తీవ్ర గాయాలై మృతి చెందింది. ముంబైలో చార్టర్డ్ అకౌంటెంట్‌గా పనిచేసిన ఆన్వీకి రీల్స్ చేయడం అంటే చాలా ఇష్టం. ఆమె సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా విస్తృతంగా గుర్తింపు పొందింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు ఆసుపత్రికి తరలించారు.
గతంలో ఇలానే
కొన్ని రోజుల కిందట సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ జంట అయిన గర్విట్ (25), నందిని (22) వారి నివాస భవనం రుహిల్ రెసిడెన్సీలోని గ్రౌండ్ ఫ్లోర్‌లో శవమై కనిపించారు. ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌కు చెందిన వీరిద్దరూ సుమారు రెండు నెలలుగా భవనంలోని ఏడో అంతస్తులో నివసిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉదయం 7 గంటలకు మృతదేహాలు స్థానికులు చూశారు. ప్రాథమిక దర్యాప్తులో వారు తమ ఫ్లాట్ నుండి దూకి ఉండవచ్చని తెలిపారు. అయితే అధికారికంగా ఎలాంటి కేసు నమోదు కాలేదు.
ఈ జంట యూట్యూబ్‌లో క్రమం తప్పకుండా ఫోటోలు, వీడియోలను పోస్ట్ చేసేది. సెక్టార్ -6 పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ ఇన్‌స్పెక్టర్ మహేష్ సంఘటనను ధృవీకరించారు. ఆత్మహత్యగా అనుమానిస్తున్నప్పటికీ, మరణాలకు సంబంధించిన కచ్చితమైన సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.