Samsung foldable phones: ధరలు పెరిగినా తగ్గేదేలే.. ఒకే రోజులో 50 వేల బుకింగ్స్
Samsung foldable phones: ద్రవ్యోల్భణం, ధరల పెరుగుదల మొబైల్ ఫోన్ వినియోగదారులపై గానీ, మొబైల్స్ కొనుగోలుపై గానీ ఎలాంటి ప్రభావం చూపడం లేదనడానికి తాజా ఉదాహరణ ఇది.
ముంబై, ఆగస్టు 17: ద్రవ్యోల్బణంపై కొనసాగుతున్న ఆందోళన.. భారతదేశంలో మొబైల్ ఫోన్ల వ్యాపారాన్ని దెబ్బతీసే అవకాశం లేదని దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్ భావిస్తోంది. ఈ సంవత్సరం దాని ఆదాయంలో రెండంకెల వృద్ధి నమోదవుతుందని అంచనా వేసింది.
కంపెనీ కొత్తగా లాంచ్ చేసిన ఫ్లిప్ అండ్ ఫోల్డ్ మొబైల్ ఫోన్ మోడల్‌ల కోసం 24 గంటల్లోనే 50,000 మంది కస్టమర్‌లు రికార్డుస్థాయిలో ప్రీ-బుకింగ్ చేసుకున్నారని శాంసంగ్ ఉత్పత్తుల మార్కెటింగ్ హెడ్ ఆదిత్య బబ్బర్ పీటీఐకి తెలిపారు. వీటి ధరలు రూ. 90,000 - రూ. 1.5 లక్షల మధ్య ఉన్నాయి.
‘మా అంతర్గత అంచనాల ప్రకారం అమ్మకాల వృద్ధి కొనసాగుతుంది. 2 రెంట్ల కంటే ఎక్కువ వేగంతో దూసుకుపోతాం..’ అని బబ్బర్ చెప్పారు. 2022లో పరిశ్రమ సింగిల్ డిజిట్‌లోనే వృద్ధి చెందుతుందని అంచనా వేస్తున్నామని, అదే సమయంలో తాము రెండంకెల వృద్ధిని లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు.
ప్రీమియం కేటగిరీలో గడిచిన ఏడాది కాలంగా అమ్మకాలలో 1.5 రెట్లు వృద్ధిని చూసిందని బబ్బర్ చెప్పారు. అయితే 2021లో విక్రయించిన మొబైల్స్ సంఖ్య వెల్లడించడానికి నిరాకరించారు.
అధిక ద్రవ్యోల్బణం, గ్రామీణ డిమాండ్ మందగించడం, అధిక నిరుద్యోగం వంటి ఇతర సమస్యలతో పాటు ఆర్థిక వ్యవస్థను నడిపించే కీలకమైన అంశమైన వస్తు వినియోగం తగ్గుదలపై ఆందోళనలు ఉన్నాయి.
వినియోగదారుల ఆకాంక్షలను నెరవేర్చడానికి బ్రాండ్ అవలంబించిన అతిపెద్ద వ్యూహాలలో సులభమైన ఫైనాన్స్ అందించడం ఒకటని బబ్బర్ చెప్పారు.
నాన్-బ్యాంకింగ్ రుణదాతలతో ఒప్పందాలు కుదుర్చుకోవడంతో చాలా మంది ఖరీదైన ఫోన్‌లను కొనుగోలు చేయడానికి ఫైనాన్సింగ్ సదుపాయం పొందుతున్నారని వివరించారు. ఈ కారణంగా అవుట్‌లెట్‌లలో సగటు అమ్మకపు ధర పెరుగుతుందని ఆయన అన్నారు.
మొబైల్ ఫోన్ విక్రయాల కోసం వినియోగదారులు తీసుకున్న రుణాల మొత్తం, తిరిగి చెల్లించేందుకు వడ్డీ రేట్ల గురించి అడిగినప్పుడు.. పరిశ్రమలో తమ రికార్డు అత్యుత్తమంగా ఉందని చెప్పారు.
ఈ ఏడాది వివిధ కస్టమర్ సెగ్మెంట్లలో మొత్తం 16 మొబైల్స్ లాంచ్ చేశామని, ఒకే ఏడాదిలో అత్యధిక సంఖ్యలో మోడల్స్ ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి అని ఆయన చెప్పారు.
ప్రీమియం సెగ్మెంట్‌లో కొత్తగా లాంచ్ అయిన ఫోన్‌లు 10,000 స్టోర్‌లలో లభ్యమవుతాయి. ప్రత్యర్థి బ్రాండ్‌ల వినియోగదారులను కూడా తన వైపునకు తిప్పుకునేందుకు శాంసంగ్ ప్రయత్నాలు చేస్తోంది.
ఫోల్డ్, ఫ్లిప్ ఫోన్ మోడల్‌లను ప్రస్తావిస్తూ ముందస్తు బుకింగ్ వల్ల వాచీలు, బడ్స్ వంటి ఉపకరణాలపై భారీ తగ్గింపు లభిస్తుందని బబ్బర్ వివరించారు.
కంపెనీ మొదటిసారిగా 2019లో ఫ్లిప్ అండ్ ఫోల్డ్ కేటగిరీని ప్రారంభించిందని, ఇప్పుడు 16 రెట్లు వృద్ధి చెందిందని, ఇదే మెయిన్ స్ట్రీమ్ మొబైల్‌గా మారుతోందని బబ్బర్ చెప్పారు.