Sadhguru Feet Pic : సద్గురు జగ్గీ వాసుదేవ్ పాదం ఫోటోకు రూ.3200!-sadhgurus feet pic selling in online for 3200 rupees goes viral ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Sadhguru Feet Pic : సద్గురు జగ్గీ వాసుదేవ్ పాదం ఫోటోకు రూ.3200!

Sadhguru Feet Pic : సద్గురు జగ్గీ వాసుదేవ్ పాదం ఫోటోకు రూ.3200!

Anand Sai HT Telugu
Oct 02, 2024 11:39 AM IST

Sadhguru Feet Pic In Online : సద్గురు జగ్గీ వాసుదేవ్ పాదం ఫోటో ఆయన అధికారిక వెబ్‌సైట్‌లో రూ.3,200కి అమ్ముడవుతుండడం సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై కొంతమందికి విమర్శలు చేస్తున్నారు.

అమ్మకానికి సద్గురు పాదం ఫొటో
అమ్మకానికి సద్గురు పాదం ఫొటో

సద్గురు జగ్గీ వాసుదేవ్ పాదాల ఫోటో రూ.3,200కి అమ్ముడవుతున్నట్టుగా సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇషా ఫౌండేషన్ ఆన్‌లైన్ షాప్‌లో ఈ ఫోటో ఉంది. దీనిపై చాలా మంది వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

67 ఏళ్ల సద్గురు తమిళనాడులోని కోయంబత్తూరు సమీపంలో ఉన్న ఇషా ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు. ఆధ్యాత్మికత, ధ్యానం, యోగా, స్వీయ అవగాహనపై చేసే బోధనలకు సద్గురు అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందారు. అయితే ఇప్పుడు ఇషా లైఫ్ ఇ-షాప్‌లో సద్గురు పాదాల ఫోటో రూ.3,200కి ఉండటం వైరల్ అయింది. 'గురువు పాదాలకు నమస్కరించడం అనేది మంచిది . గురువుతో లోతైన సంబంధాన్ని ఏర్పరుస్తుంది.' అని ఫోటోకు వివరణ రాశారు. అయితే ఇంటర్నెట్‌ కొందరు దీనిపై విమర్శలు చేస్తున్నారు. మరికొందరు నవ్వుకుంటున్నారు.

ఇషా ఫౌండేషన్‌లో సోదాలు

మరోవైపు కోయంబత్తూరులోని తొండముత్తూర్‌లోని ఇషా ఫౌండేషన్ ఆశ్రమంలో 150 మంది పోలీసు అధికారుల బృందం తాజాగా సోదాలు నిర్వహించింది. ఇద్దరు మహిళలను నిర్భందించారనే ఆరోపణలపై కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు తనిఖీలు చేశారు. మరోవైపు ఇషా ఫౌండేషన్‌పై నమోదైన కేసులపై హైకోర్టు నివేదిక కోరింది.

రిటైర్డ్ ప్రొఫెసర్ ఎస్ కామరాజ్ దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్‌పై ప్రతిస్పందనగా దర్యాప్తు మెుదలైంది. తన ఇద్దరు కుమార్తెలను యోగా కేంద్రంలో వారి ఇష్టానికి వ్యతిరేకంగా ఉంచారని కామరాజ్ పేర్కొన్నారు. ఇషా ఫౌండేషన్ వ్యక్తుల బ్రెయిన్‌వాష్ చేసి, వారిని సన్యాసులుగా మారుస్తున్నారని ఆరోపించారు. కుటుంబాలతో సంబంధాలు కొనసాగించకుండా అడ్డుకుంటున్నదని కామరాజ్ పిటిషన్‌లో పేర్కొన్నారు.

జస్టిస్‌ ఎస్‌ఎం సుబ్రమణ్యం, వి.శివజ్ఞానంలతో కూడిన ధర్మాసనం ఇషా ఫౌండేషన్‌లోని పద్ధతులపై ప్రశ్నలను లేవనెత్తింది. జగ్గీ వాసుదేవ్ తన కుమార్తెకు వివాహం చేసి స్థిరపడేలా చేశారని, కానీ యువతులను సన్యాసులుగా జీవించమని ఎందుకు ప్రోత్సహించారని కోర్టు ప్రశ్నించింది. పిటిషనర్ తరపు న్యాయవాది కూడా ఫౌండేషన్‌పై అనేక క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. ఇషా యోగా సెంటర్‌కు సంబంధించిన ఒక వైద్యుడిపై పోక్సో చట్టం కింద కేసు బుక్ అయిన విషయాన్ని కూడా తెలిపారు. దీనిపై ఇషా ఫౌండేషన్ స్పందించింది. ఆరోపణలను తోసిపుచ్చింది.