Rishi Sunak UK PM : ‘పోటీ చేస్తున్నా’- యూకే ప్రధాని రేసులో రిషి సునక్
Rishi Sunak UK PM candidate : బ్రిటన్ ప్రధాని పదవి కోసం తాను పోటీ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు రిషి సునక్. ఈ మేరకు ట్వీట్ చేశారు.
Rishi Sunak UK PM : బ్రిటన్ ప్రధాని రేసులో తాను ఉన్నట్టు అధికారికంగా ప్రకటించారు భారత సంతతి రిషి సునక్. దేశ ఆర్థిక వ్యవస్థను గాడినపెట్టడం, పార్టీలో ఐకమత్యాన్ని తీసుకురావడం కోసం తాను పోటీ చేస్తున్నట్టు ఆదివారం తెలిపారు.
రిషి సునక్‌కు ఇప్పటికే 100మందికి పైగా కన్జర్వేటివ్ పార్టీ ఎంపీల మద్దతు ఉంది. బ్రిటన్ ప్రధాని రేసులో పాల్గొనాలంటే.. అభ్యర్థికి కనీసం 100మంది పార్టీ సభ్యుల మద్దతు అవసరం.
"దేశ ఆర్థిక వ్యవస్థను ఫిక్స్ చేయాలని నాకు ఉంది. పార్టీలో ఐకమత్యాన్ని తీసుకురావాలని ఉంది. గతంలో కన్నా బ్రిటన్ ప్రజల అవకాశాలను మెరుగుపరచాలా లేదా అన్నది ఇప్పుడు ఇక నా పార్టీ నిర్ణయించాలి," అని రిషి సునక్ ట్వీట్ చేశారు.
పోటీలో ముగ్గురు..!
UK next PM : ఈసారి ప్రధాని రేసులో ఈసారి ముగ్గురు ఉండే అవకాశం ఉంది. పోటీలో ఉన్నట్టు పెన్నీ మోర్డౌంట్ ఇప్పటికే ప్రకటించారు. ఇక ఇప్పుడు ఈ జాబితాలోకి 42ఏళ్ల రిషి సునక్ చేరారు. మూడో పోటీదారుడిగా.. మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ నిలిచే అవకాశం ఉంది. ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడకపోయినా.. రేసులో నిలబడేందుకు బోరిస్ సన్నద్ధమవుతున్నట్టు వార్తలు వచ్చాయి.
ఈ వార్తలకు మరింత బలం చేకూర్చే విధంగా.. శనివారమే బోరిస్ జాన్సన్ రిషి సునక్‌తో భేటీ అయ్యారు. ఎన్నికల విషయంపై, పార్టీలో చీలక రాకుండా చూసుకునే విషయంపై చర్చలు జరిగినట్టు తెలుస్తోంది.
బోరిస్ జాన్సన్ రాజీనామాతో.. జులైలో మొదలైన బ్రిటన్ ప్రధాని ఎన్నిక ప్రక్రియ.. ఆగస్టు చివరి వరకు సాగింది. అందులో గెలిచి.. సెప్టెంబర్‌లో బాధ్యతలు చేపట్టారు లిజ్ ట్రస్. అయితే.. ఈసారి అంత సుదీర్ఘంగా ఎన్నిక ప్రక్రియ సాగదు. అన్ని అనుకున్నట్టు జరిగితే.. ఈ నెల 28తో బ్రిటన్ ఎన్నిక ప్రక్రియ ముగుస్తుంది.
లిజ్ ట్రస్ రాజీనామా..
UK Politics : ప్రధాని పదవిని చేపట్టిన 45రోజులకే బాధ్యతల నుంచి తప్పుకున్నట్టు ప్రకటించారు లిజ్ ట్రస్. ఆర్థిక వ్యవస్థకు ఆమె సూచించిన మార్పులు బెడిసికొట్టడంతో ఒత్తిడి పెరిగి, రాజీనామా చేయకతప్పలేదు. ఫలితంగా మళ్లీ ఎన్నికలు అనివార్యమయ్యాయి.
గత ఎన్నికల్లో రిషి సునక్‌కు తొలినాళ్లల్లో మద్దతు భారీగా లభించింది. కానీ చివర్లో ఆయన గెలవలేకపోయారు. ఈసారి కూడా ఆయనకు మద్దతు పెరుగుతోంది. బోరిస్ మద్దతుదారులు కూడా రిషి సునక్‌కు ఓటు వేసే యోచనలో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. మరి ఈసారి రిషి సునక్ గెలుస్తారా? బ్రిటన్ ప్రధాని పదవిని చేపట్టిన తొలి భారత సంతతి వ్యక్తిగా నిలుస్తారా? మరి ఇప్పుడు ఏం జరుగుతుందో వేచి చూడాలి.
సంబంధిత కథనం