Black tigers: ఒడిశా అడవుల్లో అరుదైన నల్ల పులులు; ఇంటర్నెట్లో ఫొటోలు వైరల్
Black tigers: ఒడిశా అడవుల్లో కనిపించిన నల్ల పులుల ఫొటోలు ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ గా మారాయి. ఒడిశాలో విధుల్లో ఉన్న ఒక ఐఎఫ్ఎస్ అధికారి ఈ ఫొటోలను పోస్ట్ చేశారు.
Black tigers: ఒడిశాలోని సిమిలిపాల్ అటవీ ప్రాంతంలో ఈ నల్ల పులి కనిపించింది. వీటిపై ఉన్న నల్ల చారలు జన్యు పరివర్తన కారణంగా ఏర్పడుతాయి. వీటిని 'సూడో మెలానిస్టిక్ (pseudo-melanistic tigers)' పులులు అంటారు.
అందమైన పులులు
'సూడో మెలానిస్టిక్ (pseudo-melanistic tigers)' పులుల ఫొటోలను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి పర్వీన్ కాశ్వాన్ తన ట్విటర్ అకౌంట్ లో "భారతదేశంలో నల్ల పులులు" అనే క్యాప్షన్ తో షేర్ చేశారు. ఈ అరుదైన పులుల చిత్రాలను ఆయన షేర్ చేయడంతో అవి అందరి దృష్టిని ఆకర్షించడంతో పాటు వైరల్ గా మారాయి. ‘‘సిమిలిపాల్ లో సూడో మెలానిస్టిక్ పులులు ఉన్నాయని మీకు తెలుసా. అవి జన్యు పరివర్తన కారణంగా అలా ఉంటాయి. అవి చాలా అరుదైనవి. అంతేకాదు, చాలా అందమైనవి కూడా..’’ అని ఆయన పోస్ట్ చేశారు.
1993 లో మొదటిసారి..
ఈ సూడో-మెలనిస్టిక్ పులులు లేదా నల్ల పులులను మొదట 1993లో చూశారు. 1993 జూలై 21న పొడగడ్ గ్రామానికి చెందిన సల్కు అనే యువకుడు ఆత్మరక్షణ కోసం బాణాలతో ఒక 'నల్ల' పులిని కాల్చి చంపాడు. నల్ల పులి భారత రికార్డులలోకి చేరడం అదే ప్రథమం. అరుదైన జన్యు పరివర్తన కారణంగా ఇవి చాలా తక్కువ సంఖ్యలో ఉంటాయి. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి పర్వీన్ కాశ్వాన్ ఈ నల్ల పులుల ఫొటోలను డిసెంబర్ 22న తన ట్విటర్ అకౌంట్ లో పోస్ట్ చేశారు. పోస్ట్ చేసినప్పటి నుంచి లక్షకు పైగా వ్యూస్ సాధించింది. అలాగే, 4 వేలకు పైగా లైక్స్, కామెంట్లు వచ్చాయి.