Sidhu Moose Wala | ‘సిద్ధూ’ మరణంతో పంజాబ్ రాజకీయాల్లో ప్రకంపనలు..
Sidhu Moose Wala | సిద్ధూ మూసేవాలా దారుణ హత్యతో పంజాబ్ ఉలిక్కిపడింది. ఈ ఘటనతో ప్రభుత్వంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.
Sidhu Moose Wala | ప్రముఖ సింగర్ సిద్ధూ మూసేవాలాను దుండగులు కాల్చి చంపిన ఘటన పంజాబ్‌లో తీవ్ర కలకలం సృష్టించింది. పంజాబ్ ప్రభుత్వం.. అనేకమందికి భద్రతను తొలగిస్తున్న నేపథ్యంలో సిద్ధూ మరణ వార్త తీవ్ర చర్చలకు దారితీస్తోంది. ఈ క్రమంలోనే ఆప్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పంజాబ్‌లో శాంతిభద్రతలు కుప్పకూలినట్టు ఆరోపించారు ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్. నేరస్థులు.. చట్టాలకు భయపడే పరిస్థితులు రాష్ట్రంలో లేవని అన్నారు. సీఎం భగవంత్ మన్ ప్రభుత్వం విఫలమైందని, వారి పాలనలో పంజాబ్‌లో ఎవరికి భద్రత లేదని మండిపడ్డారు.
"సిద్ధూ దారుణ హత్యకు గురైన ఘటన షాక్‌గా ఉంది. అతని కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. రాష్ట్రంలో శాంతిభద్రతలు కుప్పకూలాయి. నేరస్థులు భయపడటం లేదు," అని అమరీందర్ సింగ్ ట్వీట్ చేశారు.
పంజాబ్ మాజీ డిప్యూటీ సీఎం సుఖ్జిందర్ సింగ్ సైతం ప్రభుత్వంపై విమర్శలు చేశారు. 'పంజాబ్ డీజీపీని అరెస్ట్ చేయాలి. ఈ వ్యవహారంలో కేంద్రం తక్షణమే స్పందించాలి. ఇది శాంతిభద్రతలకు సంబంధించిన విషయం,' అని అన్నారు.
గ్యాంగ్‌స్టర్ పనేనా?
పంజాబీ సింగర్ సిద్ధూ మూసేవాలా.. ఆదివారం జరిగిన కాల్పుల్లో దుర్మరణం చెందారు. మాన్స జిల్లాలోని జవాహర్కే గ్రామంలో ఈ ఘటన జరిగింది. 424మందికి పంజాబ్ పోలీసులు.. భద్రతను ఉపసంహరించిన మరుసటి రోజే ఈ ఘటన చోటుచేసుకోవడం సర్వత్రా ఆందోళనకరంగా మారింది.
Sidhu Moose Wala death | సిద్ధూ ప్రయాణిస్తున్న వాహనంపై దుండగులు బుల్లెట్ల వర్షం కురిపించారు. రక్తపు మడుగులో పడి ఉన్న సింగర్‌ని తక్షణమే ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆయన మరణించినట్టు వైద్యులు ధ్రువీకరించారు. ఈ ఘటనలో మరో ఇద్దరు కూడా గాయపడినట్టు సమాచారం.
కాగా.. ఈ ఘటనపై పంజాబ్ పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. గ్యాంగ్స్టర్ల కక్షల్లో భాగంగానే ఈ హత్య జరిగిందని అనుమానిస్తున్నట్టు పంజాబ్ డీజీపీ వీకే భార్వా వెల్లడించారు. లారెన్స్ బిష్ణోయి బృందం, కెనడాకు చెందిన సింగర్ గోల్డి బ్రార్.. సిద్ధూ హత్యలో కీలకం వ్యవహరించినట్టు తెలుస్తోందని అన్నారు.
ఆదివారం సాయంత్రం 5:30 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్టు అధికారులు వెల్లడించారు. కాగా.. సిద్ధూకు శనివారం వరకు నలుగురు భద్రతా సిబ్బంది ఉండేవారని.. వారిలో ఇద్దరిని తగ్గించినట్టు అంగీకరించారు. కానీ ఘటన జరిగినప్పుడు.. ఇద్దరు బాడీగార్డులను తన వెంటనే తీసుకెళ్లేందుకు సిద్ధూ నిరాకరించారని పేర్కొన్నారు. బుల్లెట్ ప్రూఫ్ కారును కూడా తీసుకెళ్లలేదని స్పష్టం చేశారు.
రెండు కార్లు.. సిద్ధూ వాహనాన్ని అడ్డగించి, 30రౌండ్లకుపైగా బుల్లెట్ల వర్షాన్ని కురిపించినట్టు సమాచారం.
'ఎవరిని విడిచిపెట్టము..'
Sidhu Moose Wala latest news | సిద్ధూ మూసేవాలా దారుణ హత్యపై పంజాబ్ సీఎం భగవంత్ మన్ స్పందించారు. ఘటనతో తాను షాక్‌కు గురైనట్టు వెల్లడించారు. ఘటనకు బాధ్యులను ఎవరిని విడిచిపెట్టమని హామీనిచ్చారు. అందరు శాంతిగా ఉండాలని పిలుపునిచ్చారు.
ప్రముఖుల నివాళి..
2022 పంజాబ్ ఎన్నికల్లో.. కాంగ్రెస్ టికెట్ మీద మాన్స నియోజకవర్గం నుంచి పోటీ చేశారు సిద్ధూ. కానీ ఆప్ అభ్యర్థి విజయ్ సింగ్లా చేతిలో దారుణంగా ఓడిపోయారు.
సిద్ధూ పూర్తిపేరు.. సుభ్‌దీప్ సింగ్ సిద్ధూ. 1993 జూన్ 17న.. మూసేవాలా గ్రామంలో ఆయన జన్మించారు. తన పాటలు, ర్యాప్‌లతో లక్షలాది మంది అభిమానులను సొంతం చేసుకున్నారు.
సిద్ధూకు అనేకమంది నివాళులర్పించారు. కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతిచేకూరాలని పలువురు బీజేపీ నేతలు ప్రార్థించారు.
సంబంధిత కథనం
టాపిక్