Priyanka Gandhi: “నెహ్రూ ఇంటి పేరు”పై వ్యాఖ్యలు చేసిన మోదీపై కేసు ఎందుకు లేదు?: బీజేపీపై ప్రియాంక గాంధీ అటాక్-priyanka gandhi attacks bjp over rahul gandhi disqualification says insulting my martyr father ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Priyanka Gandhi: “నెహ్రూ ఇంటి పేరు”పై వ్యాఖ్యలు చేసిన మోదీపై కేసు ఎందుకు లేదు?: బీజేపీపై ప్రియాంక గాంధీ అటాక్

Priyanka Gandhi: “నెహ్రూ ఇంటి పేరు”పై వ్యాఖ్యలు చేసిన మోదీపై కేసు ఎందుకు లేదు?: బీజేపీపై ప్రియాంక గాంధీ అటాక్

Chatakonda Krishna Prakash HT Telugu
Mar 26, 2023 03:02 PM IST

Priyanka Gandhi - Rahul Gandhi Disqualification: బీజేపీ, ప్రధాని మోదీపై కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. అమరుడి కుమారుడైన తన సోదరుడిని, తన కుటుంబాన్ని బీజేపీ నిత్యం అవమానిస్తోందని, అయినా ఆ పార్టీ వారిపై కేసులు ఎందుకు లేవని ప్రశ్నించారు.

Priyanka Gandhi: “నెహ్రూ ఇంటి పేరు”పై వ్యాఖ్యలు చేసిన మోదీపై కేసు ఎందుకు లేదు?: బీజేపీపై ప్రియాంక గాంధీ అటాక్
Priyanka Gandhi: “నెహ్రూ ఇంటి పేరు”పై వ్యాఖ్యలు చేసిన మోదీపై కేసు ఎందుకు లేదు?: బీజేపీపై ప్రియాంక గాంధీ అటాక్ (HT_PRINT)

Priyanka Gandhi - Rahul Gandhi Disqualification: అధికార భారతీయ జనతా పార్టీ (BJP)పై కాంగ్రెస్ జాతీయ జనరల్ సెక్రటరీ, రాహుల్ గాంధీ సోదరి ప్రియాంక గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీగా రాహుల్ గాంధీ(Rahul Gandhi)పై వేసిన అనర్హత వేటును వ్యతిరేకిస్తూ ఢిల్లీలోని రాజ్‍ఘాట్ వద్ద కాంగ్రెస్ ఆదివారం చేపట్టిన సత్యాగ్రహ (Congress Satyagraha) దీక్షలో ఆమె పాల్గొన్నారు. బీజేపీపై మాటల దాడి చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) పిరికితనం చూపిస్తున్నారని ప్రియాంక గాంధీ విమర్శించారు. అహంకారాన్ని ప్రదర్శించిన రాజులందరూ ఓటమిపాలయ్యారని గుర్తుంచుకోవాలని అన్నారు. “అవును, నాపై కేసు నమోదు చేసి, నన్ను జైలులో పెట్టండి. అయినా సరే, ప్రధాన మంత్రి భయపడుతున్నారని నేను అంటాను” అని ప్రియాంక గాంధీ అన్నారు. ఇంకా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.

“అమరుడి కుమారుడిని అవమానిస్తారా”

Priyanka Gandhi - Rahul Gandhi Disqualification: తన తండ్రి రాజీవ్ గాంధీ దేశం కోసం ప్రాణాలు అర్పించారని ప్రియాంక గాంధీ అన్నారు. అలాంటి అమరుడి కుమారుడైన రాహుల్ గాంధీని బీజేపీ ప్రతీరోజు అవమానిస్తోందని, గాంధీ-నెహ్రూ కుటుంబాన్ని కూడా ఆ పార్టీ వదలడం లేదని ఆరోపించారు. “అమరుడి కుమారుడైన మా సోదరుడిని దేశద్రోహి, మీర్ జాఫర్ అని అంటారా. మీరు ఆయన తల్లిని కూడా అవమానించారు. నా కుటుంబాన్ని మీరు ప్రతీరోజు అవమానిస్తున్నారు. అయినా మీపై (బీజేపీ నేతలు) ఎలాంటి కేసు లేదు” అని ప్రియాంక అన్నారు.

"అయినా మోదీపై కేసు లేదు"

Priyanka Gandhi - Rahul Gandhi Disqualification: నెహ్రూ ఇంటి పేరు ఎందుకు వాడుకోవడం లేదంటూ తమను నిండు పార్లమెంటులో అవమానించిన ప్రధాని మోదీపై కేసు ఎందుకు నమోదు కాలేదని ప్రియాంక గాంధీ అన్నారు. “నిండు సభలో ప్రధాని అయిన మీరు ‘ఈ కుటుంబం నెహ్రూ ఇంటి పేరును ఎందుకు వాడుకోవడం లేదు’ అని అన్నారు. ఆయన మొత్తం కశ్మీరీ పండిట్లను అవమానించారు. తండ్రి ఇంటి పేరును కుమారుడు కొనసాగించుకునే సంప్రదాయాన్ని కించపరుస్తూ మోదీ మాట్లాడారు. అయినా ఆయనపై కేసు లేదు. పార్లమెంటు నుంచి ఎవరూ బయటికి పంపించలేదు” అని ప్రియాంక అన్నారు.

పప్పూ అంటూ అవమానించారు

Priyanka Gandhi - Rahul Gandhi Disqualification: ప్రపంచంలోనే రెండు ప్రతిష్ఠాత్మక విద్యాలయాల్లో చదివిన తన సోదరుడు రాహుల్ గాంధీని మీడియా సాయంతో పప్పూ అని ప్రచారం చేశారని బీజేపీపై ప్రియాంక గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. “ప్రపంచంలోనే ప్రతిష్ఠాత్మకమైన రెండు ఎడ్యుకేషనల్ ఇన్‍స్టిట్యూషన్లలో నా సోదరుడు చదివారు. ఆయన డిగ్రీలు మీరు చూడలేదు. కానీ మీడియా సాయంతో పప్పూ అని ఆయనపై ముద్ర వేశారు. కోట్లాది మంది ఆయన వెంట నడవడం చూసి భయపడ్డారు” అని ప్రియాంక గాంధీ అన్నారు.

2019లో కర్ణాటకలో ప్రధాని మోదీ ఇంటి పేరుపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో నమోదైన పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీని దోషిగా నిర్ధారిస్తూ శుక్రవారం తీర్పు చెప్పింది సూరత్ కోర్టు. ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో ఎంపీగా ఆయనపై అనర్హత వేటు విధించింది లోక్‍సభ. అయితే అదానీ, మోదీ బంధంపై ప్రశ్నిస్తున్నందుకే బీజేపీ కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని, తాను పోరాడుతూనే ఉంటానని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ఇక ఈ విషయంపై పైకోర్టులో అప్పీలు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది.

Whats_app_banner

సంబంధిత కథనం