PM Modi: “నేను పామునే.. కానీ”: ఖర్గే వ్యాఖ్యలకు ప్రధాని మోదీ దీటైన స్పందన-prime minister narendra modi responds kharge poisonous snake comment in karnataka elections rally ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Pm Modi: “నేను పామునే.. కానీ”: ఖర్గే వ్యాఖ్యలకు ప్రధాని మోదీ దీటైన స్పందన

PM Modi: “నేను పామునే.. కానీ”: ఖర్గే వ్యాఖ్యలకు ప్రధాని మోదీ దీటైన స్పందన

Chatakonda Krishna Prakash HT Telugu
Apr 30, 2023 03:05 PM IST

PM Modi - Karnataka Elections 2023: కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే “పాము” కామెంట్‍కు ప్రధాని మోదీ స్పందించారు. కొలార్ సభ వేదికగా ఆయన దీటైన జవాబిచ్చారు.

PM Modi: “నేను పామునే.. కానీ”: ఖర్గే వ్యాఖ్యలకు ప్రధాని మోదీ దీటైన స్పందన (Photo: Twitter/BJP)
PM Modi: “నేను పామునే.. కానీ”: ఖర్గే వ్యాఖ్యలకు ప్రధాని మోదీ దీటైన స్పందన (Photo: Twitter/BJP)

PM Modi - Karnataka Elections 2023: “విషపూరితమైన పాము” అంటూ తనను విమర్శించిన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) స్పందించారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఆ రాష్ట్రంలోని కొలార్‌(Kolar)లో జరిగిన సభలో ప్రధాని మాట్లాడారు. ఖర్గే విమర్శలుకు దీటైన సమాధానం చెప్పారు. అవినీతిపై పోరాడుతున్నందుకే తనను కాంగ్రెస్ ఇంతలా ద్వేషిస్తోందని మోదీ అన్నారు.

PM Modi - Karnataka Elections 2023: ఈశ్వరుడి మెడలో పాము ఉంటుందని, తనకు ప్రజలే ఈశ్వరులని ప్రధాని మోదీ అన్నారు. తాను ప్రజలకు ఆ పాము లాంటి వాడినని, ఎప్పుడూ వారితోనే ఉంటానని ఆయన స్పష్టం చేశారు. “దేశాన్ని మరింత పటిష్టంగా చేసేందుకు, అవినీతిని కూకటివేళ్లతో పెకిలించి వేసేందుకు మా ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇది కాంగ్రెస్‍కు నచ్చడం లేదు. దీనికి వ్యతిరేకంగా నన్ను ‘విషపూరితమైన పాము’అని వారు పిలుస్తున్నారు. నేను ఇప్పుడు మీకు చెబుతున్నా.. భగవాన్ ఈశ్వరుడి మెడలో పాము ఎప్పుడూ ఉంటుంది. నాకు ఈ దేశ ప్రజలు ఈశ్వరుడితో సమానం. నేను ఎల్లప్పుడూ వారితోనే ఉండే వారి పామును. మే 13న కర్ణాటక ప్రజలు కాంగ్రెస్‍కు తగిన సమాధానం చెబుతారు” అని మోదీ అన్నారు.

కాంగ్రెస్ 85శాతం కమీషన్ పార్టీ

PM Modi - Karnataka Elections 2023: కాంగ్రెస్ పార్టీపై మరిన్ని విమర్శలు కురిపించారు ప్రధాని మోదీ. “కాంగ్రెస్ 85శాతం కమీషన్ పార్టీ. ఆ పార్టీకి చెందిన గత ప్రధానే ఒకసారి ఈ విషయాన్ని అంగీకరించారు. కర్ణాటకలో మళ్లీ అధికారంలోకి వచ్చి, రాష్ట్రాన్ని దోచేయాలని వారు చాలా బలంగా ప్రయత్నిస్తున్నారు. అది జరగదు. ఎందుకంటే డబుల్ ఇంజిన్ ప్రభుత్వ సామర్థ్యం ప్రజలకు తెలుసు. కాంగ్రెస్, జేడీఎస్‍కు కోలార్ ప్రజలు.. నిద్రలేని రాత్రులు ఇస్తారు” అని నరేంద్ర మోదీ పేర్కొన్నారు.

కోలార్ సభ తర్వాత చెన్నపట్నకు ప్రధాని మోదీ వెళతారు. అక్కడ మరో సభలో ప్రసంగిస్తారు. చెన్నపట్న నియోజకవర్గం నుంచి మాజీ సీఎం, జేడీఎస్ అధినేత కుమారస్వామి పోటీ చేస్తున్నారు. అలాగే, మైసూరులో ఆదివారం సాయంత్రం మోదీ మెగా రోడ్‍షో నిర్వహిస్తారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మే 10వ తేదీన జరుగుతుంది. మే 13వ తేదీన ఓట్లు లెక్కింపు, ఫలితాల వెల్లడి ఉంటుంది.

Karnataka Elections 2023: కర్ణాటకలో అధికారాన్ని నిలబెట్టుకోవాలని బీజేపీ తీవ్రంగా కృషి చేస్తోంది. ప్రధాని మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో పాటు బీజేపీ అగ్రనాయకులంతా ఆ రాష్ట్రంలో ముమ్మరంగా ప్రచారం చేస్తోంది. మరోవైపు కాంగ్రెస్ కూడా మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు తీవ్రంగా ప్రచారం చేస్తోంది. కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ.. వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. సభల్లో ప్రసంగిస్తున్నారు. జేడీఎస్ కూడా కర్ణాటకలో కీలక పార్టీగా ఉంది. వీలైనన్ని ఎక్కువ స్థానాలు సాధించి మరోసారి కింగ్ మేకర్‌గా నిలువాలని ఆ పార్టీ పట్టుదలగా ఉంది.

Whats_app_banner