PM Modi in UP: ``డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఉంటే ఇదే ప్రయోజనం``
PM Modi in UP: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం ఉత్తరప్రదేశ్‌లోని బుందేల్‌ఖండ్ ప్రాంతంలో `ఎక్స్‌ప్రెస్ వే`ను ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్రం, రాష్ట్రం రెండు చోట్లా ఒకే పార్టీ ప్రభుత్వం ఉండడం వల్ల ప్రయోజనాలను వివరించారు.
Bundelkhand Expressway: బుందేల్ ఖండ్ ఎక్సప్రెస్ వేను రూ. 14,850 కోట్లతో నిర్మించారు. ఇది 296 కిమీల పొడవైన 4 లేన్ ఎక్స్‌ప్రెస్ వే. 28 నెలల రికార్డు సమయంలో దీన్ని పూర్తి చేశారు. శనివారం ప్రధాని మోదీ ఈ ఎక్స్‌ప్రెస్ వేను ప్రారంభించారు.
Bundelkhand Expressway: యోగిప్రై ప్రశంసలు
ప్రధాని మోదీకి ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ జాలౌన్ లో స్వాగతం పలికారు. అనంతరం బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్ వే ను ప్రధాని ప్రారంభించారు. ఈ సందర్బంగా అక్కడ మొక్కలు నాటారు. అనంతరం, అక్కడి బహిరంగ సభలో ప్రసంగించారు. యూపీ సీఎంగా యోగి ఆదిత్యనాథ్ బాధ్యతలు చేపట్టిన తరువాత రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి మెరుగుపడిందని, అలాగే, రాష్ట్రం అభివృద్ది పథంలో దూసుకుపోతోందని సీఎం యోగిపై ప్రధాని ప్రశంసల వర్షం కురిపించారు. గతంలో అభివృద్ధి అన్ని ఇతర రాష్ట్రాల కన్నా యూపీ చాలా వెనుకబడి ఉండేదని, లా అండ్ ఆర్డర్ కూడా దారుణంగా ఉండేదని గత ప్రభుత్వాల పనితీరును విమర్శించారు.
Bundelkhand Expressway: డబుల్ ఇంజిన్ ప్రభుత్వం
డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఉండడం వల్ల ప్రయోజనాలను యూపీ ఇప్పుడు చవి చూస్తోందన్నారు. కేంద్రం, రాష్ట్రంలో ఒకే పార్టీ ప్రభుత్వం ఉండడం వల్ల రాష్ట్రం అభివృద్ది పథంలో దూసుకుపోతోందన్నారు. గత ప్రభుత్వాల హయాంలో యూపీ అభివృద్దిలో చాలా వెనుకబడి ఉండేదని, అభివృద్దికి దూరంగా గ్రామాలు, శాంతి భద్రతల లేమిలో పట్టణాలు, సరైన వసతులు లేని నగరాలతో కునారిల్లుతుండేదని వ్యాఖ్యానించారు. ఉన్న కొన్ని పరిశ్రమలు కూడా మూతపడిపోయాయన్నారు. బీజేపీ సర్కారు వచ్చిన తరువాత అభివృద్దిలో యూపీ ఇతర అభివృద్ధి చెందిన రాష్ట్రాలతో పోటీ పడుతోందని వివరించారు.
Bundelkhand Expressway: ఎక్స్‌ప్రెస్ వే ప్రయోజనాలు
ఈ బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్ వే వల్ల చిత్రకూట్ ప్రాంతంలో అభివృద్ధి వేగవంతం అవుతుందని ప్రధాని తెలిపారు. ``ఈ రహదారితో ఢిల్లీ - చిత్రకూట్ ల మధ్య ఉన్న 630 కిమీల దూరాన్ని ఆరు గంటల్లో కవర్ చేయొచ్చు. అలాగే, ఈ రహదారికి అనుసంధానమై ఉన్న అన్ని ప్రాంతాల్లో పారిశ్రామిక అభివృద్ధి జరుగుతుంది. బీజేపీ ప్రభుత్వం కేవలం పట్టణ ప్రాంతాల అభివృద్ధికే పరిమితం కాదు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా సమానంగా అభివృద్ధి జరిగేలా చూస్తుంది`` అని ప్రధాని వివరించారు. ఈ ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణంలో భాగంగా 250 చిన్న వంతెనలు, 15కు పైగా ఫ్లై ఓవర్లు, 12 మేజర్ బ్రిడ్జీలు, 4 రైలు బ్రడ్జీలను నిర్మించారు.
PM Modi in UP: పర్యాటక ప్రాంతాలుగా ఇక్కడి ఖిల్లాలు
బుందేల్‌ఖండ్ ప్రాంతంలోని ఖిలాలు(కోటలు) చాలా ఫేమస్ అని ప్రధాని గుర్తు చేశారు. ఇప్పుడు ఈ ఎక్సప్రెస్ వేతో ఆయా ఖిలాలను చూసేందుకు వచ్చే పర్యాటకుల సంఖ్య పెరుగుతుందన్నారు. ఈ ప్రాంతంలోని అన్ని కోటలను అనుసంధానిస్తూ ఒక టూరిజం సర్క్యూట్‌ను రూపొందించాలని సీఎం ఆదిత్యనాథ్‌ను ప్రధాని కోరారు.