Draupadi Murmu Speech : నీట్ పేపర్ లీకేజీపై మాట్లాడిన రాష్ట్రపతి.. ఏం చెప్పారంటే..
President Draupadi Murmu Speech In Telugu : పార్లమెంట్ ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించారు. ఈ సందర్భంగా పలు కీలక విషయాలపై మాట్లాడారు. రాష్ట్రపతి మాట్లాడిన విషయాల్లోని ముఖ్యమైన అంశాలు చూద్దాం..
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా మోదీ ప్రభుత్వ దార్శనికతను కొనియాడారు. ఇందిరాగాంధీ ప్రభుత్వం విధించిన ఎమర్జెన్సీ, రాజ్యాంగం, రైతులు, యువత, మహిళలు, ప్రధానంగా వెనకబడిన తరగతుల సమస్యలను రాష్ట్రపతి తన ప్రసంగంలో పంచుకున్నారు. ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వం గణనీయమైన పురోగతిని సాధించిందని, భారతదేశం త్వరలో ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని రాష్ట్రపతి అన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగానికి సంబంధించి ముఖ్యమైన పాయింట్లు ఇక్కడ చదవండి..
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మాట్లాడుతూ.. 18వ లోక్ సభ అనేక విధాలుగా చారిత్రాత్మక సభ. ఈ లోక్ సభ దేశ రాజ్యాంగాన్ని ఆమోదించి 56 ఏళ్లు పూర్తి చేసుకుంది. రాబోయే సమావేశాల్లో ఈ ప్రభుత్వం బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతుంది.
ఎమర్జెన్సీ రాజ్యాంగపై పెద్ద దాడి. భారత రాజ్యాంగం గత దశాబ్దాల్లో ప్రతి సవాలను, పరీక్షను ఎదుర్కోంది. దేశంలో రాజ్యాంగం అమలులోకి వచ్చిన తర్వాత రాజ్యాంగంపై అనేక దాడులు జరిగాయి. 1975 జూన్ 25న విధించిన ఎమర్జెన్సీ రాజ్యాంగంపై ప్రత్యక్ష దాడి. దీన్ని విధించినప్పుడు దేశమంతా ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. కానీ ఇలాంటి రాజ్యాంగేతర శక్తులపై దేశం విజయం సాధించింది.
దేశంలో యువతకు తమ ప్రతిభను ప్రదర్శించడానికి అవకాశం లభించడం ప్రభుత్వ నిరంతర కృషి. ఇటీవల పేపర్ లీకేజీ ఘటనలపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. పరీక్షల్లో పారదర్శకత ఉండాలి. గతంలో కూడా వివిధ రాష్ట్రాల్లో పేపర్ లీకేజీ ఘటనలు చూశాం. ఇందుకోసం రాజకీయాలకు అతీతంగా దేశవ్యాప్త సమగ్ర పరిష్కారం అవసరం.
ఏ వ్యక్తి కూడా ప్రభుత్వ పథాకాలకు దూరం కాకూడదనే ఉద్దేశంతో భారత్ పని చేస్తోంది. ప్రభుత్వ పథకాల కారణంగానే గత పదేళ్లలో 25 కోట్ల మంది భారతీయులు పేదరికం నుంచి బయటపడ్డారు. వికలాంగులైన సోదర సోదరీమణుల కోసం ప్రభుత్వం చౌకైన స్వదేశీ పరికరాలను సిద్ధం చేస్తోంది. దేశంలోని పేదలు, యువత, మహిళలు, రైతులు సాధికారత సాధించినప్పుడే.. అభివృద్ధి చెందిన భారత నిర్మాణం సాధ్యమవుతుంది. అందుకే వారికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది.