Pakistan: న్యూస్ టీవీ డిబేట్ లో.. లైవ్ లోనే కొట్టుకున్న నేతలు; వీడియో వైరల్
Pakistan: పాకిస్తాన్ లో ఒక టీవీ డిబేట్ లో పాల్గొన్న రెండు ప్రధాన పార్టీల నాయకులు ఒకరిపై ఒకరు దాడికి తెగబడ్డారు. లైవ్ లోనే కొట్టుకున్నారు. టీవీ చానెల్ సిబ్బంది అడ్డుకున్నా ఆగలేదు. ఆ వీడియో వైరల్ అయింది.
Pakistan: వార్తా చానెళ్ల చర్చా కార్యక్రమాల ప్రత్యక్ష ప్రసారాల్లో వాడివేడిగా చర్చించుకోవడం చూశాం. వ్యక్తిగత దూషణలను కూడా అప్పుడప్పుడు చూశాాం. కానీ, కొట్టుకోవడం, బాహాబాహీకి దిగడం మాత్రం ఇంకా మన దగ్గర చూడలేదు. కానీ పాకిస్తాన్ ఈ విషయంలో మనకన్నా ముందుంది.
పీఎంఎల్ ఎన్, పీటీఐ నాయకుల కొట్లాట
పాకిస్తాన్ లోని ఒక ప్రముఖ న్యూస్ చానెల్ ఎక్స్ ప్రెస్ టీవీ. ఇందులో ‘కల్ తక్’ అనే లైవ్ డిబేట్ షో చాలా పాపులర్. ఈ షోను పాపులర్ న్యూస్ ప్రజెంటర్ జావేద్ చౌధరి హోస్ట్ చేస్తారు. ఇటీవల ఆ షోలో పాకిస్తాన్ లోని రెండు ప్రధాన పార్టీలు పాకిస్తాన్ ముస్లిం లీగ్ -నవాజ్ (PML-N), పాకిస్తాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ (PTI) ల ముఖ్య నాయకులు పాల్గొన్నారు. పీఎంఎల్ ఎన్ తరఫున ఆ పార్టీ సెనెటర్ అఫ్నాన్ ఉల్లా ఖాన్, పీటీఐ తరఫున ఆ పార్టీ సీనియర్ నేత, ఇమ్రాన్ ఖాన్ అడ్వకేట్ షేర్ అఫ్జల్ ఖాన్ మర్వత్ ఆ చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు.
లైవ్ లోనే ఫైటింగ్
మొదట తమ నాయకులకు సంబంధించి వాడి వేడిగా చర్చ సాగింది. ఆ తరువాత ఇద్దరు నాయకులు తమ వ్యక్తిగత అంశాలపై వాదన ప్రారంభించారు. దుర్భాషలాడుకోవడం, వ్యక్తిగత దూషణలకు దిగడం ప్రారంభించారు. ఇంతలో అకస్మాత్తుగా.. పీటీఐ నేత షేర్ అఫ్జల్ ఖాన్ మర్వత్ ఒక్క సారిగా లేచి నిల్చుని పక్కనే కూర్చుని ఉన్న పీఎంఎల్ ఎన్ నేత అఫ్నాన్ ఉల్లా ఖాన్ తలపై గట్టిగా ఒక్కటిచ్చాడు. దీనిపై ఒక్కసారిగా నిర్ఘాంత పోయిన అఫ్నాన్ ఉల్లా ఖాన్.. వెంటనే తేరుకుని కాస్త దూరంగా పోయాడు. వెంటనే తిరిగివచ్చి పీటీఐ నేత షేర్ అఫ్జల్ ఖాన్ ను కొట్టడం ప్రారంభించాడు. ఇలా ఇద్దరు నేతలు కాసేపు బాహాబాహీ కొనసాగించారు. టీవీ చానెల్ సిబ్బంది వారిని అడ్డుకునేందుకు విఫల యత్నం చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో ఒక్కసారిగా వైరల్ అయింది.