Bethlehem Christmas 2023 : మూగబోయిన బెత్లెహం.. యేసు క్రీస్తు జన్మస్థలంలో అంతా నిశ్శబ్దం!
Bethlehem Christmas 2023 : ఇజ్రాయెల్- హమాస్ యుద్ధం కారణంగా బెత్లెహంకు వెళ్లేందుకు ఎవరు ఆసక్తి చూపించలేదు. ఫలితంగా.. క్రిస్మస్ వేళ కళకళలాడే బెత్లెహం వీధులు ఇప్పుడు మూగబోయినట్టు తెలుస్తోంది.
Bethlehem Christmas 2023 : యేసు క్రీస్తు జన్మస్థలం బెత్లెహంలో క్రిస్మస్ వేళ సంబరాలు అంబరాలను తాకుతాయి. కానీ ఈసారి పరిస్థితులు.. అందుకు పూర్తి భిన్నంగా కనిపిస్తున్నాయి. ఇజ్రాయెల్- హమాస్ యుద్ధం కారణంగా.. పర్యాటకులు బెత్లెహంకు వెళ్లలేదు. ఫలితంగా.. డిసెంబర్లో కళకళలాడిపోయే అక్కడి హోటల్స్, మాల్స్, రెస్టారెంట్లు.. ఇప్పుడు వెలవెలబోతున్నాయి.
మూగబోయిన బెత్లెహం..
ఇజ్రాయెల్ ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌లోని ఓ పాలస్తీనా నగరం ఈ బెత్లెహం. యుద్ధం ప్రభావం ఈ ప్రాంతంపై భారీగానే పడింది. అక్టోబర్ 7న.. ఇజ్రాయెల్‌పై హమాస్ బృందం దాడి చేయడంతో మొదలైన ఉద్రిక్తత ఇప్పటికీ కొనసాగుతుండటం ఇందుకు కారణం. హమాస్‌ని ఏరివేసేందుకు గాజాపై బీభత్సంగా దాడి చేస్తోంది ఇజ్రాయెల్. ఈ నేపథ్యంలో.. యుద్ధ విచ్ఛిన్న ప్రాంతాల్లో పర్యటనకు అక్కడి ప్రజలతో పాటు విదేశీయులు దూరంగా ఉంటున్నారు.
"ఈసారి మాకు అతిథులు లేరు. ఒక్కరు కూడా రాలేదు," అని అలెగ్జాండర్ హోటల్ ఓనర్ జో కనవాటీ మీడియాకు తెలిపారు. 'మా పూర్వికుల నుంచి అందరం ఇక్కడే ఉంటున్నాము. నేను చూసిన అతి ఘోరమైన క్రిస్మస్ పరిస్థితి ఇదే. క్రిస్మస్లో కూడా బెత్లెహంని మూసేయాల్సి వచ్చింది. క్రిస్మస్ ట్రీ కూడా లేదు. సంతోషం లేదు,' అని అన్నారు.
Bethlehem Christmas cancelled : జెరుసలేంకు దక్షిణాన ఉండే ఈ బెత్లెహంలోని ప్రజలు పర్యాటకులపైనే ఆధారపడుతుంటారు. ఇక్కడి చర్చ్‌లను, చారిత్రక కట్టడాలను చూసేందుకు విదేశీయులు వస్తేనే.. వీరికి వ్యాపారం జరుగుతుంది. ఈసారి ఆ పరిస్థితి లేకపోవడం.. చాలా మంది బెత్లెహం వాసులు బాధలో ఉన్నారు.
"అక్టోబర్ 7కి ముందు.. పరిస్థితులు అన్ని బాగానే ఉండేవి. క్రిస్మస్ బుకింగ్స్ అప్పటికే ఫుల్ అయిపోయాయి. ఇంకా డిమాండ్ ఉండటంతో తాత్కాలిక ఏర్పాట్లు చేయాలేమో అని కూడా భావించాను. కానీ యుద్ధం కారణంగా.. బుకింగ్స్‌ని రద్దు చేసుకున్నారు. వచ్చే ఏడాది బుకింగ్స్ కూడా రద్దైపోయాయి," అని జో కనవాటీ వివరించారు.
బెత్లెహంలో తాజా పరిస్థితులపై ఓ అంతర్జాతీయ మీడియా సంస్థ కథనం ప్రచురించింది. జో కనవాటీ.. మీడియా ప్రతినిధులను తన హోటల్లోకి తీసుకెళ్లారు. అక్కడ ఉన్న ఖాళీ గదులను చూపిస్తూ బాధపడ్డారు.
Christmas 2023 Bethlehem : ఇజ్రాయెల్- హమాస్ యుద్ధ ప్రభావం గాజాతో పాటు పాలస్తీనాపైనా అధికంగానే ఉంది. వేలాది మంది ఇప్పటికే ప్రాణాలు కోల్పోయారు. అంతేకాకుండా.. భారీ ఆస్తి నష్టం కూడా వాటిల్లింది. అసలు యుద్ధం ఎప్పుడు ముగుస్తుంది? అన్న విషయంపై స్పష్టత లేకపోవడం అక్కడి ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. పరిస్థితులు ఇలాగే కొనసాగితే.. తిండి తినడానికి కూడా తమ వద్ద డబ్బులు ఉండవని చాలా మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారని సమాచారం.
సంబంధిత కథనం