UPI payment Precautions | పేమెంట్ యాప్ ఏదైనా ఈ ఐదు జాగ్రత్తలు తప్పనిసరి..!
యూపీఐ పేమెంట్స్ ఇప్పుడు సాధారణం అయ్యాయి. బంగారం నుంచి బట్టల వరకు, వైన్ నుంచి వెజిటబుల్స్ వరకు.. అన్ని కొనుగోళ్లకు ఇప్పడు యూపీఐ చెల్లింపుల విధానాన్నే వాడుతున్నాం. ఈ పేమెంట్స్ కోసం ఎన్నో యాప్స్ ఉన్నాయి. పేటీఎం, ఫోన్ పే, గూగుల్ పే.. మొదలైనవి వాటిలో కొన్ని.
UPI payment Precautions | చదువుతో సంబంధం లేకుండా స్మార్ట్ ఫోన్ వినియోగం పెరిగిపోయింది. స్మార్ట్ ఫోన్‌లో కనీసం మూడు యూపీఐ(Unified Payments Interface - UPI)) పేమెంట్ యాప్స్ ఉంటున్నాయి. అదే సమయంలో, ఆన్‌లైన్ మోసాలు కూడా పెరుగుతున్నాయి. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా ఖాతా ఖాళీ అవుతోంది. అందువల్ల, ఈ యూపీఐ పేమెంట్స్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే, మీ బ్యాంక్ అకౌంట్‌లోని డబ్బు మీకు తెలియకుండానే మాయం అవుతుంది.
UPI payment Precautions | ఈ ఐదు జాగ్రత్తలు తప్పని సరి
1) యూపీఐ పిన్ ఎవరితోనూ షేర్ చేసుకోవద్దు
ప్రతీ యూపీఐ యాప్‌కు సెక్యూరిటీ పిన్‌ను సెట్ చేసుకోవాలి. ఇది అన్ని యాప్స్‌కు కచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుంది. చాలా యాప్స్ ఇప్పుడు టూ స్టెప్ ఆథెంటికేషన్ వాడుతున్నాయి. యాప్ ఓపెన్ చేయడానికి ఒక పిన్, ఆ తరువాత పేమెంట్‌ను కన్ఫర్మ్ చేయడానికి మరో పిన్ వాడాల్సి ఉంటుంది. అలాగే, కొన్ని యాప్స్ OTP విధానాన్ని కూడా వాడుతున్నాయి. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ మీ ఈ సెక్యూరిటీ పిన్ లను ఎవరికీ తెలియజేయకండి.
2) ఫోన్‌కు స్క్రీన్ లాక్
ఫోన్ కు కచ్చితంగా స్క్రీన్‌లాక్‌ను ఏర్పాటు చేసుకోండి. సాధారణంగా ప్రతీసారి స్క్రీన్‌లాక్ ఓపెన్ చేసుకోవడానికి బద్ధకించి, స్క్రీన్‌లాక్‌ను ఏర్పాటు చేసుకోం. అలాంటి పొరపాటు చేయకండి. ఒకవేళ మీరు మీ ఫోన్‌ను పోగొట్టుకున్నా, లేదా ఎవరైనా మీ ఫోన్‌ను దొంగలించినా, ఫోన్ లాక్ లేనట్లయితే, మీ ఫోన్‌లోని యాప్స్‌ను ఇతరులు ఈజీగా వాడేస్తారు. అది మీకు ఆర్థికంగానే కాదు, సామాజికంగానే నష్టం చేకూరుస్తుంది. అంటే, మీ ఫోన్ నుంచి మీ కాంటాక్ట్స్‌కు తప్పుడు మెసేజ్‌లు పంపించడం వంటివి చేసే అవకాశముంది. కొన్ని యూపీఐ యాప్స్ మీ ఫోన్ స్క్రీన్ లాక్‌ను యాప్ ఓపెనింగ్‌కు కూడా వాడుతుంటాయి కాబట్టి కచ్చితంగా స్క్రీన్ లాక్ ఆప్షన్ వాడండి.
3) డబ్బు పంపే ముందు యూపీఐ ఐడీని నిర్ధారించుకోండి
మీరు కొత్తవారికి ఎవరికైనా డబ్బు చెల్లించేముందు వారి యూపీఐ ఐడీని ఒకటికి రెండుసార్లు నిర్ధారించుకోండి. ఒకవేళ తప్పుగా వేరే వారికి డబ్బు పంపిస్తే.. అవి తిరిగిరావన్న విషయం గుర్తుంచుకోండి. అందుకే, యూపీఐ ఐడీని నిర్ధారించుకోవడంతో పాటు, వారికి టెస్టింగ్‌గా ఒక రూపాయి పంపి, వారికి చేరిందా ? లేదా? నిర్ధారించుకోండి.
4) ఒకటికి మించి యూపీఐ యాప్స్ వాడకపోవడమే మంచిది
సాధారణంగా స్మార్ట్‌ఫోన్లలో రెండు, మూడు యూపీఐ యాప్స్‌ను ఇన్‌స్టాల్ చేసుకుంటాం. వాటికి మన బ్యాంక్ ఖాతాతో అనుసంధానించుకుంటాం. అయితే, ఒకటికి మించి యాప్స్ ఉంటే వాటిని వాడే సమయంలో, పిన్స్‌ను గుర్తుంచుకునే విషయంలో కొంత గందరగోళం ఏర్పడుతుంది. సాధారణంగా ఒక యాప్‌తో అన్ని పనులు పూర్తి చేసుకోవచ్చు కనుక, ఒక్క యూపీఐ యాప్ ఫోన్‌లో ఉంటే సరిపోతుంది.
5) తెలియని లింక్స్‌పై క్లిక్ చేయవద్దు
గుర్తు తెలియని వ్యక్తుల నుంచి చాలా లింక్స్ వస్తుంటాయి. క్యాష్ బ్యాక్ తో పాటు పలు ఆఫర్లతో ఆ లింక్స్ మనను టెంప్ట్ చేస్తుంటాయి. అవి క్లిక్ చేస్తే.. మనకి తెలియకుండానే మాల్‌వేర్ మన ఫోన్లోకి వస్తుంది. అదిమన ఫోన్‌ను హ్యాక్ చేయడంతో పాటు బ్యాంకింగ్ పాస్‌వర్డ్స్‌ను,పిన్స్‌ను గుర్తించి, మన ఖాతాలను ఖాళీ చేస్తుంది. అనుమానాస్పద లింక్స్, గుర్తుతెలియని వారి నుంచి వచ్చే లింక్స్‌ను వెంటనే డిలీట్ చేయడం మంచిది. అలాగే, బ్యాంక్ ప్రతినిధులమంటూ కొందరు ఫోన్ చేస్తుంటారు. ఖాతా డీయాక్టివేట్ అయిందనో, ఆధార్ లింక్ చేయాలనో చెప్పి, మీ ఫోన్‌కు వచ్చే ఓటీపీ చెప్పమంటారు. అది నిజమని నమ్మి ఓటీపీ చెప్పామో.. బ్యాంక్ అకౌంట్‌ను ఖాళీ చేస్తారు. అందువల్ల ఎట్టిపరిస్థితుల్లోనూ ఓటీపీలను ఎవరికీ చెప్పకండి.