Jharkhand Train Accident : ఝార్ఖండ్ లో ఘోర రైలు ప్రమాదం, ఇద్దరు మృతి
Jharkhand Train Accident : ఝార్ఖండ్ లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు దుర్మరణం చెందారు.
Jharkhand Train Accident :ఝార్ఖండ్‌లోని జంతారాలో బుధవారం సాయంత్రం కలజారియా రైల్వే స్టేషన్‌లో ప్రయాణికులపై దూసుకెళ్లడంతో ఘోర ప్రమాదం(Train Accident) జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందినట్లు అధికారులు ధృవీకరించారు. మరణాల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని సమాచారం. ఘటనా స్థలానికి వైద్య బృందాలు, అంబులెన్స్‌లు తరలించినట్లు జంతారా డిప్యూటీ కమిషనర్ తెలిపారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయన్నారు. జంతారా ఎమ్మెల్యే ఇర్ఫాన్ అన్సారీ మాట్లాడుతూ... ప్రమాదం గురించి తెలుసుకున్నానని అక్కడికి వెళ్తున్నామన్నారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిని గుర్తించాలని ఆదేశాలు ఇచ్చామన్నారు. ఈ అంశాన్ని అసెంబ్లీలో కూడా లేవనెత్తుతామని, మృతులను ఇంకా గుర్తించలేదని ఎమ్మెల్యే అన్నారు.
అయితే కొందరు ప్రయాణికులు రైలుకు మంటలు అంటుకోవడంతో ట్రాక్‌పైకి దూకారని, ఆ సమయంలో వారిని మరొక రైలు ఢీకొట్టిందని ప్రచారం జరుగుతోంది. ఈ ఘటనను తూర్పు రైల్వే CPRO ఖండించారు. రైలుకు మంటలు అంటుకోలేదన్నారు. ట్రాక్‌పై నడుస్తున్న ఇద్దరు వ్యక్తులను రైలు ఢీకొట్టిందన్నారు. ఈ ఇద్దరు ట్రాక్‌పై నడుస్తున్నారని వీళ్లు ప్రయాణికులు కాదన్నారు. ఈ ఘటనపై విచారణకు ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.
జంతారా ఎస్‌డీఎం అనంత్‌కుమార్ మాట్లాడుతూ... ప్రమాదానికి గురైన వారు ప్రయాణికులేనని, ఒక రైలు నుంచి కిందకు దిగి వేచిచూస్తున్న సమయంలో మరో లోకల్ రైలు ఢీకొంటిందన్నారు. ఈ ప్రమాదంపై కుటుంబీకులు సమాచారం తెలుసుకునేందుకు హెల్ప్ లైన్ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని అనంత్ కుమార్ తెలిపారు. ప్రమాద ఘటనపై ఇంకా స్పష్టత రాలేదని రైల్వే ఉన్నతాధికారులు అంటున్నారు.
సీఎం దిగ్భ్రాంతి వ్యక్తం
జంతారాలోని కల్జారియా స్టేషన్ సమీపంలో రైలు ప్రమాదం ఝార్ఖండ్ సీఎం చంపాయ్ సోరెన్ విచారం వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో మరణించిన వారి కుటుంబాలు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అధికార సిబ్బంది సహాయ చర్యల్లో నిమగ్నమై ఉందన్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానని సీఎం చంపాయ్ సోరెన్ ట్వీట్ చేశారు.