Vadodara lake boat capsizes: గుజరాత్ లో ఘోర ప్రమాదం; 16 మంది చిన్నారుల దుర్మరణం
Vadodara lake boat capsizes: గుజరాత్ లో ఘోర విషాదం చోటు చేసుకుంది. రాష్ట్రంలోని వడోదర నగర శివార్లలోని సరస్సులో పడవ బోల్తా పడిన ఘటనలో 16 మంది పాఠశాల విద్యార్థులు మృతి చెందారు. మిగిలిన విద్యార్థుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
Vadodara lake boat capsizes: గుజరాత్ లోని వడోదర నగర శివార్లలోని హర్నీ సరస్సులో పడవ బోల్తా పడిన ఘటనలో 16 మంది విద్యార్థులు మృతి చెందారు. ఈ పడవలో 27 మంది విద్యార్థులు విహారయాత్రకు వెళ్లినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు 10 మంది చిన్నారులను రక్షించామని, మిగిలిన విద్యార్థుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. ప్రాణాలతో కాపాడిన విద్యార్థులను చికిత్స కోసం ఆసుపత్రులకు తరలించారు.
ప్రధాని దిగ్భ్రాంతి
తన సొంత రాష్ట్రం గుజరాత్ లో జరిగిన ఘోర ప్రమాదంపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. వదోదర లోని హర్నీ సరస్సులో పడవ బోల్తా పడిన ఘటనలో ప్రాణాలు కోల్పోయిన విద్యార్థుల కుటుంబాలకు ప్రధాని రూ.2 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. క్షతగాత్రులకు రూ.50 వేలు అందజేయనున్నారు. ‘‘ఈ విషాద సమయంలో బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. బాధితులను స్థానిక యంత్రాంగం అన్ని విధాలా ఆదుకోవాలి’’ అని ప్రధాని ట్వీట్ పేర్కొన్నారు.
బాధ్యులపై సత్వర చర్యలు
ఈ దుర్ఘటనపై గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పాఠశాల విద్యార్థులతో వెళ్తున్న పడవ సరస్సులో బోల్తా పడటంతో పలువురు చిన్నారులు మృతి చెందిన ఘటన బాదాకరమన్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF), అగ్నిమాపక సిబ్బందితో పాటు ఇతర ఏజెన్సీలు రంగంలోకి దిగాయని తెలిపారు. ఈ ప్రమాదానికి కారణమైన వారిపై కఠిన చర్యలను సత్వరమే తీసుకుంటామన్నారు. ఈ ప్రమాదం గురించిన సమాచారం తెలియగానే అధికారులు, సహాయ సిబ్బంది అక్కడికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. అయితే, ఈ లోపే పలువురు స్థానికులు నీటిలో పడిపోయిన కొందరు విద్యార్థులను కాపాడారు.