Tina Dabi: బీజేపీ నాయకుడికి 7 సెకన్లలో 5 సార్లు నమస్కరించిన ఐఏఎస్ టాపర్ టీనా దాబీ; సోషల్ మీడియాలో రచ్చ
Tina Dabi controversy: రాజస్తాన్ లో విధుల్లో ఉన్న ఐఏఎస్ అధికారి టీనా దాబీ బీజేపీ నేత సతీష్ పూనియాకు 7 సెకన్ల వ్యవధిలో ఐదు సార్లు నమస్కరిస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రాజకీయ నాయకుడి ముందు ఆమె వ్యవహరించిన తీరును పలువురు తీవ్రంగా విమర్శించారు. మరి కొందరు ఆమె చర్యను ప్రశంసించారు.
Tina Dabi controversy: 2015లో యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ లో మొదటి ర్యాంకు సాధించిన ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (IAS) అధికారిణి టీనా దాబీ మరోసారి వార్తల్లో నిలిచారు. ఆమె బీజేపీ నేత సతీష్ పూనియా ముందు వినయంగా నమస్కరిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
పట్టించుకోకున్నా..
ఒక కార్యక్రమంలో రాజస్థాన్ బీజేపీ మాజీ అధ్యక్షుడు సతీష్ పూనియాకు రాజస్థాన్ బార్మర్ జిల్లా కలెక్టర్ టీనా దాబీ ఎదురయ్యారు. ఈ సందర్భంగా సతీశ్ పూనియా ఫోన్ చూస్తూ, బిజీగా ఉన్నప్పటికీ ఆమె అతడికి పలుమార్లు అభివాదం చేశారు. ఏడు సెకన్లలో ఐదు సార్లు చేతులు జోడించి, ఆయనకు నమస్కరించారు. చివరకు అతడు ఆమె వైపు చూసి ఆమె అభివాదాన్ని స్వీకరించాడు. ఆనంతరం, బార్మర్ జిల్లా కలెక్టర్ గా గొప్పగా పని చేస్తున్నారని టీనా దాబీని ప్రశంసించారు. ‘బార్మర్ ఇండోర్ తరహాలో మారుతుంది. మీరు మంచి పని చేస్తున్నారు’ అని పూనియా అన్నారు. ఆ ప్రశంసకు ఆమె మరోసారి అతడికి నమస్కరించారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
సోషల్ మీడియాలో రచ్చ
ఈ వీడియో సోషల్ మీడియా (social media)లో చర్చకు దారితీసింది. పలువురు యూజర్లు ఆమె గౌరవపూర్వక చర్యను ప్రశంసించగా, మరికొందరు రాజకీయ నాయకులు, ప్రభుత్వోద్యోగుల మధ్య పవర్ డైనమిక్స్ ను ప్రశ్నించారు. ‘‘రాజస్థాన్ లోని బార్మర్ జిల్లా కలెక్టర్ గా టీనాజీ పనిని చూసిన బీజేపీ (bjp) పార్టీ నాయకులు సతీష్ పునియా ఆమె పనిని ప్రశంసించారు. దాంతో కలెక్టర్ టీనా దాబి గారు ఆయనకు నమస్కరించి గౌరవించారు. వారి తల్లిదండ్రులు వారికి మంచి విలువలు ఇచ్చారని ఇది చూపిస్తుంది’’ అని ఒక యూజర్ కామెంట్ చేశారు. తల వంచుకోవడంలో ఎలాంటి తప్పు లేదని, ప్రజాప్రతినిధులే అధికారుల కంటే గొప్పవారని అన్నారు. ‘‘#TinaDabi ప్రవర్తన ఆమె మంచి వ్యక్తిత్వాన్ని, హుందాతనాన్ని ప్రతిబింబిస్తుంది’’ అని మరో యూజర్ పేర్కొన్నారు.
తల వంచాల్సిన అవసరం లేదు..
టీనా దాబీ తన పరిపాలనా దక్షతతో దేశంలోనే కాకుండా యావత్ ప్రపంచంలో ఖ్యాతి గడించారని మరో యూజర్ వ్యాఖ్యానించారు. అయితే, ఒక నాయకుడి ముందు తల వంచాల్సిన అవసరం లేదని, అది కూడా ఆ నాయకుడు సరిగ్గా పట్టించుకోనప్పుడు అన్ని సార్లు నమస్కరించాల్సిన అవసరం లేదని మరో యూజర్ అన్నారు.
చెల్లి కూడా ఐఏఎస్ నే..
టీనా దాబీ 2015 లో ప్రతిష్ఠాత్మక యూపీఎస్సీ (UPSC) సివిల్ సర్వీసెస్ పరీక్షలో తొలి ప్రయత్నంలోనే టాపర్ గా నిలిచారు. 2017లో అజ్మీర్ జిల్లా కలెక్టర్ గా తన కెరీర్ ను ప్రారంభించారు. ఆమె పర్సనల్ లైఫ్ కూడా వార్తల్లో నిలిచింది. ఆమె చెల్లెలు రియా దాబీ కూడా 2020లో యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి, 2020లో తొలి ప్రయత్నంలోనే 15వ ర్యాంకు సాధించింది.