Trump on transgenders: ట్రాన్స్ జెండర్లపై నోరు పారేసుకున్న ట్రంప్; దేవుడు సృష్టించింది రెండే జెండర్ లని కామెంట్
Donald Trump: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఒక ప్రచార కార్యక్రమంలో ట్రాన్స్ జెండర్లను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. తాను అధికారంలోకి వచ్చిన తొలి రోజే ట్రాన్స్ జెండర్ ఐడెంటిటీని బ్యాన్ చేస్తానని స్పష్టం చేశాడు.
Donald Trump: నార్త్ కరోలినాలోని కాన్కార్డ్ కన్వెన్షన్ సెంటర్లో ఇటీవల జరిగిన ర్యాలీలో అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వ పాఠశాలల్లో ట్రాన్స్ జెండర్ ఐడియాలజీని నిషేధించడానికి, మైనర్లకు లింగ నిర్ధారణ విధానాలను నిషేధించడానికి కట్టుబడి ఉన్నానని పునరుద్ఘాటించారు. 11వ అవర్ ఫెయిత్ లీడర్స్ మీటింగ్ లో ప్రసంగించిన ట్రంప్ 2024లో మళ్లీ ఎన్నికైతే తక్షణ కార్యాచరణకు సంబంధించిన ప్రణాళికలను వివరించారు.
మొదటి సంతకం దానిపైనే..
'క్రిటికల్ రేస్ థియరీ లేదా ట్రాన్స్ జెండర్ పిచ్చిని నిషేధించే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై మొదటి రోజు సంతకం చేస్తాను' అని ట్రంప్ ప్రకటించారు. ‘‘లింగ భావజాల విషాన్ని ఓడించడం’’ తన లక్ష్యమని నొక్కి చెప్పాడు. "దేవుడు రెండు లింగాలను మాత్రమే సృష్టించాడు. అవి మగ మరియు ఆడ’’ అనే తన నమ్మకాన్ని నొక్కి చెప్పాడు.
కమలా హారిస్ పై విమర్శలు
ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ క్రైస్తవ మతం పట్ల వ్యతిరేకతతో ఉన్నారని ట్రంప్ ఆరోపించారు. మహిళా క్రీడల్లో ట్రాన్స్ జెండర్ మహిళలను పోటీకి అనుమతించడంపై ఆమె వైఖరి సరి కాదని, అది సంప్రదాయ విలువలను దెబ్బతీస్తుందని ఆయన విమర్శించారు. మహిళల క్రీడలకు ట్రాన్స్ జెండర్లను దూరంగా ఉంచుతానని, మొత్తం 50 రాష్ట్రాల్లో నిషేధం విధించేలా చట్టం చేస్తానని హామీ ఇచ్చారు.
మత స్వేచ్ఛ
లింగ సమస్యలతో పాటు, విద్యలో మత స్వేచ్ఛకు తన నిబద్ధతను ట్రంప్ పునరుద్ఘాటించారు.తను అధికారంలోకి వస్తే ‘‘అమెరికన్లు మళ్లీ 'మెర్రీ క్రిస్మస్' అని సగర్వంగా చెబుతారు’’ అని తన గత ప్రచార నినాదాన్ని మరోసారి గుర్తు చేశారు. నేరాలు, గర్భస్రావం, సంప్రదాయ విలువల రక్షణ వంటి కీలక అంశాలను ట్రంప్ (donald trump) తన ప్రసంగంలో ప్రస్తావించారు. 2024 ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ కన్జర్వేటివ్ ఓటర్లను సమీకరించడమే ట్రంప్ ప్రచార వ్యూహంగా కనిపిస్తోంది.