France first gay PM: ఫ్రాన్స్ కు తొలి ‘గే’ ప్రధానిగా గాబ్రియల్; యంగెస్ట్ పీఎం కూడా..
France first gay PM: ఫ్రాన్స్ కు నూతన ప్రధాని గా బాధ్యతలు స్వీకరించిన గాబ్రియెల్ అట్టల్ స్వలింగ సంపర్కుడన్న విషయం ఇప్పుడు సంచలనంగా మారింది. అంతేకాదు, ఆయన ఫ్రాన్స్ కు ప్రధాని అయిన అతి పిన్న వయస్కుడు కూడా.
France first gay PM: ఫ్రాన్స్ లో అత్యంత పిన్న వయస్కుడైన ప్రధానిగా, మొట్టమొదటి బహిరంగ స్వలింగ సంపర్క ప్రభుత్వాధినేతగా గాబ్రియెల్ అట్టల్ చరిత్ర సృష్టించారు.
యంగెస్ట్ పీఎం..
ఎలిజబెత్ బోర్న్ ఫ్రాన్ (France) ప్రధాని పదవికి రాజీనామా చేసిన తర్వాత ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ మంగళవారం ఆ దేశ విద్యాశాఖ మంత్రి గాబ్రియేల్ అట్టల్ (France PM Gabriel Attal) ఫ్రాన్స్ ప్రధానిగా నియమించారు. దాంతో, ఫ్రాన్స్ కు అత్యంత పిన్న వయస్కుడైన ప్రధానిగా గాబ్రియెల్ నిలిచారు. అంతేకాదు, ఆయన స్వలింగ సంపర్కుడినని స్వయంగా ప్రకటించిన ప్రభుత్వ అధిపతిగా కూడా నిలిచారు.
రెండేళ్ల లోపే..
ఎలిజబెత్ బోర్న్ రెండు సంవత్సరాల కంటే తక్కువ కాలమే ప్రధాని పదవిలో ఉన్నారు. మరికొన్ని రోజుల్లో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ కార్యక్రమం ఉండగా, అకస్మాత్తుగా రాజీనామా చేశారు. దాంతో, ఫ్రాన్స్ ప్రధానిగా గాబ్రియేల్ అట్టల్ ను నియమించి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే బాధ్యతను ఆయనకు దేశాధ్యక్షుడు మేక్రాన్ అప్పగించారని అధ్యక్ష కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ఫ్రాన్స్ రినాయజెన్స్ పార్టీ నాయకుడు సిల్వైన్ మైలార్డ్ గాబ్రియేల్ అట్టల్ ను అభినందించారు, "మీరు మీ బాధ్యతలను సమర్దవంతంగా నిర్వహించగలరని, దేశ విలువలను ప్రతిబింబించగలరని నేను భావిస్తున్నాను’ అని ఆయన ట్వీట్ చేశారు.
ఎవరీ గాబ్రియేల్ అట్టల్?
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ కు గాబ్రియేల్ అట్టల్ అత్యంత సన్నిహితుడు. ఇటీవలి ఒపీనియన్ పోల్స్ లో దేశంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన రాజకీయ నాయకుల్లో ఒకరుగా నిలిచారు. పార్లమెంట్ లో, రేడియో షోలలో సమర్ధవంతమైన వక్తగా పేరుగాంచారు. ఫ్రాన్స్ కు అత్యంత పిన్న వయస్కుడైన ప్రధానిగా, స్వలింగ సంపర్కుడిగా ప్రకటించుకున్న తొలి ప్రధానిగా నిలిచారు.