Bangladeshi infiltrators : బంగ్లాదేశ్​ నుంచి చొరబడ్డారని.. భారత ముస్లింలపై హిందు రక్షా దళ్​ దాడి-fringe group attacks muslims in up falsely calling them bangladeshi infiltrators ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Bangladeshi Infiltrators : బంగ్లాదేశ్​ నుంచి చొరబడ్డారని.. భారత ముస్లింలపై హిందు రక్షా దళ్​ దాడి

Bangladeshi infiltrators : బంగ్లాదేశ్​ నుంచి చొరబడ్డారని.. భారత ముస్లింలపై హిందు రక్షా దళ్​ దాడి

Sharath Chitturi HT Telugu
Aug 11, 2024 11:15 AM IST

యూపీలోని ఘజియాబాద్​లో హిందు రక్షా దళ అధ్యక్షుడు భూపేంద్ర, అతని మద్దతుదారులు స్థానికులపై దాడికి దిగారు. వీరిలో చాలా మంది ముస్లింలు గాయపడ్డారు. అక్కడున్న వారు బంగ్లాదేశ్​ నుంచి చొరబడినట్టు ఆరోపిస్తూ, హిందు రక్షా దళ్​ సభ్యులు దాడి చేశారు.

స్థానికులపై దాడి చేస్తున్న హిందు రక్షా దళ్​ సభ్యులు..
స్థానికులపై దాడి చేస్తున్న హిందు రక్షా దళ్​ సభ్యులు..

బంగ్లాదేశ్​లో నిరసనల నేపథ్యంలో భారత్​లోని యూపీ ఘజియాబాద్​లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బంగ్లాదేశ్​ నుంచి చొరబడ్డారంటూ.. కొందరు స్థానికులపై హిందు రక్షా దళ్​ బృందం దాడికి దిగింది. స్థానికుల్లో చాలా మంది ముస్లింలు ఉన్నారు. ఈ ఘటనలో అనేక మంది గాయపడ్డారు. పలు షెల్టర్లు, గుడిసెలు ధ్వంసమయ్యాయి. కాగా.. స్థానికంగా ఉన్న వారు బంగ్లాదేశ్​ నుంచి రాలేదని అధికారులు ధ్రువీకరించారు.

ఇదీ జరిగింది..

ఘజియాబాద్​ రైల్వే స్టేషన్​కి సమీపంలో ముస్లింలు అధికంగా ఉండే ప్రాంతంలో శుక్రవారం రాత్రి 7 గంటల 30 నిమిషాలకు ఈ ఘటన జరిగింది. హిందు రక్షా దళ్​ అధ్యక్షుడు భూపేంద్ర చౌదరి అలియాస్​ పింకి అనే వ్యక్తి, తన 20 మంది మద్దతుదారులతో కలిసి ఆ ప్రాంతానికి వెళ్లాడు. అక్కడున్న వారు బంగ్లాదేశ్​ నుంచి అక్రమంగా చొరబడ్డారని ఆరోపించాడు. భూపేంద్ర, అతని మద్దతుదారులు.. బంగ్లాదేశ్​కి వ్యతిరేకంగా తీవ్రస్థాయిలో నినాదాలు చేశారు. అనంతరం అక్కడ ఉన్న గుడిసెలను ధ్వంసం చేశారు. ఆ తర్వాత ఆ ప్రాంతంలోని ప్రజలపై దాడి చేశారు. వారిలో చాలా మంది ముస్లింలు ఉన్నారు.

ఈ వార్త పోలీసులకు తెలిసింది. పోలీసులు ఘటనాస్థలానికి వెళ్లేసరికి.. భూపేంద్ర, అతని మద్దతుదారులు.. స్థానికులపై దుర్భాషలాడుతూ, ముస్లింలను కొడుతు కనిపించారు.

"వీరు బంగ్లాదేశ్​ నుంచి వచ్చిన వారు కాదని నేను చెప్పేందుకు ప్రయత్నించాను. కానీ వాళ్లు ఆగలేదు. కొట్టడం ఆపలేదు. షెల్టర్లను కూడా ధ్వంసం చేశారు," అని సబ్​-ఇన్​స్పెక్టర్​ సంజీవ్​ కుమార్​ మీడియాకు తెలిపారు.

హిందు రక్షా దళ్​ అధ్యక్షుడు, అతని మద్దతుదారులు ఆరోపించినట్టు, స్థానికంగా ఉన్న వారు బంగ్లాదేశ్​ నుంచి వచ్చిన వారు కాదని ఘజియాబాద్​ పోలీస్​ కమిషనర్​ అజయ్​ కుమార్​ మిశ్రా స్పష్టం చేశారు.

"ఆ ప్రాంతంలో నివాసముంటున్న వారు బంగ్లాదేశీయులు కాదు. షాహ్​జహాన్​పూర్​ వాసులు. నిరసనకారులు ఎంత చెప్పినా వినలేదు. వారిపై జాతీయ భద్రతా చట్టం కింద కేసు వేయాలని యోచిస్తున్నాము," అని అజయ్​ మిశ్రా తెలిపారు.

ఈ ఘటనకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏసీపీ అభిషేక్​ శ్రీవాస్తవ తెలిపారు.

మరోవైపు ఘజియాబాద్​లో స్థానిక ముస్లింలపై దాడి చేసిన హిందు రక్షా దళ్​ అధ్యక్షుడితో పాటు 20 మందిపై పోలీసులు ఎఫ్​ఐఆర్​ నమోదు చేశారు. భారత న్యాయ స్మృతి కింద కేసు వేశారు. మతపరమైన భావాలను రెచ్చగొట్టేందుకు నిందితులు ప్రయత్నించారని, సంబంధిత చట్టాలను కూడా కేసుకు జోడించారు.

బంగ్లాదేశ్​లో హిందువులపై దాడులు..

షేక్​ హసీనా ప్రభుత్వం కుప్పకూలిన అనంతరం బంగ్లాదేశ్​లో నిరసనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. మరీ ముఖ్యంగా మైనారిటీ హిందువులపై 200కుపైగా దాడులు వెలుగులోకి వచ్చాయి. మొత్తం 52 జిల్లాల్లో హిందువులపై దాడులు జరిగినట్టు వార్తలు వెలువడ్డాయి.

మరోవైపు బంగ్లాదేశ్​లో హిందువులు సైతం తమపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా నిరసనకు దిగారు. లక్షమందికిపైగా ప్రజలు.. 'హిందువులను కాపాడండి' అంటూ ప్లకార్డులు పట్టుకుని రోడ్డుపై నిరసనలకు దిగారు. ఈ నేపథ్యంలో నిరసనకారులు శాంతియుతంగా ఉండాలని, హిందువులపై దాడి చేయకుండా, వారికి రక్షణ కల్పించాలని బంగ్లాదేశ్​ తాత్కాలిక ప్రభుత్వం పిలుపునిచ్చింది.

సంబంధిత కథనం