Gyanvapi mosque: వారణాసిలోని వివాదాస్పద జ్ఞానవాపి మసీదుకు సంబంధించి బీజేపీ సీనియర్ నేత, ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యానాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ నిర్మాణాన్ని మసీదు అనడమే పెద్ద వివాదమని వ్యాఖ్యానించారు. ఈ అంశం అలహాబాద్ హై కోర్టు విచారణలో ఉండగా.. యోగి ఆదిత్యనాథ్ ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
వివాదాస్పద జ్ఞానవాపి మసీదు గతంలో హిందూ ఆలయమని నిర్ధారించడానికి అనేక ఆధారాలు ఉన్నాయని ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యానాథ్ స్పష్టం చేశారు. ఒకవేళ అది మసీదే అయితే, అందులో త్రిశూలం ఎందుకు ఉంటుందని, శివలింగం ఎందుకు ఉంటుందని ప్రశ్నించారు. ‘‘అందులో త్రిశూలం, జ్యోతిర్లింగంతో పాటు దైవ ప్రతిమలున్నాయి. వాటిని మేం అందులో పెట్టలేదు కదా’’ అని వ్యాఖ్యానించారు. ఏఎన్ఐ వార్తాసంస్థకు ఇచ్చిన ప్రత్యే ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అది మసీదు కాదని, ఆలయమని ఆ నిర్మాణం గోడలు అరచి, అరచి చెబుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. జ్ఞానవాపి నిర్మాణాన్ని మసీదు అనడమే పెద్ద వివాదాస్పద అంశమని అన్నారు. ఆలయాన్ని కూల్చి మసీదు నిర్మించడం చారిత్రక తప్పిదమని ముస్లింలు అంగీకరించాలని, అలాగే, ముస్లిం సమాజమే ఈ సమస్యకు పరిష్కారం చూపాలని ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యానాథ్ సూచించారు.
జ్ఞానవాపి మసీదు వివాదంపై అలహాబాద్ హై కోర్టులో కేసు విచారణలో ఉంది. త్వరలో కోర్టు దీనిపై తీర్పు వెలువరించనుంది. జ్ఞానవాపి మసీదులో పురావస్తు శాఖ సర్వే చేయాలని కింది కోర్టు ఇచ్చిన ఆదేశాలపై ఆగస్ట్ 3 వ తేదీ వరకు స్టే కొనసాగనుంది. ఈ సమయంలో, కోర్టు విచారణలో ఉన్న అంశంపై ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం సరికాదని ముస్లిం వర్గాలు, ఇతర విపక్షాలు విమర్శిస్తున్నాయి. ఇది న్యాయవ్యవస్థను అవమానించడమేనని చెబుతున్నాయి.