Salman Khan: చంపేస్తామంటూ సల్మాన్ ఖాన్ కు మళ్లీ బెదిరింపు; ఈ సారి రూ. 5 కోట్లు డిమాండ్-fresh threat targets salman khan as police helpline receives rs 5 cr ransom demand ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Salman Khan: చంపేస్తామంటూ సల్మాన్ ఖాన్ కు మళ్లీ బెదిరింపు; ఈ సారి రూ. 5 కోట్లు డిమాండ్

Salman Khan: చంపేస్తామంటూ సల్మాన్ ఖాన్ కు మళ్లీ బెదిరింపు; ఈ సారి రూ. 5 కోట్లు డిమాండ్

Sudarshan V HT Telugu
Nov 08, 2024 02:51 PM IST

Salman Khan: సల్మాన్ ఖాన్ ను హత్య చేస్తామని గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయి గ్యాంగ్ నుంచి బెదిరింపు కాల్స్ కొనసాగుతున్నాయి. తాజాగా, ముంబై ట్రాఫిక్ హెల్ప్ లైన్ వాట్సాప్ నంబర్ కు ఒక సందేశం వచ్చింది. రూ. 5 కోట్లు చెల్లించకపోతే సల్మాన్ ఖాన్ ను హత్య చేస్తామని అందులో హెచ్చరించారు.

చంపేస్తామంటూ సల్మాన్ ఖాన్ కు మళ్లీ బెదిరింపు
చంపేస్తామంటూ సల్మాన్ ఖాన్ కు మళ్లీ బెదిరింపు

Salman Khan: బాలీవుడ్ నటుడు, సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ కు గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయి గ్యాంగ్ సభ్యుల నుంచి బెదిరింపు కాల్స్ కొనసాగుతున్నాయి. తాజాగా, తాము లారెన్స్ బిష్ణోయికి సంబంధించిన వారమని, వెంటనే సల్మాన్ ఖాన్ తమకు రూ. 5 కోట్లు చెల్లించకపోతే, అతడిని చంపేస్తామని ముంబై ట్రాఫిక్ హెల్ప్ లైన్ వాట్సాప్ నంబర్ కు ఒక మెసేజ్ వచ్చింది. సల్మాన్ ఖాన్ తో పాటు ఓ గేయ రచయితను లక్ష్యంగా చేసుకుని ఈ బెదిరింపు మెసేజ్ వచ్చింది. 'మై సికందర్ హూన్' పాట రాసిన గీత రచయితను చంపేస్తామని అందులో బెదిరించారు. సల్మాన్ ఖాన్ కు ఎవరైనా సహాయం చేస్తే తీవ్ర పర్యవసానాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఆ గీత రచయితను రక్షించడానికి సల్మాన్ ఖాన్ తన పలుకుబడిని ఉపయోగించవచ్చని, అలా చేస్తే అతడికే నష్టమని హెచ్చరించారు.

పోలీసులు అప్రమత్తం

సల్మాన్ ఖాన్ ను చంపేస్తామన్న సందేశం రాగానే స్టాండర్డ్ ప్రోటోకాల్ ను అనుసరించి, ట్రాఫిక్ కంట్రోల్ రూమ్ సీనియర్ పోలీస్ అధికారులను అప్రమత్తం చేసింది, అనంతరం, వర్లీ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. తమ వద్ద ఉన్న నంబర్ సాయంతో నిందితులను ట్రేస్ చేయడం ప్రారంభించామని ఓ పోలీసు అధికారి తెలిపారు. ఇలాంటి బెదిరింపులకు పాల్పడినందుకు కర్ణాటకలో భికా రామ్ బిష్ణోయ్ ను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. సల్మాన్ ఖాన్ ను భికా రామ్ బిష్ణోయ్ రూ .5 కోట్లు డిమాండ్ చేశాడు. సల్మాన్ ఖాన్ బిష్ణోయ్ కమ్యూనిటీ ఆలయంలో క్షమాపణ చెప్పాలని లేదా నవంబర్ 5 లోగా ఆ మొత్తాన్ని చెల్లించాలని పట్టుబట్టాడు.

సల్మాన్ కు ముప్పు తప్పదు

అరెస్టయిన తరువాత, బిష్ణోయ్ ధిక్కార స్వరంతో ఇలా అన్నాడు, ‘‘నేను బిష్ణోయ్ సమాజం కోసం జైలుకు వెళ్ళినందుకు నాకు ఎటువంటి పశ్చాత్తాపం లేదు. సల్మాన్ ఖాన్ నుంచి వసూలు చేసిన డబ్బుతో లారెన్స్ బిష్ణోయ్ కి గుడి కట్టాలనుకున్నాను’’ అని తెలిపాడు. కృష్ణ జింకను చంపేసినందుకు ఖాన్ ఎప్పుడూ క్షమాపణలు చెప్పలేదన్నారు.

గతంలొ పలు బెదిరింపులు

గతంలో కూడా సల్మాన్ ఖాన్ కు ఇలాంటి పలు బెదిరింపులు వచ్చాయి. సల్మాన్ ఖాన్ తో పాటు ఎన్సీపీ నేత జీషాన్ సిద్ధిఖీల నుంచి రూ.2 కోట్లు డిమాండ్ చేసిన నిరుద్యోగి బాంద్రా వాసిని పోలీసులు గతంలో అరెస్టు చేశారు. మరో ఘటనలో జంషెడ్పూర్ కూరగాయల వ్యాపారిని అదుపులోకి తీసుకున్నారు. ‘‘దీన్ని తేలిగ్గా తీసుకోవద్దు. సల్మాన్ ఖాన్ జీవించి ఉండాలనుకుంటే, లారెన్స్ బిష్ణోయ్ తో శత్రుత్వాన్ని అంతం చేయాలనుకుంటే రూ.5 కోట్లు చెల్లించాలి. డబ్బు ఇవ్వకపోతే బాబా సిద్ధిఖీ కంటే సల్మాన్ ఖాన్ (salman khan) పరిస్థితి దారుణంగా ఉంటుంది’’ అని ఆ కూరగాయల వ్యాపారి ఒక సందేశంలో బెదిరించాడు. ఈ ఏప్రిల్ లో అనుమానిత లారెన్స్ బిష్ణోయ్ ముఠా సభ్యులు ఖాన్ బాంద్రా నివాసం వెలుపల కాల్పులు జరిపారు, సుమారు 15 మంది వ్యక్తులు అతని పన్వేల్ ఫాంహౌస్, ఇతర ఆస్తుల మధ్య అతని ప్రయాణ మార్గాలపై నిఘా పెట్టారు.

Whats_app_banner