Rajasthan new chief minister: రాజస్తాన్ కొత్త ముఖ్యమంత్రిగా భజన్ లాల్ శర్మను బీజేపీ హై కమాండ్ ఎంపిక చేసింది. భజన్ లాల్ తొలి సారి ఎమ్మెల్యేగా ఎన్నిక కావడం విశేషం. ప్రస్తుతం ఆయన సాంగ్నర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మంగళవారం ఉదయం కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల పార్టీ కేంద్ర పరిశీలకుల బృందం ఆధ్వర్యంలో లెజిస్టేటివ్ పార్టీ సమావేశం జరిగింది.
రాజస్తాన్ ముఖ్యమంత్రిగా భజన్ లాల్ శర్మను ఎంపిక చేసిన బీజేపీ, రాజవంశానికి చెందిన దియా కుమారి, ప్రేమ్ చంద్ భైర్వాను ఉప ముఖ్యమంత్రులుగా నియమించింది. అసెంబ్లీ స్పీకర్ గా వాసుదేవ్ దేవ్నానీ వ్యవహరిస్తారు. ముఖ్యమంత్రి రేసులో ముందున్న వసుంధర రాజే తదుపరి ముఖ్యమంత్రిగా భజన్ లాల్ పేరును ప్రతిపాదించారు. వసుంధర రాజేతో పాటు దియాకుమారి, కిరోరి లాల్ మీనా, బాలక్ నాథ్.. తదితరులు కూడా సీఎం రేసులో ఉన్నారు. కానీ, అనూహ్యంగా భజన్ లాల్ ను పార్టీ ఎంపిక చేసింది. 200 స్థానాల రాజస్తాన్ అసెంబ్లీలో 199 సీట్లకు ఎన్నికలు జరిగాయి. అందులో 115 సీట్లను బీజేపీ గెల్చుకుని అధికారంలోకి వచ్చింది.
అగ్రవర్ణానికి చెందిన భజన్ లాల్ శర్మ ఆరెస్సెస్ నేపథ్యం ఉన్న నాయకుడు. విద్యార్థి రాజకీయాల్లో బీజేపీ అనుబంధ విభాగం ఏబీవీపీలో క్రియాశీలకంగా పని చేశారు. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాకు సన్నిహితుడిగా ఆయనకు పేరు.