Rajasthan Assembly Election: రాజస్తాన్ సీఎం రేసులో మహంత్ బాలక్ నాథ్; యోగి ఆదిత్యానాథ్ తరహాలో మరో సన్యాసికి బీజేపీ పట్టం?-rajasthan assembly election mahant balaknath emerges as top cm posts candidate ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Rajasthan Assembly Election: రాజస్తాన్ సీఎం రేసులో మహంత్ బాలక్ నాథ్; యోగి ఆదిత్యానాథ్ తరహాలో మరో సన్యాసికి బీజేపీ పట్టం?

Rajasthan Assembly Election: రాజస్తాన్ సీఎం రేసులో మహంత్ బాలక్ నాథ్; యోగి ఆదిత్యానాథ్ తరహాలో మరో సన్యాసికి బీజేపీ పట్టం?

HT Telugu Desk HT Telugu
Dec 03, 2023 03:44 PM IST

Rajasthan Assembly Election: రాజస్తాన్ లో బీజేపీ విజయం దాదాపు ఖాయమైంది. ఇప్పటికే 38 స్థానాల్లో విజయం సాధించి మరో 78 స్థానాల్లో లీడింగ్ లో ఉంది. కాగా, అనూహ్యంగా రాజస్తాన్ సీఎం రేసులోకి ఒక సన్యాసి దూసుకురావడం సంచలనం గా మారింది.

మహంత్ బాలక్ నాథ్ (కాషాయ దుస్తుల్లో ఉన్న వ్యక్తి)
మహంత్ బాలక్ నాథ్ (కాషాయ దుస్తుల్లో ఉన్న వ్యక్తి) (PTI)

Rajasthan Assembly Election: రాజస్తాన్ లో బీజేపీ విజయం దాదాపు ఖాయమైన నేపథ్యంలో, సీఎం ఎవరు కానున్నారన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. సీఎం రేసులో వసుంధర రాజే ముందంజలో ఉండగా, ఆరెస్సెస్, బీజేపీ అధిష్టానం ఆశీస్సులు మెండుగా ఉన్న మహంత్ బాలక్ నాథ్ అనూహ్యంగా ఈ రేసులోకి దూసుకువచ్చారు.

అల్వార్ ఎంపీ..

40 ఏళ్ల మహంత్ బాలక్ నాథ్ ప్రస్తుతం రాజస్తాన్ (Rajasthan) లోని అల్వార్ నియోజకవర్గం నుంచి లోక్ సభ సభ్యుడిగా ఉన్నారు. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో తిజార (Tijara) నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఈ స్థానం నుంచి ఆయన విజయం దిశగా వెళ్తున్నారు. ఆయన రాజస్తాన్ ముఖ్యమంత్రి పదవికి పోటీ పడుతున్నట్లు మీడియా కథనాలు వెలువడుతున్నాయి. పార్టీ హై కమాండ్ కూడా ఆయన వైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం.

చిన్న వయస్సులోనే సన్యాసం

మహంత్ బాలక్ నాథ్ చిన్న వయస్సులోనే సన్యాసం స్వీకరించారు. కుటుంబ సభ్యుల నిర్ణయం మేరకు ఆరేళ్ల వయస్సులోనే ఆయన సన్యాస దీక్ష తీసుకున్నారు. సమాజానికి సేవ చేయడానికి తాను ఆ మార్గం స్వీకరించినట్లు మహంత్ బాలక్ నాథ్ చెబుతారు. అల్వార్ ప్రాంతంలో ఆయనకు పెద్ద ఎత్తున భక్తులు, అభిమానులు ఉన్నారు. ఆదివారం ఉదయం కౌంటింగ్ ప్రారంభం కావడానికి ముందు ఆయన అల్వార్ లోని శివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు.

ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై..

ముఖ్యమంత్రి రేసులో ఉండడంపై మహంత్ బాలక్ నాథ్ స్పందిస్తూ, సీఎం ఎవరనేది పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుందని వ్యాఖ్యానించారు. ‘‘సీఎం పదవి అనేది ముఖ్యం కాదు. ప్రధాని మోదీ నాయకత్వంలో మేమంతా పని చేస్తాం. ముఖ్యమంత్రి ఎవరనేది పార్టీనే నిర్ణయిస్తుంది’’ అన్నారు. కాగా, కౌంటింగ్ కు ముందు రోజు, డిసెంబర్ 2 వ తేదీన ఆయన బీజేపీ కీలక వ్యూహకర్త, పార్టీ జనరల్ సెక్రటరీ బీఎల్ సంతోష్ తో ప్రత్యేకంగా సమావేశం కావడంతో ఆయన సీఎం రేసులో ఉన్నరన్న విషయం వైరల్ గా మారింది. అయితే, తాను మర్యాదపూర్వకంగానే బీఎల్ సంతోష్ ను కలిశానని మహంత్ బాలక్ నాథ్ తెలిపారు.

యోగి ఆదిత్యనాథ్ తరహాలో..

ఉత్తర ప్రదేశ్ సీఎం, గోరఖ్ పూర్ మఠాధిపతి యోగి ఆదిత్యానాథ్ తరహాలో మహంత్ బాలక్ నాథ్ కూడా నాథ్ సామాజిక వర్గానికి చెందినవారు కావడం గమనార్హం. అల్వార్ లో ఆయనకు అద్భుతమైన ఫాలోయింగ్ ఉంది. కాగా, ప్రస్తుతం బీజేపీ తరఫున రాజస్తాన్ సీఎం రేసులో మాజీ సీఎం వసుంధర రాజె సింధియా, కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కూడా ఉన్నారు.

WhatsApp channel