Exit Polls: ఎగ్జిట్ పోల్ అంచనాలను నమ్మొచ్చా?.. 2019లో ఏం జరిగింది?-exit polls how accurate were predictions for maharashtra jharkhand in 2019 ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Exit Polls: ఎగ్జిట్ పోల్ అంచనాలను నమ్మొచ్చా?.. 2019లో ఏం జరిగింది?

Exit Polls: ఎగ్జిట్ పోల్ అంచనాలను నమ్మొచ్చా?.. 2019లో ఏం జరిగింది?

Sudarshan V HT Telugu
Nov 20, 2024 05:44 PM IST

Exit Polls: మరి కొద్ది సేపట్లో మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగుస్తుంది. పోలింగ్ ముగియగానే, ఎగ్జిట్ పోల్స్ ను విడుదల చేయడానికి పలు సంస్థలు, న్యూస్ చానళ్లు సిద్ధంగా ఉన్నాయి. 2019 లో ఈ రాష్ట్రాల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమయ్యాయా?

ఎగ్జిట్ పోల్ అంచనాలను నమ్మొచ్చా?
ఎగ్జిట్ పోల్ అంచనాలను నమ్మొచ్చా? (PTI)

Exit Polls: మహారాష్ట్రలోని మొత్తం 288 అసెంబ్లీ స్థానాలు, జార్ఖండ్ లోని 38 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 20న పోలింగ్ జరుగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. చివరి ఓటింగ్ ముగిసిన వెంటనే మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపోటములు, ఓట్ల శాతాన్ని అంచనా వేస్తూ వివిధ సంస్థలు ఎగ్జిట్ పోల్ ఫలితాలను విడుదల చేస్తాయి. అయితే, రెండు రాష్ట్రాల ఓట్ల లెక్కింపు జరిగే నవంబర్ 23న మాత్రమే అసలు ఫలితాలు వెల్లడవుతాయి.

ఎగ్జిట్ పోల్స్ అంటే ఏమిటి?

పోలింగ్ అనంతరం సర్వే సంస్థలు సేకరించిన ఓటర్ల ఫీడ్ బ్యాక్ ఆధారంగా ఎగ్జిట్ పోల్స్ (exit poll) ను అంచనా వేస్తారు. ఎగ్జిట్ పోల్స్ ను ఆయా రాష్ట్రాల్లో చివరి ఓటు వేసిన 30 నిమిషాల తర్వాత విడుదల చేయాలి.. కాబట్టి నిబంధనల ప్రకారం మహారాష్ట్ర, జార్ఖండ్ (ఫేజ్ 2) పోలింగ్ తేదీ అయిన ఈ రోజు సాయంత్రం 6:30 గంటల తర్వాత ఎగ్జిట్ పోల్ డేటా బయటకు రావాలి. ఎగ్జిట్ పోల్స్ ప్రతీ సారి సరైన అంచనాలనే వెల్లడించలేదు. గత లోక్ సభ ఎన్నికల (lok sabha elections 2024) ఫలితాలను, ఇటీవల జరిగిన హరియాణా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను తప్పుగా అంచనా వేశాయి. ఈ నేపథ్యంలో 2019 లో మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ఎగ్జిట్ పోల్స్ ఎలా అంచనా వేశాయో చూద్దాం.

అంచనా కరెక్టే..

2019 అసెంబ్లీ ఎన్నికల్లో మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను అంచనా వేయడంలో ఎగ్జిట్ పోల్స్ చాలావరకు విజయం సాధించాయి. మహారాష్ట్రలో బీజేపీ-శివసేన మిత్రపక్షాలు విజయం సాధిస్తాయని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ఆ వెంటనే పొత్తు తెగిపోయిందనేది వేరే విషయం. జార్ఖండ్ లో కూడా జార్ఖండ్ ముక్తి మోర్చా విజయం సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ సరిగ్గా అంచనా వేశాయి. అయితే, తుది సీట్లతో పోలిస్తే ఈ సంఖ్యలు పూర్తిగా కచ్చితమైనవి కావు.

2019లో మహారాష్ట్ర ఎగ్జిట్ పోల్స్?

ఆరు వేర్వేరు ఎగ్జిట్ పోల్స్ ఆధారంగా నిర్వహించిన సర్వేలో 2019 ఎన్నికల్లో బీజేపీ-శివసేన కూటమికి 213 సీట్లు, కాంగ్రెస్-ఎన్సీపీ కూటమికి 61 సీట్లు వస్తాయని తేలింది. అయితే, వాస్తవ ఫలితాల్లో బీజేపీ 105 స్థానాలు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. శివసేనకు 56 సీట్లు వచ్చాయి. ఈ రెండు పార్టీలు సాధించిన సీట్లు మెజారిటీ మార్కు అయిన 145 సీట్ల కంటే చాలా ఎక్కువ. మరోవైపు, కాంగ్రెస్ 44, ఎన్సీపీ 54 స్థానాల్లో విజయం సాధించాయి. అప్పటి నుంచి మహారాష్ట్రలో రాజకీయ అనిశ్చితి నెలకొంది. రెండు ప్రధాన ప్రాంతీయ పార్టీలైన శివసేన, ఎన్సీపీలు విడిపోయాయి. ఒకవైపు బీజేపీ, శివసేన (షిండే), అజిత్ పవార్ ఎన్సీపీ ల మహాయుతి, మరోవైపు, కాంగ్రెస్, శివసేన (ఉద్ధవ్), శరద్ పవార్ ఎన్సీపీ కూటములుగా తలపడుతున్నాయి.

2019లో జార్ఖండ్ ఎగ్జిట్ పోల్స్?

మహారాష్ట్ర తరహాలోనే 2019లో జరిగిన జార్ఖండ్ ఎన్నికల్లోనూ ఎగ్జిట్ పోల్ ఫలితాలు పక్కాగానే ఉన్నాయి. మొత్తం 81 స్థానాలున్న జార్ఖండ్ అసెంబ్లీలో కాంగ్రెస్-జేఎంఎం-ఆర్జేడీ కూటమికి 41 సీట్లు, బీజేపీకి 29 సీట్లు వస్తాయని మూడు ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. తుది ఫలితాలు వచ్చేసరికి జేఎంఎం 30 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. కాంగ్రెస్ 16, జార్ఖండ్ వికాస్ మోర్చా (జేవీఎం) 3, ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ 2 సీట్లు గెలుచుకున్నాయి. కాంగ్రెస్, ఆర్జేడీ మద్దతుతో జేఎంఎం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో హేమంత్ సోరెన్ నేతృత్వంలోని జేఎంఎం 81 సీట్లకు గాను 43 స్థానాల్లో పోటీ చేస్తోంది. కాంగ్రెస్ 30 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టింది.

Whats_app_banner