Elon Musk | ట్విట్టర్ 'డీల్ 'నుంచి మస్క్ తప్పుకుంటారా?
అమెరికా: ఎలాన్ మస్క్‌తో డీల్ పూర్తవడంతో ట్విట్టర్ షేర్హోల్డర్లు పండగ చేసుకున్నారు. కానీ డీల్‌ను పూర్తిచేసేందుకు అసలు మస్క్ వద్ద అంత నిధులున్నాయా? అన్న అనుమానాలు తాజాగా మొదలయ్యాయి. ఫలితంగా ట్విట్టర్ షేర్లు పతనమయ్యాయి. మస్క్ డీల్ నుంచి తప్పుకుంటారా?
Elon musk buys twitter | ఇప్పుడు ఎక్కడ చూసినా ఎలాన్ మస్క్- ట్విట్టర్ డీల్ గురించే చర్చ. అపర కుబేరుడు, టెస్లా సీఈఓ మస్క్ అనుకున్నది సాధించారు. నిరాకరించేందుకు వీలు లేని విధంగా భారీ డీల్‌ను ఆఫర్ చేసి ట్విట్టర్‌ను తన వశం చేసుకున్నారు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. కానీ.. డీల్‌ను పూర్తిచేసేందుకు మస్క్ వద్ద కావాల్సిన డబ్బులు ఉన్నాయా? అన్నది ఇప్పుడు అసలైన ప్రశ్నగా మారింది.
మస్క్- ట్విట్టర్ మధ్య 44బిలియన్ డాలర్ల ఒప్పందం కుదిరింది. ఫలితంగా ట్విట్టర్ షేర్ ప్రైజ్ పెరిగింది. కానీ.. ట్విట్టర్ డీల్‌ను పూర్తి చేసేందుకు మస్క్ వద్ద నిధులున్నాయా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవ్వడంతో షేర్లు పడ్డాయి. డీల్‌ను మొత్తం నిధుల రూపంలో క్లోజ్ చేసేందుకు మస్క్‌కు సాధ్యం కాదని ట్రేడర్లు భావిస్తున్నారు. 21బిలియన్ డాలర్ల నిధుల రూపంలో ఇచ్చి, తన టెస్లాలోని వాటాను అమ్ముతారేమో అని ఆశిస్తున్నారు. ఫలితంగా టెస్లా షేర్లు కూడా పడ్డాయి.
మస్క్ వెనకడుగేస్తారా?
Elon Musk twitter | అసలు తెరపైకి 'డీల్', 'ఆఫర్' అనే పదాలు రాక ముందు.. ట్విట్టర్లో మస్క్ 9శాతం వాటా కొన్నారు. కొన్ని రోజుల తర్వాత.. బోర్డులోకి మస్క్‌ను ట్విట్టర్ ఆహ్వానించింది. అందుకు ఆయన కూడా అంగీకరించారు. కానీ కొన్నిరోజుల్లోనే మనసు మార్చుకుని వెనక్కి తగ్గారు. ఆ తర్వాత ట్విట్టర్ మొత్తాన్నే కొనేందుకు ఆఫర్ ఇచ్చారు.
'ప్రస్తుతం మస్క్ సంపద 240బిలియన్ డాలర్లు. డీల్ వద్దు అనుకుంటే.. బ్రేకప్ ఫీ కింద మస్క్ 1బిలియన్ డాలర్లను చెల్లించాల్సి ఉంటుంది. డీల్‌ను పూర్తిచేసేందుకు రానున్న ఆరు నెలలు మస్క్‌కు కష్టమనే చెప్పాలి,' అని కెల్నర్ క్యాపిటల్‌కు చెందిన పోర్ట్‌ఫోలియో మేనేజర్ క్రిస్ పుల్ట్జ్ వెల్లడించారు.
240బిలియన్ డాలర్లు ఉన్న వ్యక్తి.. 1బిలియన్ డాలర్లను వెచ్చించి డీల్ నుంచి తప్పుకుంటే.. ఆశ్చర్యం ఏమీ ఉండదు అని పలువురు అభిప్రాయపడుతున్నారు. ట్విట్టర్ డీల్ కన్నా బ్రేకప్ ఫీజు చాలా తక్కువ అని గుర్తుచేస్తున్నారు.
ట్విట్టర్- టెస్లా షేర్లు..
ఈ వ్యవహారంతో ట్విట్టర్ షేర్లు బుధవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి 2.1శాతం మేర పతనమయ్యాయి. ప్రస్తుతం 48.68 డాలర్ల వద్ద ట్విట్టర్ షేరు ఉంది.
మరోవైపు టెస్లా షేర్లను మస్క్ అమ్ముతారేమో అన్న ఊహాగానాలతో.. టెస్లా షేర్లు మంగళవారం 12శాతం మేర పతనమయ్యాయి. ఫలితంగా 126బిలియన్ డాలర్ల వాల్యూ ఆవిరైంది.
సంబంధిత కథనం