Monkeypox: దేశంలో మంకీపాక్స్ అలజడి - కొత్తగా మరో కేసు నమోదు-delhi reports first case of monkeypox today ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Monkeypox: దేశంలో మంకీపాక్స్ అలజడి - కొత్తగా మరో కేసు నమోదు

Monkeypox: దేశంలో మంకీపాక్స్ అలజడి - కొత్తగా మరో కేసు నమోదు

HT Telugu Desk HT Telugu
Jul 24, 2022 12:24 PM IST

Monkeypox case in Delhi: దేశంలో మంకీపాక్స్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. తాజాగా ఆదివారం ఢిల్లీలో మంకీపాక్స్ కేసు వెలుగు చూసింది.

<p>భారత్ లో పెరుగుతున్న మాంకీపాక్స్ కేసులు</p>
భారత్ లో పెరుగుతున్న మాంకీపాక్స్ కేసులు

Monkeypox case in India: భారత్ లో మంకీపాక్స్ కేసులు కలకలం రేపుతున్నాయి. ఈ సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది. తాజాగా ఢిల్లీలో ఇవాళ మంకీపాక్స్ కేసు నమోదైంది.ఫలితంగా దేశంలో మొత్తం మంకీపాక్స్‌ల కేసుల సంఖ్య 4కు చేరింది. ఢిల్లీలో మొదటి మంకీపాక్స్ కేసు నమోదైనట్టుగా కేంద్ర ఆరోగ్యశాఖ నిర్ధారించింది.

మంకీపాక్స్ సోకిన వ్యక్తి ప్రస్తుతం మౌలానా ఆజాద్ మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతున్నాడు. ఆ వ్యక్తి వయసు 31 ఏళ్లు కాగా.. అతడికి ఎటువంటి విదేశీ ట్రావెల్ హిస్టరీ లేదని ఆరోగ్యశాఖ తెలిపింది. బాధితుడు జ్వరం, చర్మ గాయాలతో బాధపడుతున్నాడని... చికిత్స కొనసాగుతోందని పేర్కొంది.

బాధిత వ్యక్తి ఇటీవల హిమాచల్ ప్రదేశ్‌లోని మనాలిలో జరిగిన ఒక పార్టీకి హాజరైనట్లుగా అధికార వర్గాలు పీటీఐకి తెలిపాయి. మూడు రోజుల క్రితం అతనికి మంకీ పాక్స్ లక్షణాలు కనిపించడంతో మౌలానా ఆజాద్ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో చేర్పించారు. అతని నమూనాలను శనివారం పూణేలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ కి పంపగా పాజిటివ్‌ నిర్దారణ అయిందని పేర్కొన్నాయి. అతని కాంటాక్ట్ ట్రేసింగ్ ప్రక్రియ ప్రారంభించినట్లు తెలిపారు.

కేరళలో మూడు కేసులు...

కేరళలో ఇప్పటికే 3 మాంకీపాక్స్ కేసులు నమోదైన సంగతి తెలిసిందే. మూడో కేసు జూలై 22న యూఏఈ నుంచి కేరళకు వచ్చిన 35 ఏళ్ల వ్యక్తి వ్యాధి నిర్ధారణ అయింది. ఇప్పటికే ఇందుకు సంబంధించి పలు మార్గదర్శకాలను కూడా కేరళ సర్కార్ విడుదల చేసింది. బాధితులకు ఐసోలేషన్ లో ఉంచి చికిత్స అందిస్తోంది.

ఇక కేంద్ర ఆరోగ్యశాఖ అన్ని విమానాశ్రయాలకు ఆదేశాలు జారీ చేసింది. విదేశాల నుంచి భారత్ కు వచ్చే వారికి స్క్రీనింగ్ టెస్ట్ లను నిర్వహించాలని స్పష్టం చేసింది. మాంకీపాక్స్ కేసుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని... ఇతర ఏజెన్సీలతో కూడా కోఆర్డినెట్ చేసుకోవాలని సూచించింది.

గ్లోబ‌ల్ ప‌బ్లిక్‌ హెల్త్ ఎమ‌ర్జెన్సీ

ఇదిలా ఉంటే శనివారం... ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. మంకీపాక్స్‌ను గ్లోబ‌ల్ ప‌బ్లిక్‌ హెల్త్ ఎమ‌ర్జెన్సీ (global public health emergency)గా ప్ర‌క‌టించింది. ఈ ఆరోగ్య స‌మ‌స్య‌ను తీవ్రంగా తీసుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌ని స్ప‌ష్టం చేసింది.

ప్ర‌పంచ‌వ్యాప్తంగా మంకీపాక్స్ వ్యాప్తి ఆందోళ‌న‌క‌ర స్థాయిలో ఉంద‌ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ (World Health Organisation WHO) చీఫ్ టెడ్రోస్ ఘెబ్రియేసస్‌(Tedros Ghebreyesus) వ్యాఖ్యానించారు. అంత‌ర్జాతీయంగా ప్ర‌జారోగ్యంపై ఇది దారుణ ప్ర‌భావం చూపే ముప్పు ఉంద‌ని హెచ్చ‌రించారు. గ‌త నెల‌లో మంకీపాక్స్ వ్యాప్తిపై WHO ఎమ‌ర్జెన్సీ స‌మావేశం నిర్వ‌హించిన నాటికి, నేటికి ఆ వైర‌స్ మెజారిటీ దేశాల‌కు విస్త‌రించింద‌న్నారు. ప్ర‌స్తుతం 75 దేశాల‌కు ఇది విస్త‌రించింద‌న్నారు. యూరోప్ దేశాలు మిన‌హా ఇత‌ర దేశాల్లో ఈ వైర‌స్ వ్యాప్తి సాధార‌ణం క‌న్నా కొంత ఎక్కువ‌గా ఉంద‌ని తెలిపారు. కానీ యూరోప్ ప్రాంతంలో మాత్రం ఈ వైర‌స్ ఆందోళ‌న‌క‌ర స్థాయిలో విస్త‌రిస్తోంద‌ని హెచ్చ‌రించారు. అయితే, ఇతర దేశాల్లోనూ దీని వ్యాప్తి వేగ‌వంత‌మ‌య్యే ముప్పు ఉంద‌న్నారు.

ప్ర‌స్తుతం మంకీపాక్స్ 75 దేశాల‌కు విస్త‌రించింద‌ని, ఆయా దేశాల్లో 16 వేల‌కు పైగా కేసులు న‌మోద‌య్యాయ‌ని టెడ్రోస్ వివ‌రించారు. ఇప్ప‌టివ‌ర‌కు ఈ వైర‌స్ కార‌ణంగా ఐదుగురు చ‌నిపోయార‌ని తెలిపారు.

Whats_app_banner

సంబంధిత కథనం

టాపిక్