COVID-19: కొవిడ్ విషయంలో చైనా నిజాలు చెప్పడం లేదు: డబ్ల్యూహెచ్‍వో-covid deaths in china heavily underreported who says ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Covid Deaths In China Heavily Underreported Who Says

COVID-19: కొవిడ్ విషయంలో చైనా నిజాలు చెప్పడం లేదు: డబ్ల్యూహెచ్‍వో

Chatakonda Krishna Prakash HT Telugu
Jan 12, 2023 08:33 AM IST

COVID-19: చైనాలో కొవిడ్ వల్ల మరణిస్తున్న వారి సంఖ్య భారీగా ఉందని భావిస్తున్నట్టు డబ్ల్యూహెచ్‍వో వెల్లడించింది. చైనా నిజాలు చెప్పడం లేదనేలా వ్యాఖ్యానించింది.

చైనాలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కరోనా పేషెంట్లు (Photo: AP/PTI)
చైనాలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కరోనా పేషెంట్లు (Photo: AP/PTI)

WHO on China: కొవిడ్-19 (COVID-19) విషయంలో చైనా మొదటి నుంచి వివరాలను దాచి పెడుతూనే వచ్చింది. ఈ విషయంలో చాలా దేశాలు.. చైనాపై గుర్రుగానే ఉన్నాయి. తొలుత కొవిడ్ విజృంభించిన సమయంలోనూ డ్రాగన్ దేశం సరైన వివరాలు వెల్లడించకపోవటంతోనే ప్రపంచమంతా ఈ వైరస్ వ్యాపించి అపార నష్టాన్ని మిగిల్చిందనే విమర్శలు ఉన్నాయి. తాజాగా, ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) మరోసారి కొవిడ్ పట్ల చైనా వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేసింది. కొవిడ్ మరణాల గురించి ఆ దేశం నిజాలను చెప్పడం లేదని తెలిపింది. కొవిడ్‍తో ఆ దేశంలో చాలా మంది చనిపోతున్నా.. చైనా మాత్రం లెక్కలను దాచిపెడుతోందని వ్యాఖ్యానించింది. వివరాలివే..

ట్రెండింగ్ వార్తలు

భారీగా మరణాలు!

చైనాలో కొవిడ్ వల్ల మరణిస్తున్న వారి సంఖ్య భారీగా ఉందని భావిస్తున్నామని డబ్ల్యూహెచ్‍ఓ ఎమర్జెన్సీస్ డైరెక్టర్ మైకేల్ ర్యాన్.. రిపోర్లతో అన్నారు. “చైనాలో రిపోర్ట్ చేయని మరణాలు చాలా భారీగా ఉన్నాయని డబ్ల్యూహెచ్‍వో ఇప్పటికీ భావిస్తోంది. కొవిడ్ గురించి పూర్తి వివరాలను వెల్లడించడం ఎంతో ముఖ్యం” అని ఆయన చెప్పారు. “ఆ దేశంలోని వైద్యులు కూడా కేసులను వెల్లడించేందుకు ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. అంతేకానీ దాచి పెట్టేలా చేయకూడదు” అని ఆయన అన్నారు.

అమెరికా భేష్

కొవిడ్-19 విషయంలో అమెరికా పారదర్శకంగా ఉందని డబ్ల్యూహెచ్‍వో అభిప్రాయపడింది. ఆ దేశంలో ప్రస్తుతం XBB 1.5 ఒమిక్రాన్ వేరియంట్ వ్యాపిస్తోంది. “డేటాకు సంబంధించి అమెరికా చాలా పారదర్శకంగా ఉంది. డబ్ల్యూహెచ్‍వోకు సహకరిస్తోంది” అని ర్యాన్ అన్నారు.

కాగా, చైనాలో కోట్లాది కొత్త కొవిడ్ కేసులు నమోదవుతున్నాయని సమాచారం బయటికి వస్తోంది. జీరో కొవిడ్ పాలసీ ఎత్తేశాక పరిస్థితి మరింత తీవ్రం అయిందని తెలుస్తోంది. అయితే మరణాల విషయంలో మాత్రం సమాచారాన్ని చైనా దాచిపెడుతోందనే అనుమానాలు ఉన్నాయి. గత నెల మొత్తం మీద కొవిడ్‍తో తమ దేశంలో 37 మంది చనిపోయారని చైనా వెల్లడించింది. అయితే ఈ సమాచారం నమ్మశక్యంగా లేదనే వాదనలు ఉన్నాయి. ఇప్పుడు డబ్ల్యూహెచ్‍వో కూడా ఇదే విధంగా వ్యాఖ్యలు చేసింది.

మరోవైపు, భారత్‍లో కొవిడ్ 19 మళ్లీ వ్యాపించకుండా భారత ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. చైనా సహా ఆరు దేశాల నుంచి వచ్చే వారికి కొవిడ్-19 నెగెటివ్ రిపోర్ట్ తప్పనిసరిగా ఉండాలన్న నిబంధన విధించింది. కాగా, భారతీయుల్లో హెర్డ్ ఇమ్యూనిటీ ఇప్పటికే ఉందని, దేశంలో మరో వేవ్ వచ్చే అవకాశం లేదని నిపుణులు చెబుతున్నారు.

IPL_Entry_Point

టాపిక్