హిమాచల్‌లో కాంగ్రెస్‌దే అధికారం.. 38 స్థానాల్లో గెలుపు
హిమాచల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. అధికారం దక్కేందుకు అవసరమైన 38 స్థానాల్లో విజయం సాధించింది. మరో 2 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.
హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ విజయం ఖాయమైంది. మొత్తం 68 స్థానాలు ఉన్న అసెంబ్లీలో 35 సీట్లు వచ్చిన పార్టీదే అధికారం. భారత ఎన్నికల సంఘం తాజా నివేదిక ప్రకారం, కాంగ్రెస్ అధికారానికి అవసరమైన 38 సీట్లు గెలుచుకుంది. మరో 2 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. బీజేపీ 18 స్థానాలను కైవసం చేసుకుంది. 7 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇండిపెండెంట్లు కూడా మూడు స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. 2017 అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ 44 స్థానాలతో గద్దెనెక్కింది.
అయితే చాాలా స్వల్ప మెజారిటీతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో కొత్త ఎమ్మెల్యేలను కాపాడుకోవడం, స్వతంత్రుల మద్దతు సాధించడం కాంగ్రెస్‌కు ఇప్పుడు అత్యవసరంగా మారింది. ఈ నేపథ్యంలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతోసమావేశం ఏర్పాటు చేయబోతోంది.
రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం తమకు లభిస్తున్నందుకు సంతోషంగా ఉందని, పార్టీ ఇచ్చిన 10 హామీలను నెరవేర్చేందుకు పార్టీ అన్ని విధాలా చేస్తుందని శుక్లా అన్నారు. ‘కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎన్నికల ఫలితాల అనంతరం చండీగఢ్‌లో సమావేశమై కొత్త శాసనసభా పక్ష నేతను ఎన్నుకోవడంపై నిర్ణయం తీసుకుంటారు’ అని పార్టీ హిమాచల్ ప్రదేశ్ వ్యవహారాల ఇంఛార్జి శుక్లా చెప్పారు.
సీఎల్పీ నేతను నిర్ణయించేందుకు కాంగ్రెస్ అధ్యక్షుడికి అధికారం ఇస్తూ ఎమ్మెల్యేలు ఏకవాక్య తీర్మానాన్ని ఆమోదించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి.
‘పార్టీ ఇద్దరు పరిశీలకులను పంపుతోంది. ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బాఘేల్, సీనియర్ నాయకుడు భూపిందర్ హుడా ఉంటారు. పార్టీ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన 10 హామీలను నెరవేర్చి రాష్ట్ర ప్రజలకు సుపరిపాలన అందజేస్తుంది. గత ఆరుసార్లు వీరభద్రసింగ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చేసిన విధంగానే ప్రజలకు అండగా ఉంటాం.’ అని శుక్లా వివరించారు.
బఘెల్, హుడాతో కలిసి తాను హిమాచల్ ప్రదేశ్‌కు వెళతానని అంతకుముందు శుక్లా చెప్పారు. "ఫలితాలు ఇంకా వస్తున్నాయి... ఇది ప్రజల విజయం. దేవుని ఆశీర్వాదంతో, కాంగ్రెస్ గెలిస్తే, హిమాచల్ ప్రదేశ్ ప్రజల ప్రయోజనాల కోసం మేము చేయగలిగినదంతా చేస్తాము. ప్రియాంక జీ చాలా ప్రచారం చేసింది. ఆమె చాలా కష్టపడి పనిచేసింది’ అని ఆయన విలేకరులతో అన్నారు.
ఎన్నికల సన్నాహాల్లో సహకరించిన కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, మాజీ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ఎన్నికలపై, ప్రజల్లో కూడా పరోక్ష ప్రభావం చూపిందని ఆయన అన్నారు.
శుక్లా హిమాచల్ ప్రదేశ్‌కు ఏఐసీసీ ఇన్‌ఛార్జ్‌గా ఉండగా, బఘేల్‌ను ఎన్నికల సీనియర్ పరిశీలకుడిగా నియమించారు.