Rajasthan elections: ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలు పైననే కాంగ్రెస్ ఆశలు-congress hopes old pension plan may bolster prospects in rajasthan elections ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Rajasthan Elections: ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలు పైననే కాంగ్రెస్ ఆశలు

Rajasthan elections: ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలు పైననే కాంగ్రెస్ ఆశలు

HT Telugu Desk HT Telugu
Oct 11, 2023 06:25 PM IST

Rajasthan elections: పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించడంతో ఈ సారి రాజస్తాన్ లో తమను గట్టెక్కడం ఖాయమన్న ఆశలో కాంగ్రెస్ పార్టీ ఉంది. 2022 ఫిబ్రవరిలో పాత పెన్షన్ విధానాన్ని రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పునరుద్ధరించింది.

రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్
రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ (HT_PRINT)

Rajasthan elections: రాజస్తాన్ లో మళ్లీ అధికారంలోకి రావడం కోసం కాంగ్రెస్ పూర్తి శక్తియుక్తులను ప్రయోగిస్తోంది. ఒకవైపు రాష్ట్రంలోని అగ్ర నాయకత్వంలో విబేధాలున్నప్పటికీ.. పార్టీ ఇస్తున్న ఎన్నికల హామీలు ఈ సారి తమను గెలిపిస్తాయని కాంగ్రెస్ భావిస్తోంది. ముఖ్యంగా, ఇప్పటికే అమలు చేసిన పాత పెన్షన్ విధానం వల్ల ఉద్యోగుల ఓట్లు అన్ని తమకేనని ఆశతో ఉంది. గత సంవత్సరం హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలపై పాత పెన్షన్ విధానం చూపిన ప్రభావాన్ని గుర్తు చేస్తోంది.

కొత్త స్కీమ్ తో బీజేపీ..

బీజేపీ తీసుకువచ్చిన కొత్త పెన్షన్ స్కీమ్ పై ఉద్యోగుల్లో పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తం అవుతున్న నేపథ్యంలో.. ఆ విధానం తమ విజయావకాశాలను దెబ్బ తీస్తుందన్న భావనలో బీజేపీ ఉంది. అందుకని, పాత పెన్షన్ స్కీమ్ కన్నా మరింత మెరుగైన విధానాన్ని రూపొందించి అమలు చేస్తామని హామీ ఇస్తోంది. కాగా, పాత పెన్షన్ విధానాన్ని ఫిబ్రవరి 2022 నుంచి రాజస్తాన్ లోని కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ అమల్లోకి తీసుకువచ్చింది. 2004 తరువాత సర్వీసులో చేరిన ఉద్యోగులకు అందరికీ ఈ ఓపీఎస్ అమలవుతుందని తెలిపింది. ఇలా పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించిన తొలి రాష్ట్రంగా నిలిచింది. ఆ తరువాత ఇదే తరహాలో చత్తీస్ గఢ్ లోని కాంగ్రెస్ ప్రభుత్వం, జార్ఖండ్ లోని జేఎంఎం ప్రభుత్వం, పంజాబ్ లోని ఆప్ ప్రభుత్వం పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తూ నిర్ణయం తీసుకున్నాయి.

పాత స్కీమ్ తో బెనిఫిట్స్..

ప్రభుత్వ ఉద్యోగులు ఏకగ్రీవంగా పాత పెన్షన్ స్కీమ్ కావాలని కోరుకుంటున్నారు. ఆ పథకం ద్వారా ద్రవ్యోల్బణం అధారిత, పేకమిషన్ సిఫారులు అమలయ్యే గ్యారెంటీ పెన్షన్ విశ్రాంత ఉద్యోగులకు లభిస్తుంది. వారు మరణించిన తరువాత వారి జీవిత భాగస్వామికి కూడా ఆ పెన్షన్ లభిస్తుంది. ఈ విధానంలో ఉద్యోగి నుంచి ఎలాంటి వాటా చెల్లింపు ఉండదు. కొత్త పెన్షన్ విధానంలో ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ ఉంటుంది. ప్రభుత్వ వాటా కూడా ఉంటుంది. పెన్షన్ పై మార్కెట్ ప్రభావం ఉంటుంది. 2004 లో ఈ కొత్త పెన్షన్ విధానాన్ని నాటి కేంద్ర ప్రభుత్వం అమల్లోకి వచ్చింది. ఆ తరువాత చాలా రాష్ట్రాలు ఈ విధానంలోకి మారాయి.

రాజస్తాన్ లో..

పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం గత సంవత్సరం నిర్ణయం తీసుకోవడంతో రాజస్తాన్ లో ప్రభుత్వ ఉద్యోగులు కాంగ్రెస్ పై సానుకూలతతో ఉన్నారు. అయితే, ఈ ఒక్క విధానం పార్టీని గట్టెక్కించలేదని, ప్రభుత్వ వ్యతిరేకత ప్రభావం తీవ్రంగా ఉండనుందని విశ్లేషకులు భావిస్తున్నారు. 2004 తరువాత జాయిన్ అయిన ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం వర్తిస్తుంది. రాజస్తాన్ లో అలా 2004 తరువాత విధుల్లో చేరిన ఉద్యోగులు సుమారు 3.5 లక్షల మంది ఉన్నారు.

Whats_app_banner