Rajasthan elections: రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికల తేదీ మార్పు; కారణం ఏంటో తెలుసా?
Rajasthan elections: రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికల తేదీని ఎన్నికల సంఘం మార్చింది. రాజస్తాన్ లో పోలింగ్ నవంబర్ 23 వ తేదీన కాకుండా నవంబర్ 25 వ తేదీన జరుగుతుందని ప్రకటించింది. కౌంటింగ్, ఫలితాల ప్రకటన డిసెంబర్ 3వ తేదీననే ఉంటుందని తెలిపింది.
Rajasthan elections: కేంద్ర ఎన్నికల సంఘం రాజస్తాన్ పోలింగ్ తేదీని మార్చింది. మొదట ప్రకటించిన తేదీల ప్రకారం, రాజస్తాన్ లోని 200 స్థానాల అసెంబ్లీకి ఒకే విడతలో నవంబర్ 23వ తేదీన పోలింగ్ జరగాల్సి ఉంది. అయితే, ఆ తేదీని మారుస్తున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది.
నవంబర్ 25న
రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నవంబర్ 23వ తేదీన కాకుండా, నవంబర్ 25వ తేదీన జరుగుతుందని బుధవారం ఎన్నికల సంఘం ప్రకటించింది. రాష్ట్రంలోని దాదాపు అన్ని రాజకీయ పార్టీలు, పలు సామాజిక సంస్థల నుంచి పెద్ద ఎత్తున వినతులు వచ్చినందువల్ల ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు వెల్లడించింది. 2018 ఎన్నికల్లో అప్పటివరకు అధికారంలో ఉన్న బీజేపీ ఓడిపోయి, కాంగ్రెస్ పవర్ లోకి వచ్చింది. సచిన్ పైలట్, కమల్ నాథ్ లు తమ విబేధాలను పక్కన బెట్టి కలసికట్టుగా రాజకీయ వ్యూహాలు రచించి, ప్రచారం నిర్వహించి కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకువచ్చారు.
కారణం ఏంటంటే.?
నవంబర్ 23వ తేదీన రాజస్తాన్ లో రికార్డు స్థాయిలో పెళ్లిళ్లు, ఎంగేజ్ మెంట్స్ ఉన్నాయి. అందువల్ల ఆ రోజు పోలింగ్ నిర్వహిస్తే, ఓటింగ్ శాతం గణనీయంగా తగ్గే అవకాశం ఉందని, అంతే కాకుండా, పోలింగ్ నిర్వహణకు కూడా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని రాజకీయ పార్టీలు, సామాజిక సంస్థలు ఎన్నికల సంఘానికి తెలిపాయి. అందువల్ల ఆ తేదీని మార్చాలని అభ్యర్థించాయి. ఇదే విషయాన్ని రాజస్తాన్ లోని లోకల్ మీడియా కూడా చాలా హైలైట్ చేసింది. దాంతో, ఎన్నికల సంఘం ఈ విషయాలను పరిగణనలోకి తీసుకుని రాజస్తాన్ లో పోలింగ్ తేదీని మార్చాలని నిర్ణయించింది. నవంబర్ 23వ తేదీన కాకుండా, నవంబర్ 25వ తేదీన పోలింగ్ నిర్వహించాలని నిర్ణయించింది. కౌంటింగ్, ఫలితాల ప్రకటన మాత్రం మిగతా నాలుగు రాష్ట్రాలతో పాటు డిసెంబర్ 3వ తేదీననే ఉంటుందని ప్రకటించింది.