China pneumonia outbreak: చైనాలో మరో ఆరోగ్య విపత్తు; కిక్కిరిస్తున్న ఆస్పత్రులు
China pneumonia outbreak: చైనాలో పుట్టిన కొరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా సృష్టించిన కల్లోలాన్ని మర్చిపోకముందే, అదే చైనాలో మరో ఆరోగ్య విపత్తు తలెత్తింది. ఆ దేశంతో అంతుచిక్కని వ్యాధితో బాధపడుతున్న వేల మంది చిన్నారులను ఆసుపత్రుల్లో చేరుస్తున్నారు.
China pneumonia outbreak: న్యూమోనియా లక్షణాలతో వేల మంది చిన్నారులు చైనాలో ఇప్పుడు బాధ పడుతున్నారు. అయితే, ఇది న్యూమోనియా కాదని వైద్యులు చెబుతున్నారు. జ్వరం, ఊపిరి తీసుకోవడంలో సమస్య ఈ వ్యాధిలో ప్రధాన లక్షణాలుగా ఉన్నాయి. ఈ సమస్యలతో బాధ పడుతున్న వేలాది మంది చిన్నారులను ఆసుపత్రులతో చేరుస్తున్నారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన
చైనాలో న్యూమోనియా లక్షణాలతో అంతు చిక్కని వ్యాధి వ్యాప్తి చెందుతుండడంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. ముఖ్యంగా చిన్నారులు ఈ వ్యాధి బారిన పడుతుండడం ఆందోళనకరమని పేర్కొంది. ఆ వ్యాధి వ్యాప్తి చెందకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలని సూచించింది. ఈ వ్యాధికి సంబంధించి పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలని చైనా ఆరోగ్య శాఖను కోరింది. వ్యాధి సోకినవారిని ఐసోలేట్ చేయడం, మాస్క్ ధరించడం, చేతులను తరచూ శుభ్రం చేసుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
చైనా నేషనల్ హెల్త్ కమిషన్ స్పందన
చైనాలోని నేషనల్ హెల్త్ కమిషన్ అధికారులు గత వారం ఈ కొత్త వ్యాధి వివరాలను వెల్లడించారు. దేశంలో శ్వాస సంబంధిత సమస్య వేగంగా వ్యాప్తి చెందుతోందని తెలిపారు. ముఖ్యంగా చైనా ఉత్తర ప్రాంతాల్లో ఈ సమస్య అధికంగా ఉందని వెల్లడించారు. కోవిడ్ ఆంక్షలను ఎత్తివేసిన తరువాత, పిల్లల్లో సాధారణంగా వచ్చే ఇన్ ఫ్లుయెంజా వంటి ఇన్ఫెక్షన్లు పెరిగాయని తెలిపింది.
పాఠశాలల బంద్
న్యూమోనియా లక్షణాలతో అంతు చిక్కని వ్యాధి పిల్లల్లో వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఈ సమస్య అధికంగా ఉన్న ఉత్తర చైనా ప్రాంతంలో పాఠశాలలను తాత్కాలికంగా మూసివేశారు. ఈ వ్యాధి మరింత వ్యాప్తి చెందకుండా ఉండడం కోసమే ఈ చర్య తీసుకున్నట్లు వెల్లడించారు.