All Party Meeting : బంగ్లాదేశ్ పరిస్థితి వెనుక ఇతర దేశాల కుట్ర దాగి ఉందా? రాహుల్ గాంధీ ప్రశ్నలు
Bangladesh Crisis : బంగ్లాదేశ్‌లో ప్రస్తుత పరిస్థితి, షేక్ హసీనా భారతదేశానికి రాకపై విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్ అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో అక్కడి భారతీయుల గురించి మాట్లాడారు.
బంగ్లాదేశ్‌లో నెలకొన్న అశాంతి, భారత్‌లో ప్రధాని షేక్ హసీనా ఆశ్రయంపై విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ముందుగా షేక్ హసీనా కోలుకుని సెటిల్ అవ్వాలని, ఆ తర్వాత ఈ విషయంపై ఆమెతో మాట్లాడాలని జైశంకర్ అన్నారు.
కొన్ని ఆలయాలపై దాడులు జరగడంతో మైనార్టీల భద్రతపై ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. కేంద్ర ప్రభుత్వం వేచి చూసే పరిస్థితులో ఉంది. ఎప్పటికప్పుడు బంగ్లాదేశ్ సైన్యంతో టచ్‌లో ఉంటుంది. షేక్ హసీనా భారత పర్యటనపై విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిఘా ఉంచింది.
బంగ్లాదేశ్‌లోని ఎంబసీ అధికారులు, భారతీయుల భద్రతకు కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని జైశంకర్ తెలిపారు. అయితే పరిస్థితిని దారుణంగా లేదని, కానీ జాగ్రత్తలు తీసుకోవాల్సినంత ఆందోళనకరంగా ఉందని ఆయన అన్నారు. బంగ్లాదేశ్‌లో కనీసం 20 వేల మంది భారతీయులు ఉన్నారు. వారిలో 8 వేల మంది తిరిగి వచ్చారు.
బంగ్లాదేశ్‌లో పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నామని భారత ప్రభుత్వం అఖిలపక్ష సమావేశంలో తెలిపింది. బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం 12,000 నుంచి 13,000 మంది భారతీయులు ఉన్నారని ప్రభుత్వం చెబుతోంది. అయితే మన పౌరులను ఖాళీ చేయించే పరిస్థితులు అక్కడ లేవని అంటోంది. బంగ్లాదేశ్ సైన్యంతో కేంద్ర ప్రభుత్వం టచ్‌లో ఉంది. ప్రస్తుతం అక్కడ పరిస్థితి అస్థిరంగా ఉందని జైశంకర్ చెప్పారు.
అఖిలపక్ష సమావేశంలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కొన్ని ప్రశ్నలు వేశారు. ప్రస్తుత బంగ్లాదేశ్ పరిస్థితి వెనుక ఇతర దేశాల కుట్ర దాగి ఉందా అని ప్రశ్నించారు. బంగ్లాదేశ్‌లో జరిగిన దాని వెనుక విదేశీ హస్తం ఉందా అని రాహుల్ గాంధీ తక్షణ, దీర్ఘకాలిక వ్యూహం గురించి కేంద్రాన్ని ప్రశ్నించారు.
బంగ్లాదేశ్‌లో మారుతున్న పరిణామాలను ప్రభుత్వం గమనిస్తోంది. పాక్ దౌత్యవేత్త ఒకరు ఉద్యమ చిత్రంతో కూడిన డిపిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాని గురించి సమాచారం సేకరిస్తున్నారని జైశంకర్ చెప్పారు. బంగ్లాదేశ్ స్వాతంత్ర్య సమరయోధుల వారసులకు 30 శాతం రిజర్వేషన్ల రద్దుపై నిరసనలు జరిగాయి. దీంతో ప్రధానిగా షేక్ హసీనా రాజీనామా చేయాల్సిన పరిస్థితి వచ్చింది.
బ్రిటన్‌లో ఆశ్రయం పొందే వరకు షేక్ హసీనా భారత్‌లోనే ఉంటుంది. సోమవారం ప్రభుత్వం పడిపోయిన తర్వాత భారత ప్రభుత్వం తాత్కాలిక ఇమ్మిగ్రేషన్ అనుమతిని మంజూరు చేసింది.