CBSE Class 10: ముగిసిన సీబీఎస్ఈ క్లాస్ 10 పరీక్షలు; సీబీఎస్ఈ నుంచి కీలక అప్ డేట్
CBSE Class 10 exam update: సీబీఎస్ఈ 10వ తరగతి పరీక్షలు ముగిశాయి. గణితం పరీక్షతో సీబీఎస్ఈ 10వ తరగతి పరీక్షలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సీబీఎస్ఈ కీలక ప్రకటన చేసింది.
CBSE Class 10 exam update: సీబీఎస్ఈ (Central Board of Secondary Education CBSE) 10వ తరగతి పరీక్షలు ముగిశాయి. గణితం పరీక్షతో సీబీఎస్ఈ 10వ తరగతి పరీక్షలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సీబీఎస్ఈ కీలక ప్రకటన చేసింది.
CBSE Class 10 exam update: 21 లక్షల మంది
సీబీఎస్ఈ (CBSE) 10వ తరగతి పరీక్షలను దేశవ్యాప్తంగా 21 లక్షలకు పైగా విద్యార్థులు రాశారు. ఈ పరీక్షలు జరుగుతున్న సమయంలో పలు సందర్బాల్లో పరీక్ష పత్రాలు లీక్ అయ్యాయన్న వార్తలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. పలు సందర్భాల్లో సీబీఎస్ఈ (CBSE) సైతం ఇలాంటి పేపర్ లీక్ పుకార్లను నమ్మవద్దని విద్యార్థులను, వారి తల్లిదండ్రులను కోరింది. విజయవంతంగా పరీక్షల నిర్వహణ పూర్తయిన అనంతరం, పేపర్ లీకేజీ వార్తలపై తాజాగా సీబీఎస్ఈ (CBSE) మరోసారి స్పందించింది.
CBSE Class 10 exam update: బాధ్యులపై చర్యలు..
విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతూ, పరీక్ష పేపర్ల లీకేజీ పుకార్లను సోషల్ మీడియాలో ప్రారంభించిన వారిపై, ఆ పుకార్లను వైరల్ చేసిన వారిపై చర్యలు తీసుకోనున్నామని సీబీఎస్ఈ (CBSE) ప్రకటించింది. అలాంటి సంఘ వ్యతిరేక శక్తులపై కఠిన చర్యలుంటాయని తెలిపింది. నకిలీ వార్తలను, సంబంధిత నకిలీ వీడియో లింక్ లను వైరల్ చేస్తూ, విద్యార్థులను ప్రలోభాలకు గురిచేసే వారిపై, డబ్బులు తీసుకుని నకిలీ ప్రశ్నాపత్రాలను అంటగట్టే వారిపై చట్టపరమైన చర్యలుంటాయని తెలిపింది. ఈ మేరకు ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ కు ఫిర్యాదు చేశామని వెల్లడించింది. నిందితులపై వారు ఐపీసీ (IPC), ఐటీ (IT) చట్టాల్లోని సంబంధిత సెక్షన్ల కింద కఠిన చర్యలు తీసుకోనున్నారని వివరించింది. ఇప్పటికే విద్యార్థులకు తప్పుడు సమాచారమిస్తున్న వందలాది యూట్యూబ్ చానెల్స్ ను తొలగించారని తెలిపింది.