Plane crash : తీవ్ర విషాదం- కుప్పకూలిన విమానం.. 62 మంది దుర్మరణం!
Brazil plane crash today : బ్రెజిల్లో ఓ విమానం కూలిపోయింది. ఈ ఘటనలో విమానంలోని 62 మంది మరణించారు. ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియరాలేదు.
బ్రెజిల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఓ ప్రాంతీయ టర్బోప్రాప్ విమానం శుక్రవారం సావో పాలో రాష్ట్రంలోని విన్హెడో నగరంలో కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో విమానంలోని మొత్తం 62 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు.
వోపాస్ లిన్హాస్ ఏరియాస్ సంస్థ నడుపుతున్న ఏటీఆర్-72 విమానం పరానా రాష్ట్రంలోని కాస్కావెల్ నుంచి సావో పాలోలోని గ్వారుల్హోస్కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు స్థానిక వార్తా సంస్థ జీ1 తెలిపింది. సావో పాలోకు వాయువ్యంగా 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న విన్హెడో అనే పట్టణంలో బ్రెజిల్ విమానం కుప్పకూలింది.
దట్టమైన అటవీ ప్రాంతంలో విమానం కూలిన క్షణం, ఆ తర్వాత ప్రభావిత ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున దట్టమైన పొగలు ఎగసిపడటం వంటి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
బ్రెజిల్ విమాన ప్రమాదంలో ఎవరూ ప్రాణాలతో బయటపడలేదని విన్హెడో సమీపంలోని వాలిన్హోస్ అధికారులు నివేదించారు. సమీపంలోని కండోమినియం కాంప్లెక్స్‌లోని ఒక ఇల్లు ధ్వంసమైందని, అయితే నివాసితులు ఎవరూ గాయపడలేదని వివరించారు.
స్థానిక టీవీ స్టేషన్ గ్లోబోన్యూస్లో ప్రసారమైన ఫుటేజీలో బ్రెజిల్ విమానం ప్రమాదం దృశ్యాలు కనిపించాయి. విమానం కూలిపోయే ముందు కిందికి దూసుకెళ్లినట్లు వీడియోలో కనిపించింది.
బ్రెజిల్ విమాన ప్రమాదం జరిగిన తర్వాత అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లూలా డా సిల్వా మాట్లాడుతూ.. "నేను బాధాకరమైన వార్తను చెప్పాల్సి వస్తోంది," అని అన్నారు.
58 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బందితో సావోపాలోలోని విన్హెడో నగరంలో ఓ విమానం కూలిపోయిందని, అందరూ చనిపోయారని అధ్యక్షుడు అన్నారు.
ప్రమాద బాధితులకు ఒక క్షణం మౌనం పాటించాలని కోరారు.
పీఎస్-వీపీబీగా నమోదైన ఈ విమానం ఎందుకు కూలిపోయిందనే దానిపై మరిన్ని వివరాలను విమానయాన సంస్థ ఇవ్వలేదు.
బ్రెజిల్ విమాన ప్రమాదం జరిగిన కొద్ది సేపటికే సావో పాలో రాష్ట్ర అగ్నిమాపక దళం ఏడు బృందాలను సంఘటనా స్థలానికి పంపింది. "విమాన ప్రమాదం నేపథ్యంలో 7 బృందాలు ఘటనాస్థలానికి వెళ్లాయి. ఇప్పటివరకు ఈ సమాచారం మాత్రమే ఉంది," అని సావో పాలో అగ్నిమాపక విభాగం ఎక్స్‌లో రాసింది.
విమానం శిథితాలు, దట్టమైన పొగలు వెలువడటంతో ప్రమాదం జరిగిన ప్రాంతం మొత్తం మంటల్లో చిక్కుకున్నట్లు సమాచారం.
ఈ విమానాన్ని ఏటీఆర్ 72-500 టర్బోప్రాప్ గా ఫ్లైట్ రాడార్ 24 గుర్తించింది. ఈ విమానాన్ని తయారు చేసే ఏటీఆర్ సంస్థ ఎయిర్ బస్, ఇటాలియన్ ఏరోస్పేస్ గ్రూప్ లియోనార్డో సహ యాజమాన్యంలో ఉంది.
సంబంధిత కథనం