Modi ka parivar : నిన్న చౌకీదార్.. నేడు ‘మోదీ కా పరివార్’- బీజేపీకి మంచి మంచి ఐడియాలు ఇస్తున్న విపక్షాలు!
Modi ka parivar latest news : విపక్షాలు.. బీజేపీకి మంచి మంచి ఐడియాలు ఇస్తున్నాయి! తాజాగా.. లాలూ ప్రసాద్ యాదవ్ చేసిన కామెంట్స్‌తో ‘మోదీ కా పరివార్’ క్యాంపైన్ని ప్రారంభించింది బీజేపీ. అసలేం జరిగిందంటే..
BJP new campaign : విపక్షాల విమర్శలను, అస్త్రాలను, ఆరోపణలను తిప్పికొట్టడంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిట్ట! ఈ విషయాన్ని అందరు అంగీకరించాల్సిందే. విపక్షాలు చేసే ఆరోపణలు.. ఒక్కోసారి బీజేపీకే కలిసి వస్తాయి! గతంలో అనేకమార్లు ఇది రుజువైంది కూడా. కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ చేసిన 'చౌకీదార్ చోర్ హే' కామెంట్స్‌ని.. తమకు అనుకూలంగా మర్చుకుని, 2019లో పెద్ద ఎత్తున క్యాంపైనింగ్ చేసింది కమలదళం. ఇక 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు.. ఇలాంటిదే మరొకటి జరుగుతోంది! ప్రధాని మోదీపై ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను .. బీజేపీ, తమకు అనుకూలంగా మార్చేసుకుంది!
మోదీ కా పరివార్..
'ప్రధాని మోదీకి అసలు సొంతంగా కుటుంబమే లేదు,' అని వ్యాఖ్యానించారు లాలూ ప్రసాద్ యాదవ్. "ఈ మధ్య.. ఆయన (మోదీ) వారసత్వ రాజకీయాల గురించి మాట్లాడుతున్నారు. మీకు (మోదీ) కుటుంబమే లేదు. మీరు హిందువు కాదు. తల్లి మరణిస్తే, హిందూ మతం ప్రకారం.. కొడుకులు గడ్డం, జుట్టు కత్తిరిస్తారు. మీరు ఎందుకు ఆ పని చేయలేదు? సమాజంలో మీరు విద్వేషాన్ని తీసుకొస్తున్నారు," అని తీవ్ర ఆరోపణలు చేశారు లాలూ.
ఈ మాటలు వివాదాస్పదమయ్యాయి. బీజేపీ నేతలు.. లాలూపై మండిపడ్డారు. కాగా.. తెలంగాణ అదిలాబాద్‌లో సోమవారం జరిగిన ఓ సభలో పాల్గొన్న ప్రధాని మోదీ.. ఈ విషయాన్ని ప్రస్తావించారు. ప్రజలే తన కుటుంబం అని అన్నారు.
Modi ka parivar PM Modi : "నా జీవితం.. ఒక తెరిచిన పుస్తకం. 140 కోట్ల మంది ప్రజలు నా కుటుంబసభ్యులు. ఈరోజు.. కోట్లాది మంది కూతుళ్లు, తల్లులు, సోదరీమణులు.. మోదీ కుటుంబసభ్యులు. దేశంలోని ప్రతి పేదవాడు.. మోదీ కుటుంబంలో సభ్యుడు. ఎవరూ లేని వారికి.. మోదీ ఉన్నాడు. వారందరికి మోదీ ఉంటాడు," అని అన్నారు.
"నేను బతికి ఉన్నానంటే.. అది ప్రజల కోసమే. అందుకే.. కోట్లాది మంది భారతీయులు.. నన్ను వారి కుటుంబంలో ఒక సభ్యుడిగా భావిస్తారు. ఇండియా కూటమి నేతలు అవినీతి, నెపోటిజంలో కూరుకుపోయారు. అందుకే భయపడుతున్నారు. వారసత్వ రాజకీయాల గురించి నేను ఒక్క మాట మాట్లాడినా.. నాకు అసలు కుటుంబమే లేదంటారు. కానీ ప్రజలే నా కుటుంబం," అని మోదీ చెప్పుకొచ్చారు.
2024 Lok Sabha elections : మోదీ ప్రసంగం తర్వాత.. బీజేపీ తన పనిని మొదలుపెట్టింది! అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, జేపీ నడ్డాతో సహా అనేక మంది బీజేపీ నేతలు.. 'మోదీ కా పరివార్' క్యాంపైన్ని మొదలుపెట్టేశారు. తమ సోషల్ మీడియా అకౌంట్స్‌కి మోదీ కా పరివార్ అని చేర్చారు.
2019… 2014లోనూ..
ఈ కొత్త క్యాంపైన్.. 2019లో జరిగిన 'మై బీ చౌకీదార్' ప్రచారాన్ని గుర్తు చేస్తోంది. నాడు.. రాహుల్ గాంధీ.. మోదీని 'చౌకీ దార్ చోర్ హే' అన్నారు. రఫేల్ ఫైటర్ జెట్స్ ఒప్పందంలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ.. ఆ నినాదం చేశారు. కానీ.. అది బీజేపీకే ఉపయోగపడిందని చెప్పుకోవాలి! వెంటనే.. 'చౌకీదార్' క్యాంపైన్ని మొదలుపెట్టిన కమలదళం.. మోదీని, మోదీ పాలనలో తీసుకొచ్చిన అభివృద్ధిని ప్రజల్లోకి మరింత తీసుకెళ్లింది.
2019కి ముందు కూడా ఇలాంటి సంఘటన ఒకటి జరిగింది. 2014 లోక్‌సభ ఎన్నికలకు ముందు.. కాంగ్రెస్ నేత మణి శంకర్ అయ్యర్.. మోదీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మోదీని 'చాయ్‌వాలా' (టీ సెల్లర్) అని అన్నారు. ఆ మాటలపై బీజేపీ.. మంచి క్యాంపైన్ చేసుకుంది. 'చాయ్ పే చర్చా' అంటూ కొత్త నినాదాన్ని తీసుకొచ్చి ప్రజల్లోకి వెళ్లింది!
ఇలా.. బీజేపీకి విపక్షాలే మంచి మంచి ఐడియాలు ఇస్తున్నట్టు కనిపిస్తోంది!
సంబంధిత కథనం