Stampede at temple : ఆలయంలో తొక్కిసలాట- ఏడుగురు దుర్మరణం!-bihar stampede at jehanabad temple claims 7 lives 9 injured ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Stampede At Temple : ఆలయంలో తొక్కిసలాట- ఏడుగురు దుర్మరణం!

Stampede at temple : ఆలయంలో తొక్కిసలాట- ఏడుగురు దుర్మరణం!

Sharath Chitturi HT Telugu
Aug 12, 2024 07:47 AM IST

Bihar Stampede : బిహార్​లోని ఓ ఆలయం వద్ద జరిగిన తొక్కిసలాటలో ఏడుగురు మరణించారు. మరో 9మంది గాయపడ్డారు. శ్రావణ సోమవారం కారణంగా ఆలయం వద్ద రద్దీ పెరిగి, తొక్కిసలాట జరిగింది.

ఆలయంలో తొక్కిసలాట..
ఆలయంలో తొక్కిసలాట..

బిహార్​లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. జెహనాబాద్ జిల్లా మఖ్దూంపూర్​లోని బాబా సిద్ధనాథ్ ఆలయం వద్ద సోమవారం తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందారు. మరో తొమ్మిది మంది గాయపడ్డారు.

ఈ ఘటన మఖ్దూంపూర్ మండలం వనవర్ కొండ వద్ద చోటుచేసుకుంది. పవిత్ర శ్రావణ మాసంలోని సోమవారం కావడంతో ఆలయంలోకి భారీగా రద్దీ ఏర్పడింది. ఫలితంగా తొక్కిసలాట జరిగింది. ఆలయం వద్ద తొక్కిసలాట ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే స్పందించిన పోలీసులు, ఘటనాస్థలానికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను వెలికితీశారు. క్షతగాత్రులను మఖ్దుంపూర్​, జెహనాదాబ్​ ఆసుపత్రులకు తరలించారు.

ఆలయం వద్ద తొక్కిసలాట జరిగిందని ధ్రువీకరించిన జెహనాబాద్ జిల్లా మేజిస్ట్రేట్ అలంకృత పాండే, ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని  తెలిపారు.

"జెహనాబాద్ జిల్లా మఖ్దూంపూర్ లోని బాబా సిద్ధనాథ్ ఆలయం వద్ద జరిగిన తొక్కిసలాటలో ఏడుగురు మృతి చెందగా, తొమ్మిది మంది గాయపడ్డారు. మేము ప్రతిదాన్ని పర్యవేక్షిస్తున్నాము. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉంది," అని ఆమె ఏఎన్ఐతో అన్నారు.

ఘటనా స్థలాన్ని డీఎం, ఎస్పీ సందర్శించి పరిస్థితిని సమీక్షిస్తున్నారని జెహనాబాద్ ఎస్​హెచ్ఓ దివాకర్ కుమార్ విశ్వకర్మ తెలిపారు. మొత్తం ఏడుగురు మృతి చెందగా... కుటుంబ సభ్యులను (మృతులు, క్షతగాత్రులను) కలుసుకుని విచారిస్తున్నట్టు, చనిపోయిన వారి ఐడెంటిటీని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని, ఆ తర్వాత మృతదేహాలను పోస్టుమార్టంకు పంపుతామని చెప్పారు.

ఉత్తరప్రదేశ్​లోని హత్రాస్​లో జరిగిన మత సమ్మేళనంలో 120 మందికి పైగా మరణించిన కొన్ని వారాల తర్వాత ఈ ఘటన జరగడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. బాబా నారాయణ్ హరి/ 'భోలే బాబా'కు అంకితం చేసిన సభలో జరిగిన తొక్కిసలాట వార్తల్లో నిలిచింది. నిర్వాహకులు 80 వేల మంది సభకు అనుమతి పొందినప్పటికీ ఎక్కువ మంది భక్తులు రావడంతో తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే.

సిద్ధనాథ్ ఆలయం ఎక్కడ ఉంది?

బాబా సిద్ధనాథ్ ఆలయాన్ని శివాలయం అని కూడా పిలుస్తారు. మొదట సిద్ధేశ్వర్ నాథ్ ఆలయం అని పిలిచేవారు, ఇది బరాబర్ హిల్స్ శ్రేణిలోని ఎత్తైన శిఖరాలలో ఒకటిగా ఉంది. క్రీస్తుశకం 7వ శతాబ్దంలో గుప్తుల కాలంలో ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయ నిర్మాణానికి రాజ్ గిర్​కు చెందిన పురాణ రాజు జరాసంధుడి మామ బనా రాజా కారణమని స్థానిక పురాణాలు చెబుతున్నాయి.

జిల్లాను బరాబర్ గుహలు అని కూడా పిలుస్తారు. బిహార్ ప్రభుత్వ వెబ్సైట్ ప్రకారం, జెహనాబాద్​కు దక్షిణంగా 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న మఖ్దుంపూర్ సమీపంలోని కొండ ప్రాంతంలో బరాబర్ గుహలు ఉన్నాయి. ఈ పురాతన రాతితో కట్టిన బౌద్ధ గదులు క్రీ.శ 3 వ శతాబ్దానికి చెందినవని, ఇవి అజివిక శాఖ మూలస్థలంగా ప్రసిద్ధి చెందాయని తెలిపింది.

సంబంధిత కథనం