Bihar politics news : జేడీయూ- బీజేపీ బంధం.. ఇక ముగిసినట్టే!
Bihar politics news today : జేడీయూ- బీజేపీ వ్యవహారం ముగింపు దశకు చేరుకుంది! గవర్నర్‌ను నితీశ్ కుమార్ కలవనున్నారు.
Bihar politics news today : బిహార్ రాజకీయాల్లో కీలక మలుపునకు రంగం సిద్ధమవుతోంది! జేడీయూ అధినేత, సీఎం నితీశ్ కుమార్.. బీజేపీతో బంధాన్ని తెంచుకున్నట్టే కనిపిస్తోంది. మరికొన్ని గంటల్లో ఈ వ్యవహారంపై అధికారిక ప్రకటన వెలువడనుంది. బిహార్ గవర్నర్‌ను కలిసేందుకు నితీశ్ కుమార్ అపాయింట్మెంట్ కోరడంతో.. ఇన్ని రోజులుగా నెలకొన్న ఉత్కంఠకు దాదాపు తెరపడినట్టు అయ్యింది.
బీజేపీకి జేడీయూ గుడ్ బై..
గత కొన్ని నెలలుగా బీజేపీపై నితీశ్ కుమార్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తనపై కుట్ర పన్నేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆయన భావిస్తున్నారు. మూడు, నాలుగు రోజుల్లో ఈ వ్యవహారం తారస్థాయికి చేరింది.
తాజా పరిణామాలపై చర్చించేందుకు జేడీయూ ఎమ్మెల్యేలు మంగళవారం భేటీ అయ్యారు. జనగణనపై భేటీ జరుగుతోందని జేడీయూ చెప్పినా.. బీజేపీపై దోస్తీ గురించే సమావేశమయ్యారని సమాచారం.
BJP JDU rift : బీజేపీతో తెగదెంపులు చేసుకోవాలని ఎమ్మెల్యేలు కూడా భావిస్తున్నట్టు సమావేశంలో స్పష్టమైంది. ఆ వెంటనే.. గవర్నర్‌తో సమావేశమయ్యేందుకు నితీశ్ కుమార్.. అపాయింట్మెంట్ కోరారు.
ఎమ్మెల్యేల కొనుగోళ్లు షురూ..!
తమతో బంధాన్ని జేడీయూ తెంచుకుంటుందని బీజేపీకి ఈపాటికే అర్థమైపోయుంటుంది. కాగా.. తమ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు.. బీజేపీ ప్రయత్నిస్తోంది జేడీయూ మండిపడింది. నితీశ్ కుమార్‌ను మోసం చేసి తమవైపు వచ్చిన ఎమ్మెల్యేలకు.. ఒక్కొక్కరికి రూ. 6కోట్లు ఇస్తామి బీజేపీ ఆఫర్ ఇచ్చినట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఇందుకు సంబంధించిన ఆడియో ఫైల్స్‌ను త్వరలో విడుదల చేస్తామని జేడీయూ వెల్లడించింది.
తాజా పరిణామాలపై బీజేపీ కూడా అనాధికారికంగా స్పందించింది. 'జేడీయూతో బంధం కొనసాగుతుందని అనుకోవడం.. ఆసుపత్రిలో డెత్బెడ్ మీద ఉన్న రోగి బతుకుతాడని కుటుంబసభ్యులు భావించడం ఒకటే' అని కొందరు బీజేపీ నేతలు అభిప్రాయపడటం గమనార్హం.
Nitish kumar : మరోవైపు.. రాష్ట్రంలో తాజా పరిస్థితులపై విపక్షాలు సైతం భేటీ అయ్యాయి. బిహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఇంట్లో.. కాంగ్రెస్, వామపక్షాల నేతలు సమావేశమయ్యారు. బీజేపీని విడిచి నితీశ్ కుమార్ వస్తే.. మద్దతివ్వాలా? వద్దా? అన్న విషయంపై చర్చలు జరిగాయి.
అయితే.. బీజేపీతో జేడీయూ తెగదెంపులు చేసుకున్నా.. రాష్ట్రంలో ఎన్నికలు జరగకపోవచ్చు. ఎన్నికలకు సిద్ధంగా లేమని జేడీయూ ఎమ్మెల్యేలు.. నితీశ్ కుమార్‌కు చెప్పారని సమాచారం. అందువల్ల.. నితీశ్ వెళ్లి విపక్షాలను కలవాల్సిందే. నితీశ్ వస్తే ఘన స్వాగతం పలుకుతామని ఆర్జేడీ ఇప్పటికే ప్రకటించింది.
బీహార్‌లో ఎవరి బలం ఎంత?
బీహార్ అసెంబ్లీలో మొత్తం స్థానాల సంఖ్య 243. ఇక్కడ మెజారిటీని నిరూపించుకోవడానికి ఒక పార్టీకి 122 సీట్లు అవసరం. ప్రస్తుత గణాంకాలను పరిశీలిస్తే బీహార్‌లో ఆర్జేడీ ఏకైక అతిపెద్ద పార్టీగా ఉంది. అసెంబ్లీలో 79 మంది సభ్యులు ఉన్నారు. అదే సమయంలో బీజేపీకి 77, జేడీయూకు 45, కాంగ్రెస్‌కు 19 మంది సభ్యుల బలం ఉంది. కమ్యూనిస్టు పార్టీకి 12, ఏఐఎంఐఎంకు 01, హిందుస్తానీ అవామ్ మోర్చాకు 04 మంది సభ్యులున్నారు. వీరితో పాటు ఇతర ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు.
జేడీయూకు ప్రస్తుతం 45 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి 77 మంది ఎమ్మెల్యేలు అవసరం. గతంలో ఆర్జేడీ, జేడీయూల మధ్య సాన్నిహిత్యం కూడా ఉంది. ఇలాంటి పరిస్థితిలో ఇద్దరూ కలిస్తే 124 మంది సభ్యులు ఉంటారు.
దీంతోపాటు కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు కూడా ఈ కూటమిలో చేరే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదే జరిగితే కాంగ్రెస్ నుంచి 19 మంది, కమ్యూనిస్టు పార్టీ నుంచి మరో 12 మందితో సహా కూటమికి మెజారిటీకి మించి 155 మంది ఎమ్మెల్యేలు ఉంటారు.
సంబంధిత కథనం