Bihar politics: బీహార్‌లో కొత్త కూటమి.. ఆర్జేడీ, కాంగ్రెస్‌తో నితీష్ జట్టు?
Bihar politics: బీజేపీతో దూరం పెరుగుతుండడంతో ఆర్జేడీ, కాంగ్రెస్‌లతో జట్టు కట్టి నితీష్ కుమార్ అధికారాన్ని కాపాడుకునే ప్రయత్నాల్లో పడ్డట్టు సమాచారం.
బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీతో ఫోన్‌లో మాట్లాడినట్లు సమాచారం. ఆర్జేడీ, కాంగ్రెస్, జేడీయూలు కలిసి కొత్త సమీకరణకు తెరలేపుతున్నట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో తాజా పరిణామం ఈ వార్తలకు బలం చేకూర్చినట్టయింది.
జేడీయూ మాజీ జాతీయ అధ్యక్షుడు ఆర్సీపీ సింగ్ రాజీనామా చేసినప్పటి నుండి బీజేపీ, జేడీయూ మధ్య పరస్పరం విమర్శలు ఎక్కువయ్యాయి. ఈ మాటల యుద్ధం అంతకుముందు నుంచే సాగుతోంది.
నితీష్ కుమార్ ప్రతిపక్ష పార్టీలతో కలిసి కుల ఆధారిత జనాభా గణన జరపాలని డిమాండ్ చేసినప్పటి నుంచే బీజేపీతో దూరం పెరుగుతూ వస్తోంది. ప్రభుత్వాన్ని నడపడంలో స్వేచ్ఛ లభించకపోవడమే కాకుండా, ఆర్సీపీ సింగ్ వ్యవహారంలో నితీష్ కుమార్ బీజేపీపై అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం.
గత కొన్ని నెలలుగా నితీష్ పలు ముఖ్యమైన సమావేశాలకు దూరంగా ఉన్నారు. కొన్ని నెలల క్రితం కరోనాపై ప్రధాని నిర్వహించిన సమావేశానికి నితీశ్ దూరంగా ఉన్నారు. అంతకుముందు హోంమంత్రి అమిత్ షా ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రుల సమావేశానికి దూరంగా ఉన్నారు. తాజాగా ఆయన ఇప్పుడు నీతి ఆయోగ్ సమావేశానికి దూరంగా ఉన్నారు.
ఆర్సీపీ సింగ్ ఉదంతం బీజేపీ, జేడీయూ మధ్య దూరాన్ని మరింత పెంచింది. అవినీతి కేసులో జేడీయూ ఆర్సీపీ సింగ్‌కు నోటీసు పంపింది. ఆ తర్వాత ఆయన జేడీయూకు రాజీనామా చేశారు. ఆర్సీపీ సింగ్ పేరిట జేడీయూలో తిరుగుబాటు చేయాలని బీజేపీ భావించిందని జేడీయూ ఆరోపించింది. ఇది రెండు పార్టీల మధ్య దూరాన్ని పెంచుతూనే ఉంది.
బీహార్‌లో ఎవరి బలం ఎంత?
బీహార్ అసెంబ్లీలో మొత్తం స్థానాల సంఖ్య 243. ఇక్కడ మెజారిటీని నిరూపించుకోవడానికి ఒక పార్టీకి 122 సీట్లు అవసరం. ప్రస్తుత గణాంకాలను పరిశీలిస్తే బీహార్‌లో ఆర్జేడీ ఏకైక అతిపెద్ద పార్టీగా ఉంది. అసెంబ్లీలో 79 మంది సభ్యులు ఉన్నారు. అదే సమయంలో బీజేపీకి 77, జేడీయూకు 45, కాంగ్రెస్‌కు 19 మంది సభ్యుల బలం ఉంది. కమ్యూనిస్టు పార్టీకి 12, ఏఐఎంఐఎంకు 01, హిందుస్తానీ అవామ్ మోర్చాకు 04 మంది సభ్యులున్నారు. వీరితో పాటు ఇతర ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు.
బీహార్‌లో కొత్త కూటమి ఏర్పడనుందా?
జేడీయూకు ప్రస్తుతం 45 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి 77 మంది ఎమ్మెల్యేలు అవసరం. గతంలో ఆర్జేడీ, జేడీయూల మధ్య సాన్నిహిత్యం కూడా ఉంది. ఇలాంటి పరిస్థితిలో ఇద్దరూ కలిస్తే 124 మంది సభ్యులు ఉంటారు.
దీంతోపాటు కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు కూడా ఈ కూటమిలో చేరే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదే జరిగితే కాంగ్రెస్ నుంచి 19 మంది, కమ్యూనిస్టు పార్టీ నుంచి మరో 12 మందితో సహా కూటమికి మెజారిటీకి మించి 155 మంది ఎమ్మెల్యేలు ఉంటారు.
టాపిక్