Metro woes: మెట్రోలో మరో దారుణం; ఇంకా మారరా? అంటున్న నెటిజన్లు
సమాజంలో పేద, ధనిక తారతమ్యాలు, దుస్తుల ఆధారంగా వివక్ష చూపడం ఇంకా కొనసాగడంపై నెటిజన్లు మండిపడ్తున్నారు. బెంగళూరు మెట్రోలో ఇటీవల చోటు చేసుకున్న ఒక ఘటనపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
Discriminationa in Bengauru Metro woes:బెంగళూరు మెట్రోలో ఓ వ్యక్తి చినిగిపోయిన చొక్కాతో మెట్రో రైలు ఎక్కడానికి ప్రయత్నించగా, అతడిని మెట్రో లో ప్రయాణించకుండా అడ్డుకున్నారని సహ ప్రయాణికుడైన ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పేర్కొన్నాడు. ఆ కార్మికుడు వేసుకున్న షర్ట్ కు పైన రెండు బటన్స్ లేవన్న కారణంతో అతడిని లోపలికి రానివ్వలేదని తెలిపాడు. మన మెట్రో ఎందుకు ఇలా తయారైంది? అని ప్రశ్నించాడు. ఈ పోస్ట్ కు బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (BMRCL) అధికారిక ఖాతాను, బెంగళూరు సౌత్ ఎంపీ తేజస్వీ సూర్య (MP Tejasvi Surya)ను ట్యాగ్ చేశాడు.
ఎక్స్ లో పోస్ట్
బెంగళూరు మెట్రో (Namma Metro)లోని గ్రీన్ లైన్ లో ఉన్న దొడ్డకళ్లసంద్ర మెట్రో స్టేషన్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. చొక్కా చినిగిపోయి ఉండడం, షర్ట్ పైన రెండు బటన్స్ లేకపోవడం వంటి కారణాలతో ఆ కార్మికుడిని మెట్రో రైలు ఎక్కనివ్వలేదని, ఈ ఘటన తన కళ్ల ముందే జరిగిందని ఆ ప్రయాణికుడు తన ఎక్స్ అకౌంట్ లో పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్ లో కొద్ది సేపట్లోనే వేలాది మంది చూశారు. చాలామంది నెటిజన్లు తమ స్పందనను తెలియజేశారు. ఇంకా సమాజంలో పేదలపై వివక్ష కొనసాగుతోందని, ఇకనైనా మారరా? అని ఒక నెటిజన్ ప్రశ్నించాడు. ఈ కథనం నిజమేనా? అని మరో నెటిజన్ స్పందించాడు.
మెట్రో అధికారుల స్పందన
అయితే, ఆ కార్మికుడు మద్యం సేవించి ఉన్నాడని, అతడి వద్ద నుంచి మద్యం వాసన భరించలేనంతగా వచ్చిందని, అందువల్లనే అతడిని మెట్రో లోపలికి అనుమతించలేదని, ఈ ఘటన సమయంలో అక్కడే ఉన్న మరో ఎక్స్ యూజర్ పోస్ట్ చేశాడు. ఈ కథనంపై మెట్రో అధికారులు కూడా స్పందించారు. ఆ కార్మికుడు మద్యం తాగి ఉండడంతో, అధికారులు అతడిని పక్కకు తీసుకువెళ్లి ప్రశ్నించారని వెల్లడించారు. అతడు మద్యం తీసుకున్నది నిజమే కానీ, అతడు మద్యం తాగింది అంతకుముందు రోజు అని తేలడంతో అతడిని తదుపరి మెట్రో రైలులో పంపించారని తెలిపింది. బెంగళూరు మెట్రో (Bengaluru Metro)లో ధనిక, పేద, స్త్రీ, పురుష.. తదితర తేడాలు చూడబోమని స్పష్టం చేశారు.