Bengaluru Metro Pillar collapse: బెంగళూరులో నిర్మాణంలో ఓ మెట్రో పిల్లర్ కూలి ఓ మహిళ, రెండున్నర సంవత్సరాల వయసు ఉన్న ఆమె కుమారుడు మృతి చెందిన ఘటన.. ఆ కుటుంబానికి అంతులేని విషాదాన్ని మిగిల్చింది. తన కళ్ల ముందరే భార్య, కుమారుడు మృతి చెందారంటూ ఆ మహిళ భర్త ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనలో మృతురాలి భర్త లోహిత్, కూతురు గాయాలతో బయటపడ్డారు. ఈ ఘటన వివరాలను లోహిత్ వెల్లడించారు. సర్వం కోల్పోయామంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ ప్రమాదాన్ని గురించి మృతురాలి భర్త లోహిత్ వివరించారు. “మేం ద్విచక్ర వాహనంపై వెళుతున్నాం. వారిని ఓ చోట డ్రాప్ చేసి.. నేను మళ్లీ తిరిగిరావాల్సింది. అయితే అంతలోనే సెకన్ల వ్యవధిలో ఈ ఘటన జరిగింది. నేను తిరిగి చూసేసరికి, నా భార్య, కుమారుడు పడిపోయి ఉన్నారు. నా చేతుల్లో ఏమీ లేదు. ఏమీ చేయలేకపోయా” అని లోహిత్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆయన కోరారు.
“నేను ప్రభుత్వానికి ఏం చెప్పగలను. సర్వస్వం కోల్పోయా. భవిష్యత్తులో ఇలాంటి ఘటన మళ్లీ జరగకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. పటిష్ఠమైన ముందుగా జాగ్రత్తలు తీసుకోవాలి. అలా అయినా మరొకరికి ఇలాంటి పరిస్థితి ఎదురుకాదు” అని లోహిత్ చెప్పారు.
నిర్మాణ పనుల కాంట్రాక్టును తక్షణమే రద్దు చేయాలని మృతురాలి తండ్రి మదన్ కుమార్ డిమాండ్ చేశారు. అంత వరకు తన కూతురి మృత దేహాన్ని తీసుకోబోమని ఆవేదన వ్యక్తం చేశారు. “కాంట్రాక్టర్ లైసెన్స్ రద్దు చేసే వరకు, మేం మృతదేహాన్ని తీసుకోం. అంత పొడవైన పిల్లర్లను నిర్మించేందుకు ఎవరు అనుమతులు ఇచ్చారు? ఈ టెండర్ రద్దు కావాల్సిందే. పనులు ఆగాల్సిందే. కోర్టులో ఏం చేయాలో ఆలోచిస్తా” అని మదన్ కుమార్ చెప్పారు.
పిల్లలను స్కూల్‍లో విడిచిపెట్టేందుకు వెళ్లిన సందర్భంలో ఈ ప్రమాదం జరిగిందని మృతురాలి అత్త నిర్మల చెప్పారు. తన కోడలు 10 రోజల క్రితమే దేవనగెరె నుంచి బెంగళూరు వచ్చిందని, ఇంతలోనే ఇలా అయిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
బెంగళూరులోని నగవర (Nagavara) ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఓ మెట్రో పిల్లర్ మంగళవారం ఓ బైక్‍పై కూలిపోయింది. ఈ ఘటనలో ఓ మహిళ, ఆమె కుమారుడు మృతి చెందారు. బైక్ నడుపుతున్న ఆ మహిళ భర్తకు, కూతురికి గాయాలయ్యాయి. ప్రమాదానికి సంబంధించి సీసీ టీవీ ఫుటేజీ కూడా బయటికి వచ్చింది.
సంబంధిత కథనం