Bengaluru rain news : భారీ వర్షాలకు అల్లకల్లోలంగా బెంగళూరు- జనజీవనం అస్తవ్యస్తం!
Bengaluru rain update : భారీ వర్షాలు బెంగళూరులో విధ్వంసాన్ని సృష్టించాయి. అనేక రోడ్లు జలమయం అయ్యాయి. పలు విమానాలు ఆలస్యంగా నడిచాయి. మరోవైపు వర్షాల కారణంగా ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది.
సోమవారం రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షానికి కర్ణాటక రాజధాని బెంగళూరు అస్తవ్యస్తంగా మారింది. దాదాపు అన్ని ప్రాంతాల్లోని రోడ్లు జలమయం అయ్యాయి. మరీ ముఖ్యంగా బెంగళూరు ఎయిర్‌పోర్టు రోడ్డు దగ్గర పరిస్థితులు మరింత ఆందోళనకరంగా మారాయి. అంతేకాదు భారీ వర్షాల ప్రభావం విమాన సేవలపైనా పడింది. బెంగళూరు విమానాశ్రయంలో గందరగోళం నెలకొనడంతో 20 విమానాలు ఆలస్యంగా నడిచాయి.
బెంగళూరులో భారీ వర్షాలకు ప్రజలు విలవిల..
నగరంలో, ముఖ్యంగా బెంగళూరు ఉత్తర ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షం కురవడంతో సోమవారం రాత్రి కర్ణాటక విమానాశ్రయానికి వెళ్లే ఇరవైకి పైగా విమానాలు ఆలస్యంగా నడిచాయి. దిల్లీ నుంచి వచ్చిన ఎయిర్ ఇండియా విమానం, నాలుగు ఇండిగో విమానాలను చెన్నైకి దారి మళ్లించాల్సి వచ్చింది. ఈ విషయాన్ని విమానాశ్రయ వర్గాలు HT.com తెలిపాయి.
అటు ఎయిర్‌పోర్టు రోడ్డులో ట్రాఫిక్ కారణంగా ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు. దాదాపు 2 గంటల పాటు ట్రాఫిక్ నిలిచిపోవడంతో చాలా మంది వర్షంలో తడిసిపోయారు.
సోమవారం రాత్రి 9 గంటల వరకు ఉత్తర శివారు దేవనహళ్లిలో ఉన్న కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాల ల్యాండింగ్‌లు సాధారణంగానే ఉన్నాయి. ఆ తర్వాతే పరిస్థితులు మారిపోయాయి. దీంతో విమానాల రాకపోకలు ఆలస్యమవుతున్నాయని, మరింత జాప్యం జరిగే అవకాశం ఉందని సమాచారం.
యలహంకతో పాటు ఉత్తర బెంగళూరులోని సహకార్ నగర్ తదితర ప్రాంతాల్లో సోమవారం రాత్రి కుండపోత వర్షం కురిసింది. నీట మునిగిన రోడ్లు, అండర్ పాస్‌ల వీడియోలు, పోస్టులతో సోషల్ మీడియా నిండిపోయింది.
మాల్ ఆఫ్ ఆసియా సమీపంలోని సహకార్ నగర్‌లోని రైల్వే అండర్ పాస్ నీట మునిగిపోయింది. ఫలితంగా పలు కార్లు సైతం మునిగాయి.
బెంగళూరులు వర్షాలు- వీడియో..
బెంగళూరులు వర్షాలకు ఒకరు మృతి..
భారీ వర్షాల మధ్య బెంగళూరులోని సర్జాపూర్ ప్రాంతంలో గుంతలను దాటుతూ 56 ఏళ్ల మహిళ ప్రాణాలు కోల్పోయింది. మల్లిక తన భర్త మునిరాజు బైక్ పై వెళ్తుండగా రోడ్డు ప్రమాదం నుంచి తప్పించుకునే క్రమంలో బండిని స్లో చేశారు. ఇంతలో ఓ మినీ ట్రక్కు వారిని ఢీకొట్టింది. ఫలితంగా ఆ మహిళ మరణించింది.
లోతట్టు ప్రాంతాలు జలమయం..
గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నగరంలో జనజీవనం అస్తవ్యస్తంగా మారడంతో పలు లోతట్టు ప్రాంతాలు, రహదారులు జలమయమయ్యాయి.
ముందుజాగ్రత్తగా సోమవారం పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలను మూసివేశారు. బెంగళూరులో వర్షాల కారణంగా పాఠశాలలు మూతపడటం వారం రోజుల్లో ఇది రెండోసారి.
నగరంలోని పలు ప్రాంతాల్లో ప్రజలు తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి వరదనీటిలో ఉన్న రోడ్ల గుండా పరుగులు తీశారు.
నగరంలో పలు చెట్లు కూలడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
బెంగళూరులో రాత్రి కురిసిన భారీ వర్షానికి పలు ప్రాంతాలు జలమయం కావడంతో వరదల్లో పడవలు సంచరిస్తూ కనిపించాయి.
చాలా ప్రాంతాలు మోకాలి లోతు నీటితో నిండిపోవడంతో స్థానిక అధికారులు వెంటనే చర్యలు చేపట్టి నష్టాన్ని అంచనా వేసి వీధులను క్లియర్ చేశారు.
ఈశాన్య బెంగళూరు ట్రాఫిక్ పోలీస్ ఏసీపీ తెలిపిన వివరాల ప్రకారం కోగిలు జంక్షన్ నుంచి ఐఏఎఫ్ వైపు వెళ్లే సర్వీస్ రోడ్డును మూసివేశారు.
బెంగళూరు వాతావరణం..
దక్షిణ మధ్య కర్ణాటక, కర్ణాటక తీర ప్రాంతం, కేరళ, తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో మంగళవారం సైతం భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఐఎండీ హెచ్చరించింది.
సంబంధిత కథనం