ఫ్లైట్ టికెట్ ఛార్జీలు ఇంకా పెరగనున్నాయా?
ఈ ఏడాది ఆరోసారి విమాన ఇంధనం ధరలు పెరిగాయి. ఫ్లైట్ టికెట్ ధరలపై ఇంధన ధరల ప్రభావం పడుతోంది.
దేశంలో విమాన ఇంధనం ధర ఈ ఏడాది ఆరోసారి బుధవారం ఢిల్లీలో 18 శాతం పెరిగి కిలోలీటర్‌కు (1000 లీటర్లకు) రూ. 1,10,666కి చేరుకుంది. ఇది కొత్త రికార్డు.
ఖరీదైన విమాన ఇంధనం కారణంగా విమానయాన సంస్థల ధరలు భారీగా పెరిగాయి . ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ ప్రయోజనాన్ని పొందేందుకు ఎయిర్‌క్రాఫ్ట్ ఫ్యూయల్ (ATF)ని జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని ఈ రంగం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోంది.
ఢిల్లీలో గత సమీక్షలో ప్రభుత్వరంగ చమురు కంపెనీలు రాజధానిలో ఏటీఎఫ్ ధరను 18.3 శాతం (కిలో లీటరుకు రూ. 17135.63) పెంచాయి. దీని ధర కిలో లీటరుకు రూ. 1,10,666.29కి చేరుకుంది. ఉక్రెయిన్ సంక్షోభం మధ్య గ్లోబల్ ఆయిల్ మార్కెట్‌లో చమురు ధరల పెరుగుదల కారణంగా చమురు కంపెనీలు ఏటీఎఫ్ ధరను పెంచవలసి వచ్చింది.
గత కొద్ది రోజులుగా అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధర బ్యారెల్‌కు 147 డాలర్లకు చేరుకోవడం గమనార్హం. అయితే ప్రస్తుతం ధరలు శాంతించాయి . బ్యారెల్‌కు $100 సమీపానికి దిగివచ్చాయి.
ప్రైవేట్ రంగ విమానయాన సంస్థ ఇండిగో హోల్‌టైమ్ డైరెక్టర్, సీఈఓ రోనోజోయ్ దత్తా ఒక ప్రకటనలో ఈ అంశంపై వివరిస్తూ ‘గత కొన్ని వారాలుగా యూరప్‌లో సంక్షోభం కారణంగా ముడి చమురు ధరలు ఏడేళ్ల గరిష్ట స్థాయికి పెరిగాయని అన్నారు. దీని వల్ల జనవరి నుంచి ATF ధరలలో 50 శాతం కంటే ఎక్కువ పెరుగుదలకు దారితీసింది. ఎయిర్‌లైన్స్ నిర్వహణ వ్యయంలో 45 శాతానికి పైగా ఏటీఎఫ్ వల్లే అవుతుంది.
ఏటీఎఫ్‌ని వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) పరిధిలోకి తీసుకురావాలని, ఇన్‌పుట్ ట్యాక్స్ ప్రయోజనాలను తెచ్చిపెడుతుందని, అందువల్ల ప్రభుత్వంతో దీనిపై చర్చలు జరుపుతున్నామని దత్తా చెప్పారు.
ఏటీఎఫ్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాల్సిన ఆవశ్యకత ప్రస్తుతానికి అత్యంత ఆవశ్యకమని తాము విశ్వసిస్తున్నామని, తద్వారా విమానయాన సంస్థల నిర్వహణ వ్యయంలో పెరుగుదల కొంతమేరకు తగ్గుతుందని అన్నారు. తద్వారా విమానయాన సంస్థలు, వినియోగదారులకు సహేతుకమైన ధరతో విమానయాన కార్యకలాపాలు ఆచరణీయంగా ఉండవచ్చని అన్నారు.
పన్నుల హేతుబద్ధీకరణ వల్ల విమానయాన రంగం వృద్ధి చెందుతుందని, ఆర్థిక వ్యవస్థపై అనుకూల ప్రభావం చూపుతుందని ఇండిగో సీఈవో దత్తా అన్నారు. ఇది వాణిజ్యం, పర్యావరణం, ఉపాధిని ప్రోత్సహిస్తుందని వివరించారు.
ఇండిగో దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న చౌక ధరల విమానయాన సంస్థ. ఇది 275కి పైగా విమానాల సముదాయాన్ని కలిగి ఉంది. దేశీయ, విదేశీ మార్గాలలో ప్రతిరోజూ 1,500 విమానాలను నడుపుతోంది.