Chhattisgarh encounter : దంతెవాడలో భారీ ఎన్​కౌంటర్​- 9మంది మావోయిస్టులు మృతి-at least 9 maoists killed in encounter in chhattisgarhs dantewada ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Chhattisgarh Encounter : దంతెవాడలో భారీ ఎన్​కౌంటర్​- 9మంది మావోయిస్టులు మృతి

Chhattisgarh encounter : దంతెవాడలో భారీ ఎన్​కౌంటర్​- 9మంది మావోయిస్టులు మృతి

Sharath Chitturi HT Telugu
Sep 03, 2024 01:44 PM IST

Chhattisgarh encounter today : ఛత్తీసగఢ్​లోని దంతెవాడలో మంగళవారం ఎన్​కౌంటర్​ జరిగింది. ఈ ఎనకౌంటర్​లో 9 మంది మావోయిస్టులు మృతి చెందారు.

ఛత్తీస్​గఢ్​లో ఎన్​కౌంటర్​
ఛత్తీస్​గఢ్​లో ఎన్​కౌంటర్​ (File Photo)

ఛత్తీస్​గఢ్​ దంతెవాడ జిల్లాలో మారోమారు కాల్పుల మోత మోగింది. జిల్లా రిజర్వ్​ గార్డ్​- సీఆర్​పీఎఫ్​ సంయుక్త బృందం- మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. దంతెవాడ ఎన్​కౌంటర్​లో 9మంది మావోయిస్టులు మరణించినట్టు తెలుస్తోంది.

ఈ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారన్న నిఘా వర్గాల సమాచారం మేరకు ఈ ఆపరేషన్ చేపట్టినట్లు అధికారులు తెలిపారు. మంగళవారం ఉదయం 10.30 గంటలకు ప్రారంభమైన ఎన్​కౌంటర్ ఇంకా కొనసాగుతోందని పోలీసులు వివరించారు.

ఇప్పటి వరకు 9 మంది మావోయిస్టులను హతమార్చామని, సెల్ఫ్ లోడింగ్ రైఫిల్, 303 రైఫిల్, 315 బోర్ రైఫిల్ సహా పెద్ద ఎత్తున ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని అధికారులు స్పష్టం చేశారు.

“ఆపరేషన్​లో పాల్గొన్న జవాన్లంతా సురక్షితంగా ఉన్నారు. గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. ఆపరేషన్ పూర్తయిన తర్వాత మరిన్ని వివరాలు వెల్లడిస్తాము,” అని పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు.

8 నెలల్లో 145మంది మావోలు హతం..!

ఛత్తీస్​గఢ్​ అడవుల్లో మావోయిస్టుల ఏరివేత గత కొంతకాలంగా సాగుతోంది. కొన్ని రోజుల క్రితం, ఆగస్ట్​ 29న బస్తర్ జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు అనుమానిత మావోయిస్టులు హతమయ్యారు. నారాయణపూర్ జిల్లాలోని అబుజ్మద్ ప్రాంతంలో మావోయిస్టు నేతలు ఉన్నారన్న నిఘా వర్గాల సమాచారంతో జిల్లా రిజర్వ్ గార్డ్ (డీఆర్జీ), స్పెషల్ టాస్క్​ఫోర్స్ (ఎస్టీఎఫ్), బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) సంయుక్త బృందం గాలింపు చర్యలు చేపట్టగా కాల్పుల్లో ముగ్గురు మరణించారు.

ఈ ఏడాది జూన్​లో జరిగిన ఎన్​కౌంటర్​లో ఏడుగురు నక్సలైట్లు మరణించారు. . నారాయణపూర్-దంతెవాడ సరిహద్దు ప్రాంతంలో భద్రతా సిబ్బంది చేపట్టిన ఆపరేషన్​లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇదే ఘటనలో ముగ్గురు భద్రతా సిబ్బంది సైతం గాయపడ్డారు.

ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం 2024 జనవరి- ఆగస్ట్​​ మధ్యలో రాష్ట్రంలో భద్రతా దళాలతో జరిగిన వేర్వేరు ఎన్​కౌంటర్లలో 145 మంది మావోయిస్టులు హతమయ్యారు. ఛత్తీస్​గఢ్​లో ఈ ఏడాది బస్తర్ ప్రాంతంలో మావోయిస్టులు జరిపిన ఎదురుకాల్పుల్లో 34 మంది పౌరులు మరణించారు.

2026 మార్చి నాటికి దేశాన్ని నక్సలిజం నుంచి విముక్తం చేస్తామని ఆగస్టు 24న కేంద్ర హోం మంత్రి అమిత్​ షా హామీ ఇచ్చారు. ఛత్తీస్​గఢ్​లో వామపక్ష తీవ్రవాదంపై ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయి, ఛత్తీస్​గఢ్- పొరుగు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, డీజీపీలతో నిర్వహించిన అంతర్రాష్ట్ర సమన్వయ సమావేశంలో పాల్గొన్న అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారు. నక్సల్స్ తిరుగుబాటుకు వ్యతిరేకంగా తీసుకున్న చర్యలు, వామపక్ష తీవ్రవాదం (ఎల్​డబ్ల్యూఈ) సమస్యాత్మక తొమ్మిది రాష్ట్రాల్లో రెడ్ కారిడార్లుగా పిలిచే ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల పురోగతి రెండింటినీ కేంద్ర హోం మంత్రి నాటి సమావేశంలో పర్యవేక్షించారు.

సంబంధిత కథనం