3 States Assembly polls: 3 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల
3 States Assembly polls: మూడు ఈశాన్య రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం విడుదల చేసింది.
3 States Assembly polls: త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల అయింది. త్రిపురలో ఫిబ్రవరి 16న, నాగాలాండ్, మేఘాలయాల్లో ఫిబ్రవరి 27న పోలింగ్ జరగనుంది. మూడు రాష్ట్రాలకు ఓట్ల కౌంటింగ్, ఫలితాల వెల్లడి మార్చి 2న జరుగుతుందని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ప్రకటించారు.
3 States Assembly polls: మూడు రాష్ట్రాల్లో..
నాగాలాండ్ అసెంబ్లీ టర్మ్ మార్చి 12తో, త్రిపుర అసెంబ్లీ టర్మ్ మార్చి 15న, మేఘాలయ రాష్ట్ర అసెంబ్లీ కాలపరిమితి మార్చి 22తో ముగుస్తాయి. ఈ మూడు రాష్ట్రాల్లోనూ మొత్తం శాసన సభ్యుల సంఖ్య 60 చొప్పుననే ఉండడం విశేషం. ప్రస్తుతం త్రిపురలో బీజేపీ (BJP), నాగాలాండ్ లో నేషనలిస్ట్ డెమొక్రాటిక్ ప్రొగ్రెసివ్ పార్టీ (Nationalist Democratic Progressive Party NDPP), మేఘాలయలో నేషనల్ పీపుల్స్ పార్టీ (National People's Party NPP) అధికారంలో ఉన్నాయి.
3 States Assembly polls: సజావుగా నిర్వహిస్తాం
మొత్తం మూడు రాష్ట్రాల్లో కలిపి 62.8 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో మహిళా ఓటర్ల సంఖ్య 31.47 లక్షలు. అలాగే, తొలిసారి ఓటు వేయనున్న ఓటర్ల సంఖ్య 1.76 లక్షలు. మహిళలు, దివ్యాంగుల కోసం కొన్ని ప్రత్యేక బూత్ లను ఏర్పాటు చేయనున్నామని రాజీవ్ కుమార్ చెప్పారు. భౌగోళికంగా సమస్యాత్మక ప్రాంతాలు ఈ మూడు రాష్ట్రాల్లోనూ ఉన్నాయని, అయినా ఈ ఎన్నికలను సజావుగా నిర్వహించడానికి కట్టుబడి ఉన్నామన్నారు. ఇటీవల ఈ మూడు రాష్ట్రాల్లో పర్యటించి, ఎన్నికల నిర్వహణను సమీక్షించామని, ఎన్నికల సందర్భంగా ఎలాంటి హింసాత్మక ఘటనలను సహించబోమని తెలిపారు.