Gujarat elections : సామాజిక మాధ్యమాల్లో 'ఎలక్షన్​ వార్​'.. ఓట్ల కోసం పార్టీల తిప్పలు!-amid gujarat assembly elections parties extensively use social media to connect with voters ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Amid Gujarat Assembly Elections Parties Extensively Use Social Media To Connect With Voters

Gujarat elections : సామాజిక మాధ్యమాల్లో 'ఎలక్షన్​ వార్​'.. ఓట్ల కోసం పార్టీల తిప్పలు!

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Nov 18, 2022 12:00 PM IST

Gujarat assembly elections 2022 : గుజరాత్​లో ఎన్నికల హడావుడి తీవ్రస్థాయిలో కనిపిస్తోంది. ముఖ్యంగా.. సోషల్​ మీడియాలో అన్ని పార్టీలు విపరీతంగా ప్రచారాలు చేస్తున్నాయి. ఓటర్లను ఆకట్టుకునేందుకు ఏ ఒక్క అవకాశాన్నీ వదులుకోవడం లేదు.

ఓటు విలువపై అవగాహన కల్పించేందుకు రంగోలీ వేసిన విద్యార్థినులు
ఓటు విలువపై అవగాహన కల్పించేందుకు రంగోలీ వేసిన విద్యార్థినులు (PTI)

Gujarat assembly elections : ఈ సోషల్​ మీడియా యుగంలో ఎన్నికల ప్రచారాల శైలి పూర్తిగా మారిపోయింది. ఈ విషయం గుజరాత్​ అసెంబ్లీ ఎన్నికలతో మరోమారు రుజువైంది. ప్రజలను ఆకట్టుకునేందుకు ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదులుకోవడం లేదు రాజకీయ పార్టీలు. ఓవైపు ఇంటింటి ప్రచారాలు చేస్తూనే.. మరోవైపు తమ సోషల్​ మీడియా 'ఆర్మీ'తో ఓటర్లను ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నాయి.

ట్రెండింగ్ వార్తలు

'మాకు ఓటేయండి' అంటూ అధికార బీజేపీ.. ఫేస్​బుక్​, యూట్యూబ్​, ట్విట్టర్​, ఇన్​స్టాగ్రామ్​లో పోస్టుల మీద పోస్టులు పెడుతుంటే.. విపక్ష కాంగ్రెస్​, ఆమ్​ ఆద్మీ పార్టీలు.. వాట్సాప్​ వంటి యాప్స్​తో ఓటర్లకు చేరువయ్యే ప్రయత్నాలను ముమ్మరంగా చేస్తున్నాయి.

ప్రచారాల జోరు..

Gujarat BJP social media campaign : బీజేపీ ఐటీ సెల్​.. సోషల్​ మీడియాలో నిత్యం యాక్టివ్​గా ఉంటుంది. ఇక ఎన్నికల సమయంలో ఐటీ సెల్​ హడావుడి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు గుజరాత్​ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా చురుకుగా ఉంటోంది బీజేపీ ఐటీ సెల్​. కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్రంలో బీజేపీ సాధించిన ప్రగతిని చెప్పుకుంటూ పోస్ట్​లు సృష్టిస్తోంది. ఈ పోస్టులను వీలైనంతగా షేర్​ చేస్తూ.. ప్రజల్లోకి వెళుతోంది. ముఖ్యంగా.. 2001-14 మధ్య కాలంలో గుజరాత్​ సీఎంగా మోదీ చేసిన అభివృద్ధిని గుర్తుచేస్తోంది. అంతేకాకుండా.. 'ఆ గుజరాత్​ మే బనావ్యు ఛే(నేను ఈ గుజరాత్​ను తీర్చిదిద్దాను),' అని క్యాంపైన్​ను ప్రారంభించి.. సున్నితమైన అంశాలను కూడా ప్రస్తావిస్తోంది.

"ఇప్పటివరకు సోషల్​ మీడియాలో 5 క్యాంపైన్​లను చేశాము. రానున్న రోజుల్లో మరిన్ని తీసుకొస్తాము. ప్రజలకు నిత్యం కొత్తదనాన్ని అందించే విధంగా మా క్యాంపైన్​ను మార్చుకుంటూ ఉంటాము," అని ఆప్​ ప్రతినిధి మానన్​ దాని అన్నారు.

Gujarat congress WhatsApp groups : ఇక ప్రభుత్వ వ్యతిరేకతను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కాంగ్రెస్​ కృషి చేస్తోంది. 27ఏళ్లల్లో బీజేపీ చేసిందేమీ లేదని.. కాంగ్రెస్​తో గుజరాత్​ అభివృద్ధి సాధ్యపడుతుందని పోస్టులు సృష్టించి ప్రచారాలు చేస్తోంది. 27ఏళ్ల క్రితం నాటి కాంగ్రెస్​ పాలనను ప్రజలకు గుర్తుచేసే విధంగా సోషల్​ మీడియాను ఉపయోగించుకుంటోంది. ఇందుకోసం భారీ ప్రణాళికనే రచించింది. అసెంబ్లీ సీటుకో ప్రత్యేక ఎఫ్​బీ పేజీ, లేదా సామాజిక సంఘానికి సంబంధించిన ప్రత్యేక పేజీని రూపొందించి అందులో పోస్టులు చేస్తోంది. బూత్​, గ్రామ స్థాయిలో 50వేలకు పైగా వాట్సాప్​ గ్రూప్​ను ఏర్పాటు చేసింది. ఒక్కో గ్రూప్​లో ఒక్కో విధంగా ప్రచారాలు చేసేందుకు ముమ్మర ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం పలు కంటెంట్​ ఏజెన్సీలను నియమించుకుంది.

ఇక ఆప్​ విషయానికొస్తే.. అరవింద్​ కేజ్రీవాల్​ 'హామీల' వర్షంపై సోషల్​ మీడియాలో ఎక్కువ దృష్టిపెట్టినట్టు కనిపిస్తోంది. ఓటర్లతో కనెక్ట్​ అయ్యేందుకు వాట్సాప్​ను ఉపయోగించుకుంటోంది. కేజ్రీవాల్​ సోషల్​ మీడియా క్యాంపైన్​ను చూసుకునేందుకు 25మంది యువకులతో కూడిన ఓ బృందం ఉంది. వీరితో పాటు ఆప్​నకు 20వేలకుపైగా 'సోషల్​ మీడియా వారియర్లు' ఉన్నారు. వేలాది వాట్సాప్​ గ్రూప్​లు క్రియేట్​ చేసినట్టు ఆప్​ సభ్యులు చెబుతున్నారు.

నెట్టింట ఎలక్షన్​ వార్​..

బీజేపీకి ఫేస్​బుక్​లో 35లక్షల మంది, ఇన్​స్టాగ్రామ్​లో 57.8లక్షల మంది, ట్విట్టర్​లో 1.5మిలియన్​ లక్షల మంది, యూట్యూబ్​లో 45,600 మంది ఫాలోవర్లు ఉన్నారు. కమలదళం సోషల్​ మీడియా ప్రచారాల కోసం.. 20,000మంది వర్కర్లు, మరో 60వేల మంది వాలంటీర్లు పనిచేస్తున్నారు.

Gujarat assembly elections date : కాంగ్రెస్​కు.. ఫేస్​బుక్​లో 7లక్షల మంది, ఇన్​స్టాగ్రామ్​లో 64.3లక్షల మంది, ట్విట్టర్​లో 1.64లక్షల మంది, యూట్యూబ్​లో 8.91లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు.

ఆప్​నకు ఫేస్​బుక్​లో 5.67లక్షల మంది, ఇన్​స్టాగ్రామ్​లో 1.17లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఆప్​నకు ప్రత్యేకించి యూట్యూబ్​ ఛానెల్​ లేదు. పార్టీ జాతీయ యూట్యూబ్​ ఛానెల్​కు 42.3లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు.

ఓటర్లు.. ఎవరి పక్షం..?

Gujarat assembly elections results : 182 అసెంబ్లీ సీట్లున్న గుజరాత్​కు డిసెంబర్​ 1,5 తేదీల్లో ఎన్నికలు జరగనున్నాయి. మరి ఏ పార్టీ సోషల్​ మీడియా క్యాంపైన్​ ఫలిస్తుందో తెలుసుకోవాలంటే.. ఫలితాలు వెలువడే డిసెంబర్​ 8 వరకు వేచి చూడాల్సిందే.

WhatsApp channel