Tirupati laddu Nandini Ghee : నందిని నెయ్యి ఎందుకు అంత ఫేమస్​? దీని ప్రత్యేకత ఏంటి?-all you need to know about nandini cow ghee used in tirupati laddu ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Tirupati Laddu Nandini Ghee : నందిని నెయ్యి ఎందుకు అంత ఫేమస్​? దీని ప్రత్యేకత ఏంటి?

Tirupati laddu Nandini Ghee : నందిని నెయ్యి ఎందుకు అంత ఫేమస్​? దీని ప్రత్యేకత ఏంటి?

Sharath Chitturi HT Telugu
Sep 20, 2024 01:32 PM IST

Nandini Ghee Tirupati laddu : తిరుపతి లడ్డూ వివాదం నేపథ్యంలో ఇప్పుడు అందరి దృష్టి నందిని నెయ్యిపై పడింది. ఈ నందిని ఆవు నెయ్యి ఎందుకు అంత ఫేమస్​? దీని ప్రత్యేక ఏంటి? ఇక్కడ తెలుసుకోండి.

నందిని నెయ్యి ఎందుకు అంత ఫేమస్​?
నందిని నెయ్యి ఎందుకు అంత ఫేమస్​?

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాల్లో జంతువుల కొవ్వుల అవవేషాలు వెలుగు చూశాయని, లడ్డూ నాణ్యత తగ్గిపోయిందని ఆంధ్రప్రదేశ్​ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు సర్వత్రా సంచలనం సృష్టించాయి. ఈ నేపథ్యంలో 2023కు ముందు వరకు శ్రీవారి లడ్డూ కోసం దాదాపు 50ఏళ్ల పాటు ఉపయోగించిన నందిని ఆవు నెయ్యి వార్తలకెక్కింది. ఈ నేపథ్యంలో అసలు ఈ నందిని నెయ్యి ఎందుకు అంత ఫేమస్​? దీని ప్రత్యేకత ఏంటి? ఇక్కడ తెలుసుకుందాము..

నందిని నెయ్యి ఎందుకు అంత ఫేమస్​?

భారతీయ డైరీ పరిశ్రమలో 'నందిని మిల్క్​' బ్రాండ్​కి ప్రత్యేక స్థానం ఉంది. 1974 నుంచి కర్ణాటక డైరీ డెవలప్​మెంట్​ కార్పొరేషన్​ కింద పనిచేస్తున్న ఈ నందిని మిల్క్​.. ఆ రాష్ట్రంలో దాదాపు ప్రతి ఇంట్లో ఒక భాగం! అమూల్​ తర్వాత దేశంలో అతిపెద్ద మిల్క్​ కార్పొరేషన్​గా నందిని మిల్క్​కి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

పాలు, పెరుగు, ఆవు నెయ్యి, పన్నీర్​, చీజ్​, బటర్​, ఫ్లేవర్డ్​ మిల్క్​ వంటి డైరీ ఉత్పత్తులతో పాటు చాక్లెట్లు, బిస్కెట్లను కూడా నందిని మిల్క్​ బ్రాండ్​ కింద కేఎంఎఫ్​ తయారు చేస్తుంది. వీటికి మంచి డిమాండ్​ ఉంటుంది. అయితే పాలతో పాటు నందిని ఆవు నెయ్యికి ప్రత్యేక గుర్తింపు ఉంది.

కేఎంఎఫ్​ ప్రకారం.. స్వచ్ఛమైన నందిని నెయ్యిని ఆవు పాలతో, సంప్రదాయ పద్ధతిలో తయారు చేస్తారు. దీని నాణ్యతను పరీక్షించేందుకు పక్కాగా చర్యలు తీసుకుంటారు. అనేకమార్లు క్వాలిటీ చెక్​ జరిగిన తర్వాతే.. ఇది మార్కెట్​లోకి వస్తుంది. అందుకే నందిని నెయ్యికి మంచి గుర్తింపు ఉంది.

పైగా కొంత కాలం క్రితం వరకు తిరుపతి లడ్డూలో ఉపయోగించిన ఈ నందిని నెయ్యికి AGMARK సర్టిఫికేట్​ కూడా ఉంది. AGMARK అంటే.. "అగ్రికల్చర్​- మార్క్:​. క్వాలిటీతో పాటు ఇతర స్టాండర్డ్స్​ని పాటించే ఉత్పత్తులకు మాత్రమే ఈ AGMARK సర్టిఫికెట్​ లభిస్తుంది. ఈ సర్టిఫికెట్​ ఉంటే.. ప్రాడక్ట్​పై కొనుగోలుదారులు, విక్రయించేవారిలో నమ్మకం మరింత పెరుగుతుందని విశ్వాసం. ఈ సర్టిఫికేట్​ని పొందిన తర్వాత.. సదరు ప్రాడక్ట్​ని అంతర్జాతీయంగా కూడా మార్కెటింగ్​ చేసుకోవచ్చు.

నందిని నెయ్యి మార్కెట్​లోకి వచ్చే ముందు ఇంత ప్రాసెస్​, ఇంత క్వాలిటీ చెక్​ ఉంటుంది కాబట్టే.. దీని ధర కూడా కాస్త ఎక్కువగా ఉంటుంది. వాస్తవానికి.. తమ కన్నా తక్కువ ధరకు ఎవరైనా నెయ్యిని విక్రయిస్తున్నారంటే.. దాని నాణ్యత కచ్చితంగా తక్కువగానే ఉంటుందని కేఎంఎఫ్​ అధ్యక్షుడు కే. భీమా నాయక్​ చెప్పారు. అది నందిని ఉత్పత్తులపై ఆయనకి ఉన్న నమ్మకం.

కర్ణాటకలో 200ఎంఎల్​ నందిని నెయ్యి ధర రూ. 155గా ఉంది. 500ఎంఎల్​ ధర రూ. 335, 1000ఎంఎల్​ ధర రూ. 670గా ఉన్నాయి.

100ఎంఎల్​ నందిని నెయ్యి నుంచి 897 కేలరీల ఎనర్జీ లభిస్తుంది. 99.7గ్రాముల కార్బోహైడ్రేట్స్​ వస్తాయి.

లడ్డూ తయారీలో నెయ్యి చాలా ముఖ్యం అన్న విషయం తెలిసిందే. నెయ్యి నాణ్యత ఎంత ఎక్కువగా ఉంటే, లడ్డూ రుచి ఎంత గొప్పగా ఉంటుంది!

నందిని నెయ్యిని ఎందుకు వాడలేదు?

2023 వరకు శ్రీవారి లడ్డూల్లో నందిని నెయ్యినే వాడేవారు. కానీ నందిని పాల ధరలను పెంచుతున్నట్టు 2023లో కర్ణాటక కేబినెట్​ ప్రకటించింది. ఫలితంగా నందిని నెయ్యి ధరలు కూడా పెరిగాయి. ధరల పెరుగుదలను గమనించిన అప్పటి జగన్​ ప్రభుత్వం.. తక్కువ బిడ్డింగ్​ వేసిన కంపెనీకి శ్రీవారి లడ్డూ తయారీలో వినియోగించే నెయ్యి కాంట్రాక్ట్​ని ఇచ్చింది.

Whats_app_banner

సంబంధిత కథనం