YSRCP Petition: లడ్డూ ప్రసాదాల వ్యవహారంపై హైకోర్టులో వైసీపీ లంచ్ మోషన్ పిటిషన్, న్యాయవిచారణకు ఆదేశించాలని వినతి
YSRCP Petition: తిరుమల లడ్డూ ప్రసాదాల్లో జంతువుల కొవ్వు ఆరోపణలపై వైఎస్సార్సీపీ ఏపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. వైవీ సుబ్బారెడ్డి తరపున ఏపీ హైకోర్టులో మాజీ అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.
YSRCP Petition: టీటీడీ లడ్డూ ప్రసాదాల వ్యవహారం హైకోర్టును చేరింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ఆరోపణలపై టీటీడీ మాజీ ఛైర్మన్, వైఎస్సార్సీపీ ఎంపీ వైవీ.సుబ్బారెడ్డి హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. సుబ్బారెడ్డి తరపున మాజీ ఏఏజీ పొన్నవోలు పిటిషన్ ఫైల్ చేశారు.
సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు దురదృష్టకరమని, ముఖ్యమంత్రి స్థాయిలో ఆయన చేసిన వ్యాఖ్యలు దిగజారిన రాజకీయ పరిణామాలకు నిదర్శనమని పొన్నవోలు ఆరోపించారు. బాబు రాజకీయ ప్రయోజనాలకు దేవుళ్లను కూడా వదల్లేదని, ప్రపంచ వ్యాప్తంగా శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతీశారని, ఈ వ్యవహారంలో ఏది నిజమో తేల్చాలని పిటిషన్‌లో పేర్కొన్నారు.
గౌరవనీయమైన స్థానంలో ఉన్న సీఎం పూర్వాపరాలు పరిశీలించకుండా దిగజారి వ్యాఖ్యలు చేశారని మాజీ ఏఏజీ సుధాకర్ రెడ్డి ఆరోపించారు. కోట్లాది హిందువుల మనోభావాలు దెబ్బతిన్నందున ఈ విషయంలో కోర్టును ఆశ్రయించినట్టు చెప్పారు. పిటిషన్ అనుమతించిన న్యాయస్థానం బుధవారం కేసులో వాదనలు వింటామని పేర్కొంది.
ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై సిట్టింగ్ జడ్జి తో విచారణ జరిపించాలని, వైసీపీ తరపున ఏ విచారణకైనా తాము సిద్ధమని, జ్యూడిషియల్ విచారణతోనే నిజాలు వెలుగు చూస్తాయని లంచ్ మోషన్ పిటిషన్‌లో పేర్కొన్నట్టు సుధాకర్ రెడ్డి తెలిపారు. సిబిఐ విచారణ, సిట్టింగ్ జడ్జితో విచారణ, హైకోర్టు కమిటీ ద్వారా విచారణ జరిపినా తమకు అభ్యంతరం లేదని వైవీ సుబ్బారెడ్డి తరపున పిటిషన్ దాఖలు చేసిన పొన్నవోలు సుధాకర్ రెడ్డి తెలిపారు.