Pension : పెన్షన్ డబ్బుల కోసం 2 కిలోమీటర్లు పాకుతూ వెళ్లిన 80 ఏళ్ల వృద్ధురాలు
Pension : పెన్షన్ కోసం రెండు కిలోమీటర్లు మోకాళ్ల మీద పాకుతూ వెళ్లింది ఓ వృద్ధురాలు. ఈ ఘటనకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. వృద్ధురాలి పరిస్థితి చూసి ఇంటికి పెన్షన్ తెచ్చిస్తే ఏమైందని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
ఒడిశాలోని కియోంజర్ జిల్లాలో 80 ఏళ్ల మహిళ తన వృద్ధాప్య పింఛను కోసం దాదాపు రెండు కిలోమీటర్లు మోకాళ్ల మీద పాకుతూ పంచాయతీ కార్యాలయానికి వెళ్లాల్సి వచ్చింది. ఈ సంఘటన విమర్శలకు దారితీసింది. వృద్ధులు, వికలాంగ లబ్ధిదారులకు ఇంటి వద్దకే వెళ్లి పింఛను ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించినప్పటికీ కిందిస్థాయిలో పరిస్థితులు వేరుగా ఉన్నాయి.
80 ఏళ్ల వృద్ధురాలు తన వృద్ధాప్య పింఛను కోసం ఒడిశాలోని కియోంజర్‌లోని టెల్కోయ్ బ్లాక్‌లో పంచాయతీ కార్యాలయానికి 2 కిలోమీటర్లు పాకుతూ వెళ్లిన ఘటనే ఇందుకు ఉదాహరణ. రైసువాన్ గ్రామ పంచాయతీకి చెందిన పాతూరి దేహూరి వృద్ధాప్యం, అనారోగ్యం కారణంగా సరిగ్గా నడవలేరు. రోజువారీ ఖర్చులు పెన్షన్ డబ్బుతోనే సరిపెడుతుంది.
పంచాయతీ విస్తరణ అధికారి(పీఈఓ) పింఛను డబ్బులు తీసుకోవడానికి కార్యాలయానికి వెళ్లాలని ఆమెతో చెప్పాడు. పింఛను ఇవ్వడానికి ఇంటికి ఎవరూ రాకపోవడంతో పంచాయతీ కార్యాలయానికి 2కిలోమీటర్లు పాకుతూ వెళ్లింది వృద్ధురాలు.
'నేను నా రోజువారీ ఖర్చుల కోసం ఈ పెన్షన్‌పై ఆధారపడతాను. కానీ దానిని అందించడానికి నా ఇంటికి ఎవరూ రాలేదు. పంచాయతీ కార్యాలయానికి పాకుతూ వెళ్లడం తప్ప నాకు వేరే మార్గం లేదు.' అని వృద్ధురాలు వివరించింది.
ఈ విషయం తెలుసుకున్న రైసువాన్ సర్పంచ్ బాగున్ చాంపియా మాట్లాడారు. ఆమె ఇంటికే వెళ్లి రేషన్ కూడా అందించాలని పీఈవో, సప్లయ్ అసిస్టెంట్‌లకు సూచించారు. వచ్చే నెల నుంచి ఆమె ఇంటికి రేషన్ అందజేస్తామని, పెన్షన్ కూడా ఇంటికి వెళ్లి ఇప్పిస్తామని వెల్లడించారు.
అదేవిధంగా భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా తక్షణమే చర్యలు తీసుకుంటామని టెల్కోయ్ బ్లాక్ డెవలప్‌మెంట్ ఆఫీసర్(బీడీఓ) గీతా ముర్ము హామీ ఇచ్చారు. నడవలేని స్థితిలో ఉన్న లబ్ధిదారులకు ఇంటి వద్దకే వెళ్లి ఇవ్వాలని పీఈవోలను ఆదేశించామని తెలిపారు.
ఈ సంఘటన స్థానికంగా విమర్శలకు దారితీసింది. సోషల్ మీడియాలోనూ వైరల్ అయింది. అక్కడి స్థానిక అధికారులపై నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు.