Hajj pilgrims: హజ్ యాత్రలో 68 మంది భారతీయులు మృతి; మొత్తంగా 900 కి చేరిన మరణాల సంఖ్య
Hajj pilgrims: ఈ ఏడాది హజ్ యాత్రలో అనారోగ్యం, గరిష్ట ఉష్ణోగ్రతలు తదితర కారణాల వల్ల సుమారు 900 మంది యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు. వారిలో 68 మంది భారతీయులు కూడా ఉన్నారు. ఎండ తీవ్రత, అధిక ఉష్ణోగ్రతల కారణంగా ఎక్కువ మంది హజ్ యాత్రికులు చనిపోతున్నారు.
Hajj pilgrims: ఈ ఏడాది హజ్ యాత్రకు వెళ్లిన 68 మంది భారతీయులు మరణించారని, ఇది తీవ్రమైన వేడి, అధిక ఉష్ణోగ్రతలతో పాటు ఇతర అనారోగ్య కారణాల వల్ల జరిగిందని సౌదీ దౌత్యాధికారి వెల్లడించారు. ఈ ఏడాది హజ్ యాత్రలో మొత్తం మరణాల సంఖ్య 900 దాటింది.
68 మంది భారతీయులు
హజ్ యాత్ర ముస్లింలకు అత్యంత పవిత్రమైనది. జీవితంలో ఒక్కసారైనా హజ్ యాత్రకు వెళ్లాలని ఇస్లాం చెబుతుంది. అందువల్ల, ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు వేల సంఖ్యలో హజ్ యాత్రలో పాల్గొంటారు. ఈ సంవత్సరం ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా, ముఖ్యంగా మండే ఎండలు, వడ దెబ్బ, అత్యధిక ఉష్ణోగ్రతల కారణంగా వందల సంఖ్యలో హజ్ యాత్రికులు ప్రాణాలు కోల్పోతున్నారు. హజ్ యాత్రలో సాధారణంగా వయో వృద్ధులు ఎక్కువగా పాల్గొంటారు. వృద్ధాప్యం, అనారోగ్య సమస్యలకు తోడు ప్రతికూల వాతావరణం కారణంగా హజ్ యాత్రలో పాల్గొంటున్న వృద్ధులు ఎక్కువగా మృత్యువాత పడుతున్నారు.
ఇప్పటివరకు 900 మరణాలు
హజ్ యాత్రలో మరణించిన భారతీయుల సంఖ్యపై భారత ప్రభుత్వం ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. కాగా, హజ్ యాత్రలో 550 మరణాలు నమోదైనట్లు రెండు రోజుల క్రితం ఇద్దరు అరబ్ దౌత్యవేత్తలు తెలిపారు. వారిలో 323 మంది ఈజిప్షియన్లు, 60 మంది జోర్డానియన్లు ఉన్నారు. వారిలో అత్యధికులు అధిక ఉష్ణోగ్రతల కారణంగా మరణించారు. ఇండోనేషియా, ఇరాన్, సెనెగల్, ట్యునీషియా, ఇరాక్ నుంచి వచ్చిన హజ్ యాత్రికులు కూడా వివిధ కారణాల వల్ల ప్రాణాలు కోల్పోయారు. కాగా, ఈ సంవత్సరం హజ్ యాత్రలో మరణించిన వారి సంఖ్య సుమారు 900 గా ఉంది. మంగళవారం మక్కాలో 51.8 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది.