Heatwave update: నిప్పుల కుంపటిలా నాగ్ పూర్; 56 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదు
మరోసారి భానుడు తన ప్రభావం చూపుతున్నాడు. నైరుతి రుతుపవనాలు భారత్ లో ప్రవేశించిన నేపథ్యంలో, ఈ ఏడాది వేసవి చివరలో తన ప్రతాపాన్ని భారతీయులకు రుచి చూపుతున్నాడు. మహారాష్ట్రలోని నాగపూర్ లో శుక్రవారం 56 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. మరోవైపు, వడగాల్పులు ఉత్తర భారత్ ను అతలాకుతలం చేస్తున్నాయి.
నాగపూర్ లో 56 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు (AFP)
Nagpur temperature: ఈ వేసవిలో భారతదేశంలోని అనేక ప్రాంతాలను వడగాలులు ముంచెత్తాయి, ఫలితంగా బీహార్, జార్ఖండ్, ఒడిశాలో మరణాలు సంభవించాయి. దేశ రాజధాని ఢిల్లీ తీవ్ర నీటి ఎద్దడితో సతమతమవుతుండటంతో ఖాళీ బకెట్లతో వాటర్ ట్యాంకర్ల వెంట పరుగులు తీయాల్సి వస్తోంది. పొరుగు రాష్ట్రాల నుంచి అదనపు సరఫరా కోరుతూ ఢిల్లీ ప్రభుత్వం ఇప్పటికే సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
భారత్ లో వడగాల్పుల పరిస్థితులపై అప్ డేట్స్
- మహారాష్ట్రలోని నాగపూర్ లో ఉన్న ఆటోమేటిక్ వెదర్ స్టేషన్ (AWS) లో 56 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. రాందాస్ పేటలోని డాక్టర్ పంజాబ్ రావ్ దేశ్ ముఖ్ కృషి విద్యాపీఠానికి చెందిన 24 హెక్టార్ల వ్యవసాయ క్షేత్రం మధ్యలో ఏడబ్ల్యూఎస్ ఉంది. అయితే, నాగపూర్ లో గరిష్ట ఉష్ణోగ్రతకు సంబంధించి ఐఎండీ ఎటువంటి ధృవీకరణ ఇవ్వలేదు. ప్రాంతీయ వాతావరణ కేంద్రంలోని ఒక సీనియర్ శాస్త్రవేత్త ఏడబ్ల్యూఎస్ లోపభూయిష్టంగా ఉండవచ్చని అన్నారు.
- ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రత 45.4 డిగ్రీల సెల్సియస్ గా ఉందని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. ఢిల్లీలో పగటిపూట తేలికపాటి వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది.
- నైరుతి రుతుపవనాలు (Monsoon) ఈశాన్య బంగాళాఖాతంలోని మిగిలిన ప్రాంతాలు, వాయువ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలు, త్రిపుర, మేఘాలయ, అస్సాంలోని మిగిలిన ప్రాంతాలు, ఉప హిమాలయ పశ్చిమ బెంగాల్, సిక్కింలోని చాలా ప్రాంతాలకు విస్తరించాయని ఐఎండి పేర్కొంది.
- మధ్య అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలు, దక్షిణ అరేబియా సముద్రంలోని మిగిలిన ప్రాంతాలు, లక్షద్వీప్ ప్రాంతం, కేరళ, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలు, తమిళనాడు, నైరుతి బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలకు వచ్చే 2-3 రోజుల్లో నైరుతి రుతుపవనాలు మరింత విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని ఐఎండీ తెలిపింది.
- మధ్యప్రదేశ్లో వడగాల్పులు (heatwave) కొనసాగుతున్నాయి. సిధి జిల్లాలో 48.2 డిగ్రీల సెల్సియస్, ఛత్తర్ పూర్లోని ఖజురహోలో 47 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది.
- రాజస్థాన్లో ఎండ వేడిమి కారణంగా సంభవించిన మరణాలను హైకోర్టు సుమోటోగా తీసుకుంది. వడగాల్పులు, చలిగాలులను జాతీయ విపత్తులుగా ప్రకటించాల్సిన అవసరం ఉందని కోర్టు పేర్కొంది.
- బిహార్లో లోక్ సభ ఎన్నికల విధుల్లో ఉన్న ఒక ఉద్యోగి సహా 19 మంది వడదెబ్బకు మృతి చెందారు. వడగాల్పుల దృష్ట్యా తుది దశ ఎన్నికలు జరుగుతున్న పలు చోట్ల వైద్య బృందాలను మోహరించారు. ఇప్పటికే మోహరించిన పోలింగ్ అధికారులు ఎవరైనా ఉష్ణోగ్రతల కారణంగా అస్వస్థతకు గురైతే రిజర్వ్ పోలింగ్ అధికారులు విధులకు హాజరవుతారు.
- ఒడిశాలో వడగాల్పుల పరిస్థితులపై ఆ రాష్ట్ర స్పెషల్ రిలీఫ్ కమిషనర్ సత్యబ్రతా సాహు మాట్లాడుతూ సంబల్పూర్, బలంగీర్, సురేందర్గఢ్, అంగుల్, ధెంకనాల్ తదితర ప్రాంతాల్లో వడగాల్పులు వీస్తున్నాయని తెలిపారు. గత 24 గంటల్లో ఒడిశాలో వడదెబ్బకు గురై రూర్కెలాలో 12 మంది సహా 41 మంది మరణించారు.